ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
భీమసేన జరాసంధుల మల్లయుద్ధము (సం. 2-21-10)
మ. సమసత్త్వాతిశయుల్‌ వృకోదర జరాసంధుల్‌ మహోద్యత్పరా
క్రమ మొప్పం గడు నల్గి యొండొరులఁ జుల్కం దాఁకి రన్యోన్యదు
ర్దమ దోర్దండ పటుప్రహార జనితధ్వానంబు బ్రహ్మాండ భాం
డము నిండన్‌ లయకాల దండధర చండక్షోభమో నా జనుల్‌.
203
క. కర్షితరిపు లన్యోన్యా | కర్షణ సంకర్షణాపకర్షణముల సా
మర్షు లయి పెనఁగి రాహవ | హర్షంబునఁ బవనసుత బృహద్రథపుత్త్రుల్‌.
204
క. వ్యాయామకర్కశ స్థిర | కాయుల యుద్ధము భయానకం బయ్యె మహో
గ్రాయస పరిఘాయిత కఠి | నాయత భుజదండ దారుణాఘాతములన్‌.
205
చ. అతులబలుల్‌ పరస్పర జయార్థులు పార్థివపుంగవుల్‌ మరు
త్సుత మగధేశ్వరుల్‌ సమరశూరులు దారుణలీలఁ బోరి రూ
ర్జిత భుజదర్ప మేర్పడఁగ సింహగజేంద్రములట్లు, వజ్ర ప
ర్వతముల యట్లు, ఘోరతర వాసవ వృత్రులయట్లు నిద్దఱున్‌.
206
వ. ఇట్లు కార్తిక మాసంబునం బ్రథమ దివసంబునం దొడంగి భీమజరాసంధు లెడ యుడుగక యొండొరులం బట్టియుఁ గిట్టియు నడిచియుం బొడిచియుఁ దాఁచియుం ద్రోచియు మహాయుద్ధంబు సేయుచుం ద్రయోదశినాఁ డిద్దఱుం గిట్టి మల్లయుద్ధ కౌశలం బేర్పడం బెనంగు నెడఁ జతుర్దశినాఁటి రాత్రియందు జరాసంధు నతిశ్రాంతభావం బుపలక్షించి యధోక్షజుండు భీమున కి ట్లనియె. 207
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )