ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
జరాసంధుని కుమారుడైన సహదేవు నభిషిక్తుఁ గావించి శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో నింద్రప్రస్థమున కరుగుట (సం. 2-22-40)
సీ. గరుడధ్వజుం డప్డు కరుణాసమేతుఁడై | యమ్మాగధుల కెల్ల నభయ మిచ్చి,
మొగి జరాసంధుచే నిగృహీతులయి యున్న | పృథివీపతుల విడిపించి చెఱలు,
మోక్షితు లైన సర్వక్షత్త్రియులచేత | సంశుద్ధరత్న పుంజములఁజేసి
పూజితుండయి, తన తేజంబు వెలుఁగంగ | సహదేవు నజ్జరాసంధతనయు
 
ఆ. నోడ కుండు మని తదున్నత రాజ్యంబు | నందు నిలిపి, హృదయహారి వివిధ
రత్నరాజి సుందరంబైన మగధేశు | రథముఁ దేరఁ బనిచె రమణతోడ.
215
వ. ‘తొల్లి తారకాసుర సంగ్రామంబున నింద్రారూఢంబయిన దాని నింద్రువలన వసువను రాజు వడసె, వానివలన బృహద్రథుండు వడసె’ నని తద్దివ్యరథప్రభావంబు సెప్పుచు భీమార్జున సమేతుండయి యా రథం బెక్కి చక్రధరుం డఖిలరాజచక్రంబుతో నింద్రప్రస్థగమనోన్ముఖుండై గరుడనిం దలంచుడుఁ దత్‌క్షణంబ. 216
క. అనలప్రభాభిశోభిత | ఘనతర తనుదీప్తు లొప్పఁగా వచ్చి వడిన్‌
వినతాతనయుఁడు వినయా | వనతోరుశిరస్కుఁ డయ్యె వనజాక్షునకున్‌.
217
వ. ఇట్లు వచ్చిన వైనతేయు నతిప్రీతిం దద్దివ్యరథసారథ్యంబునందు నియోగించి, మనోవాయు వేగంబునం గృష్ణ భీమ విజయు లింద్రప్రస్థపురంబు ప్రవేశించి రంత. 218
మ. ‘జనసంత్రాసకరున్‌ మహోద్ధతు జరాసంధున్‌ హరిప్రేరణం
బున భంజించెఁ బ్రభంజనాత్మజుఁడు; భూభుగ్వీరులం దన్నిరో
ధన నిర్ముక్తులఁ జేసె; నింకఁ జతురంతక్షోణికిన్‌ ధర్మనం
దను సామ్రాజ్యము పూజ్యమయ్యె’ నని మోదం బంది రుర్వీజనుల్‌.
219
క. ‘ఆయుధనిహతుఁడు గాని య | జేయు జరాసంధు భీమసేనుఁడు విజయ
శ్రీ యెసఁగ నోర్చెఁగా క | త్యాయత భుజశక్తి నొరుల కలవియె?’ యంచున్‌.
220
క. పురజను లాశ్చర్యంబునఁ | గర మనురాగమునఁ బరమ కౌతుకమునఁ జూ
చిరి బోరన వచ్చి వృకో | దర దామోదర సురేంద్రతనయులఁ బ్రీతిన్‌.
221
వ. కృష్ణభీమ విజయు లిట్లు విజయ విభాసితులయి వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి జరాసంధు బంధనంబువలనం దమచేత మోక్షితులైన మహీపతుల నెల్లం జూపిన. 222
క. సవినయ నతోత్తమాంగుల | నవనీశుల నందఱను యథార్హప్రియగౌ
రవమునఁ బూజించి కురు | ప్రవరుఁడు తద్దేశములకుఁ బరువడిఁ బంచెన్‌.
223
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )