ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
భీమసేనుండు పూర్వ దిగ్విజయంబు సేయుట (సం. 2-26-1)
వ. అట భీమసేనుండునుం బరచక్ర మర్దనంబయిన బలచక్రంబుతోఁ బూర్వ దిక్కునకుం జని పాంచాలపతిచేత సత్కృతుండయి, విదేహరాజు జనకుండను వాని జయించి, దశార్ణపతి యయిన సుధన్వుతో మహాయుద్ధంబు సేసి తత్పరాక్రమంబునకు మెచ్చి వానిం దనకు సేనాపతిం జేసికొని, యశ్వమేధేశ్వరుం డయిన రోచమాను ననుజ సహితుం బరాజితుం జేసి, చేదివిషయంబునకుం జనిన. 242
చ. అతని నతిప్రతాపు ననిలాత్మజుఁ గానఁగవచ్చి చేది భూ
పతి శిశుపాలుఁ డెంతయును భక్తిపరుం డయి రాజసూయ ము
న్నతి నొనరింపనున్న యమనందనుయత్న మెఱింగి రత్నశో
భిత ధనరాసు లిచ్చెఁ గడుఁబ్రీతిసమన్వితుఁ డై ముదంబునన్‌.
243
వ. భీమసేనుండును శిశుపాలుపురంబునం గొన్నిదినంబు లుండి పూర్వదిక్కున కరిగి, పుళిందపురంబున సుకుమారసుమిత్రులం, గుమారవిషయంబున శ్రేణిమంతునిం, గోసలదేశంబున బృహద్బలు, నయోధ్యాపురంబున దీర్ఘప్రజ్ఞునిఁ, గాశీరాజును సుపార్శ్వుని, రాజపతియైన సుధన్వుని, మత్స్యమలదపతులను గర్ణాట దక్షిణమల్లులను మర్దించి, వారిచేత నపరిమిత ధనంబులుగొని, మగధపతియయిన జరాసంధతనయు సహదేవు నాశ్వాసించి, హిమవత్పర్వత పార్శ్వంబునం జలోద్భవంబనుదేశంబును భల్లాటదేశంబును జయించి, యింద్రపర్వత సమీపంబునం గిరాతపతుల నేడ్వురను శర్మక వర్మకులను జంద్రసేన సముద్రసేనులను గర్ణవత్సపతులను బుండ్రపతినిం బౌండ్రక వాసుదేవుని వశగతులం జేసి. 244
ఉత్సాహము. అతులశౌర్యుఁ డనిలతనయుఁ డమిత వాహినీ పదా
హతి ధరిత్రి దలర నిట్టు లరిగి పూర్వ దిఙ్మహీ
పతులచేత రత్నరజత భర్మతతులఁ గొనియె భూ
నుతయశుండు వేఱు వేఱ నూఱు కోట్ల సంఖ్యలన్‌.
245
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )