ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
అగ్ని సహదేవుసేనపైఁ బ్రచండశిఖలు కప్పుటకుఁ గారణము (సం. 2-28-16)
ఆ. కడఁగి యనలుఁ డేమి కారణంబున సహ | దేవు సేనపయి నతిప్రచండ
శిఖలు గప్పె? దీనిఁ జెప్పు మేర్పడ నాకు | ననఘ! వినఁగ వేడ్కయైన యదియు.
253
వ. అనిన వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ:దొల్లి నీలువంశంబున నిషధుం డనురాజు రాజ్యంబున జాతవేదుండు విప్రుండయి వేదాధ్యయనంబుసేయుచు మాహిష్మతీపురంబున నుండి ప్రమాదవశంబునం బారదారికుండయిన నెఱింగి రాజనియోగులు వానిం బట్టికొని పోయి రాజసమక్షంబున శాస్త్రవిహితదండనంబున దండింపం బోయిన. 254
క. అవమానదుఃఖితుండయి | పొవయుచు రోషానలంబు పోఁడిమి వెలుఁగం
బవనసఖుఁ డుగ్ర కణములు | నెవయఁగఁ దన పొడవు చూపె నిషధుని మ్రోలన్‌.
255
వ. వాఁడును గడు భీతుండయి యగ్నిదేవునకు నమస్కరించి ‘మహాపురుషా! నాయజ్ఞానంబు సహింపవలయు’ నని ముకుళిత కరకమలుం డయిన వానికి వైశ్వానరుండు ప్రసన్నుండయి ‘నీ కోరిన వరం బిచ్చెద వేఁడు’మనిన వాఁ డి ట్లనియె. 256
తే. ఇప్పురంబు జయింపంగ నెవ్వరేని | వత్తు రుద్ధతులయి శత్రువరులు వారు
దర్పమేది నీచేత నిర్దగ్ధులై వి | హీను లవునట్లుగా వర మిమ్ము నాకు.
257
వ. అనిన నా రాజునకు నగ్నిదేవుం డభిమతం బయిన వరం బిచ్చి, ‘మఱి నీవు నాకుం బ్రతిప్రియంబు సేయు; మిప్పురంబు నింతు లెంతయు మనోజరాగిణులు గావున వీరల స్వైరిణీవృత్తియెల్ల కాలంబు సహింపవలయు’ నని యడిగిన, నాఁటంగోలె మాహిష్మతీ పురంబు స్త్రీలకు స్వైరిణీత్వంబు నిర్దోషంబయ్యె; నగ్నిదేవుండును నప్పురంబుపై వచ్చిన వారలనెల్ల దగ్ధ సైన్యులం జేయుచు దాని రక్షించుచుంటంజేసి పరరాష్ట్రపతు లగ్ని భయంబున నప్పురంబు పరిహరింతు; రది కారణంబుగా సహదేవు సైన్యంబెల్ల నగ్నిపరీతంబయినం జూచి సంచలింపక సహదేవుండు శుచియై వార్చి దర్భశయనంబున శయనించి యగ్నిసూక్తంబుల నగ్నిభట్టారకు ని ట్లని స్తుతియించె. 258
సీ. ‘నీ తదర్థంబులై నిఖిల వేదంబులు | వర్తిల్లు లోకపావనము లగుచుఁ;
బావనంబులలోనఁ బావనుండవు నీవ; | యజ్ఞంబులును నీవ హవ్యవాహ!
ధర్మనిత్యుండైన ధర్మజు కావించు | క్రతువు భవత్ప్రీతికరము గాదె!
దానికి విఘ్నంబు దలఁచుట ధర్మువె? | వరద! వైశ్వానర! వాయుమిత్త్ర!’
 
ఆ. యనిన నగ్నిదేవుఁ డతనికి సంప్రీతుఁ | డయి తదీయసేన కగ్నిభయముఁ
బాచె; దాని నెఱిఁగి భక్తుఁడై నీలుండు | కౌరవేంద్రుననుజుఁ గానవచ్చె.
259
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )