ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
భీముఁడు జరాసంధుని సంహరించుట (సం. 2-22-3)
చ. విరహితసత్త్వుఁ డయ్యెఁ బ్రతివీరుఁడు; వీని నశేష ధారుణీ
శ్వరనికరాపరాధు నతిసాహసికున్‌ వధియించి, నీ భుజ
స్థిరత యెలర్ప నయ్యనిలదేవుబలంబును నీ బలంబు భా
సురముగ మాకుఁ జూపుము విశుద్ధయశోనిధి! మారుతాత్మజా!
208
వ. అని ప్రబోధించిన ననిలతనయుం డనిలదేవుం దలంచి తత్ప్రసాదంబున నధికసత్త్వసమేతుండై. 209
ఉ. ఆతనిఁ బట్టి యెత్తి నిహతాహితవీరుఁడు వానిముక్కునన్‌
వాతను గర్ణరంధ్రముల వారక శోణితధార లొల్కఁగా
వాతసుతుండు వీచె శతవారము లుద్ధత చండ వాత సం
ఘాత వివర్తమాన తృణఖండసముం డగుచుండ మాగధున్‌.
210
వ. మఱియును. 211
క. వెఱచఱవఁ బట్టికొని వడిఁ | జఱచి జరాసంధుసంధిసంధుల యెమ్ముల్‌
విఱిచి వధియించి యార్చెను | వఱలఁగ భీముండు భువనవలయం బద్రువన్‌.
212
చ. అవనితలంబు వ్రస్సెనొ, హిమాచలశృంగము వ్రయ్యలయ్యెనో,
శ్రవణ విదారణం బయిన శబ్దము దా నిది యేమి యొక్కొ భై
రవమయి విన్చె నంచును బురంబునవారు భయంబు వొంది; రం
దువిదలగర్భముల్‌ గలఁగె; నుక్కడఁగెన్‌ మగధేశు సైన్యముల్‌.
213
వ. ఇట్లు భీమసేనుండు జరాసంధుఁ జంపి వాని వధియించుట జగద్విదితంబుగాఁ దదీయ గృహద్వార తోరణ సమీపంబునం దత్కళేబరంబు వైచిన నది సర్వజన భయంకరంబయి యుండె; నంత నాదిత్యోదయంబున. 214
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )