ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
సహదేవుఁడు దక్షిణ దిఙ్మహీపతులచేఁ గప్పములు గొనుట (సం. 2-28-37)
క. దేవప్రభావుఁ డగు సహ | దేవునకు హయద్విపేంద్ర దివ్యాంబర నా
నా విధ రత్నమయాభర | ణావలి లలిఁ దెచ్చి యిచ్చె నధిక ప్రీతిన్‌.
260
వ. ఇట్లు మాహిష్మతీపురంబు సాధించి నీలుచేత నరిగొని సహదేవుండు దక్షిణదిక్కున కరిగి సౌరాష్ట్రదేశంబున నుండి రుక్మి భీష్మక శూర్పారక దండక పతులచేత దూతముఖంబున నసంఖ్యాత ధనంబులు గొని సాగరద్వీపవాసు లైన నిషాదులం బురుషాదుల నేకపాదులం గాలముఖులం గర్ణప్రావరణుల నర రాక్షస యోనుల రామశైల కోలశైల తామ్రద్వీప సంజయంతీపుర నివాసులను వశగతులంజేసి. 261
క. తాళవన పాండ్య కేరళ | కాళింగ ద్రవిడ యవన కరహాటక భూ
పాలకుల నొడిచి దక్షిణ | వేలావన భూములందు విడిసి కడంకన్‌.
262
చ. కురువిభు రాజసూయమునకున్‌ ధన మిచ్చిరి రాజులెల్ల నా
దరమునఁ బ్రీతి సేయునది దానును దప్పక యంచు లంక క
చ్చెరువుగఁ బుచ్చె దూతలఁ బ్రసిద్ధిగ నంత విభీషణుండు చె
చ్చెర సహదేవు శాసనము చేకొని సేసెఁ గరంబు నెమ్మితోన్‌.
263
మ. పరఁగన్‌ దక్షిణ దిఙ్మహీపతులచేఁ బౌలస్త్యుచే నిట్లు దు
ర్ధర శక్తిన్‌ సహదేవుఁ డర్థములు రత్నవ్రాతముల్‌ చందనా
గురు కాష్ఠాదులు గప్పముల్‌ గొనియెఁ బెక్కుల్‌ పేర్మితో నుర్వరా
మరలక్ష్మీకరుఁ డైన ధర్మసుతుసామ్రాజ్యంబు పూజ్యంబుగన్‌.
264
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )