ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుం డుత్తరదిగ్విజయంబు సేయుట (సం. 2-23-7)
సీ. అగ్నిదత్తంబైన యద్దివ్యరథ మెక్కి | గాండీవధరుఁ డతిఘర్మసమయ
ఘర్మాంశుఁడును బోలెఁ గౌబేర దిగ్విజ | యార్థ ముగ్ర ప్రతాపాగ్ని వెలుఁగఁ
జని పుళిందావనీశ్వరు నోర్చి, ప్రతివింధ్యుఁ | డనువాని నోడించి, యశ్రమమున
మఱి యఖిల ద్వీప మండలేశుల నెల్ల | వశవిధేయులఁ జేసి, వారు దన్ను
 
ఆ. భక్తిఁ గొలిచి రాఁగఁ బ్రాగ్జ్యోతిషంబుపై | విడిసెఁ; దత్పురమున విభుఁ డనంత
బలముతోడఁ బన్ని భగదత్తుఁ డేతెంచి | విజయుఁ దాఁకె సమరవిజయకాంక్ష.
229
వ. ఇట్లు శబర సాగరానూపవాసులైన యోధవీరులతోఁ బన్ని భగదత్తుండు పార్థుతో నెనిమిది దివసంబులు మహాయుద్ధంబు సేసి తదీయ బాణభగ్న బలుండై పార్థున కి ట్లనియె. 230
క. ఏ నింద్ర సఖుఁడ; నీవును | భూనాథ! సురాధినాథ పుత్త్రుండవు; నీ
తో నని సేయుట యుచితమె? | యే నోడితిఁ జెప్పు మెద్ది యిష్టము నీకున్‌.
231
వ. ‘దానిన చేయుదు’ ననిన విని భగదత్తునకుఁ బార్థుం డి ట్లనియె. 232
క. కురువిభుఁడు రాజసూయా | ధ్వర మొనరింపం గడంగె; ధర్మజుఁడు నిరం
తరధర్మశీలుఁ; డాతని | కరి వెట్టుము; రమ్ము ప్రీతి నమ్మఖమునకున్‌.
233
వ. అని యా భగదత్తుచేత నపరిమిత ధనరాసులు గొని ధనదదిశాభిముఖుండయి ధనంజయుం డరిగి. 234
క. అతుల చతురంగ సేనా | యుతుఁ డంతర్గిరి బహిర్గి రోపగిరుల భూ
పతుల నని నోర్చి శౌర్యో | న్నతిఁ గొనియెను వారిచేత నానాధనముల్‌.
235
వ. మఱియు నులూక దేశాధిపతియగు బృహంతునిఁ బరాజితుం జేసి, యుత్తరోలూక వామదేవ మోదాపుర సుదామ సుసంకులంబు లను దేశంబుల రాజుల జయించి, దేవప్రస్థంబున సేనాబిందు నోడించి, విష్వగశ్వుండనురాజువిక్రమం బడంచి, పార్వతేయుల గర్వం బుడిపి, బర్బర శబర తురుష్కపతుల వశగతులంజేసి, మాళవ పౌండ్ర కాశ్మీర త్రిగర్త లోహిత సుధన్వగాంధార కాంభోజ కోసల పతులచేత విచిత్ర రత్న కాంచన వస్తు వాహన నివహంబులు గొని, చిత్రాయుధ రక్షితంబైన సింహపురంబు మథించి, సింహాసనాసీనులయిన వనచర దస్యుల వశ్యులంజేసి, శ్వేతపర్వతం బతిక్రమించి యట చని కాంభోజ కటకుండను రాజుచేతం బూజితుండై, హాటకదేశంబున మానసం బనుకొలను ఋషికుల్యంబును జూచి, యందుల రాజులచేత నపరిమిత పదార్థంబులం దిత్తిరి కల్మాష మండూకాఖ్య మయూరహంస శుక సవర్ణంబులైన హయంబులం బర్వత నిభంబులైన యిభంబులం గొని, (హేమకూట నిషధాచలంబులు గడచి గంధర్వనగరంబులు గెలిచి, శత సహస్ర యోజనాయతం బయి శుద్ధ సువర్ణమయం బయి తేజోరాశి యయిన మేరు మహీధరంబు నాలోకించి, జంబూ మహావృక్షంబును జంబూ మహానదియునుం జూచి, తత్తీరంబున మేరువునకుం బ్రదక్షిణంబుగాఁజని, గంధమాదన పర్వతం బతిక్రమించి, తద్దిశాధిపతులైన సిద్ధ విద్యాధర చారణ గంధర్వులచేత నానా విచిత్రవస్తు వాహనంబులు గొని మాల్యవన్నీల పర్వతంబులు గడచి) యుత్తర కురుదేశములకుం జని హరివాసం బను పురంబుపై విడిసిన. 236
సీ. తద్ద్వారపాలకుల్‌ దారుణాకారు ల | పార బలాఢ్యులు పార్థుకడకుఁ
జనుదెంచి సురరాజసన్నిభు నాతనిఁ | జూచి యచ్చెరు వడి ‘శూరు లెందు
నీయట్టిరే కురునృపవీర! పర్యాప్త | మయ్యె నీ విజయ వీర్యాతిశయము;
వసుమతీనాథు లెవ్వరు నిట్లు బలిమిమై | నిట వచ్చిరే తొల్లి యే యుగముల?
 
ఆ. నున్నతప్రతాప! యుత్తర కురు భూము | లండ్రు జనులు వీని; నవనిచరుల
కివి యగోచరంబు; లిందు సాధించి యె | ద్దియును గొనఁగలేదు తివిరి నీకు.
237
వ. అయినను నీవచనంబు సేయంగలవారము మమ్ముఁ బనుపు మనిన వారికి నర్జునుం డి ట్లనియె. 238
తే. రాజసూయాధ్వరము ధర్మరాజు సేయ | నుత్సహించినవాఁడు తదుత్సవమున
కిండు మీయందుఁ గల వస్తు వెద్దియైన; | నమ్మహీనాథు సామ్రాజ్య మతిశయిల్లు.
239
వ. అనిన నయ్యుత్తర కురు భూముల రాజు లెల్ల నర్జునున కతిప్రీత చిత్తులయి యమూల్యంబులైన యపరిమిత దివ్యరత్నాభరణంబులు దెచ్చియిచ్చిన. 240
తరలము. తరణిసన్నిభు ధర్మపుత్త్రు నుదారతేజము పర్వ భా
స్వర సుసంపదఁ బాకశాసని శాసనంబున నిట్టు లు
త్తర కురూత్తముఁ దొట్టి యుత్తర ధారుణీశులు వశ్యు లై
కర ధనంబులు దెచ్చియిచ్చిరి గౌరవంబున ధన్యు లై.
241
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )