ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
నకులుఁడు పశ్చిమ దిగ్విజయంబు సేయుట (సం. 2-29-2)
క. నకులుఁడు పశ్చిమ దిక్కున | కకుటిల శౌర్యంబు మెఱయ నరిగి యరాతి
ప్రకర భయానక సేనా | ధికుఁడయి నిజతేజ మెల్లదిక్కుల వెలుఁగన్‌.
265
ఉ. యోధుల సింహనాదము మదోత్కటవారణబృంహితంబు వే
గాధికవాజిహేషిత మహారవమున్‌ రథనేమిఘోషమున్‌
బాధితకర్ణరంధ్రమయి పర్వె దిగంతము లెల్ల మ్రోయ నం
భోధిరవంబపోలెఁ గురుపుంగవు నచ్చతురంగవాహినిన్‌.
266
వ. ఇట్లు మాద్రేయుండు రౌద్రాకారంబునఁ గసిమసంగి మహాసేనాన్వితుండయి యరిగి మహాసేనరక్షితంబైన మహితక విషయంబున దత్తక మయూరకాది శూద్రులతోఁ గయ్యంబు చేసి, మరు మాళవ బర్బర కర్బర శైరీషక దాశార్ణ దేశంబుల రాజుల జయించి, పుష్కరారణ్యనివాసులైన యాభీరగణంబులను సరస్వతీసింధు కూలాశ్రితు లైన గ్రామణీయులను బంచనదామరపర్వతనివాసులను వశగతులం జేసికొని వాసుదేవునకు నిజాగమనం బెఱింగించి పుచ్చి. 267
సీ. శాకలపురమందు శల్యు మద్రేశ్వరుఁ | దమ మేనమామ నుత్తమగుణాఢ్యుఁ
గానంగ నరిగి సత్కారపూర్వకముగా | వస్తువాహనములు వానిచేతఁ
గొని, పశ్చిమాంబుధి కుక్షినివాసులఁ | బరమదారుణుల బర్బర కిరాత
వీరుల నోడించి, విభుఁ డిట్లు వరుణేంద్ర | పాలిత దిఙ్మహీపతులచేత
 
ఆ. బలిమిఁ గొనిన ధనము పదివేలు లొట్టియల్‌ | పెఱిఁగి రాఁగ వైరిభీకరుండు
వచ్చె నకులుఁ డమిత వాహినీ పదహతిఁ | దల్లడిల్లుచుండ ధరణితలము.
268
వ. ఇట్లు భీమార్జున నకుల సహదేవులు పరాక్రమంబున దిగ్విజయంబుసేసి చతురుదధి పరీత మహీతలంబునంగల రాజులచేత నసంఖ్యాత ధన వస్తు వాహన నివహంబులు గొని వచ్చి వేఱు వేఱ ధర్మరాజునకుం జూపి యిచ్చిన. 269
క. ఉరుగుణవిశుద్ధ రత్నో | త్కర నానాధన సమృద్ధిఁ గడు నధికుండై
కురువృషభుఁడు గీడ్పఱిచెను | వరుణ ధనేశ్వరుల విభవ వైభవయుక్తిన్‌.
270
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )