ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
రాజసూయము సేయుమని ధర్మజున కతనియాప్తులు సెప్పుట (సం. 2-30-8)
వ. మఱియు ధర్మోపార్జిత రక్షిత ప్రవర్ధితంబయిన మహాధనవర్గంబుఁ జూచి పాత్రప్రతిపాదనంబు నియోగింప సమకట్టి రాజసూయాధ్వరారంభసుస్థిరనివేశితబుద్ధియై యున్న యయ్యుధిష్ఠిరు నభిప్రాయంబున కనుగుణంబుగా నాప్తమంత్రు లి ట్లనిరి. 271
సీ. కురువీర! నీ ధర్మపరిపాలనంబున | నీ గుణసంపద నీ విశుద్ధ
చారిత్రమునఁ జేసి ధారుణి ప్రజ కెల్ల | నభివృద్ధియయ్యె నెయ్యంబుతోడ;
రాజవంచకులయు రాజవల్లభులయుఁ | దస్కరులయు బాధ దఱిఁగె; రుజయుఁ
బగయును భయమును వగయును వెఱపును | నాదిగాఁ గల యెగ్గు లడఁగెఁ బుడమి;
 
ఆ. నర్ఘు లోలిఁ బెరిఁగె; నవనీశులెల్ల నీ | యనుజవీర్యవిజితు లయి త్వదీయ
శాసనస్థు లయిరి జగతీశ! యిదియ నీ | యజ్ఞ కార్యమునకు నవసరంబు.
272
వ. ‘మఱియు నపరిమిత పరార్ఘ్యరత్న రజత సువర్ణ పరిపూర్ణంబయి మహామేరుశైలంబు సన్నిహితంబైన యట్లు యక్షేశ్వరు నక్షయనిధులు ప్రత్యక్షంబైన యట్లు భాండాగారంబు సమృద్ధంబైన యది; ఘృతలవణతైల తండుల ధాన్యాది సమస్త వస్తు విస్తృతంబయి కోష్ఠాగారంబు సకల సంకల్ప సిద్ధి కరంబై కల్పద్రుమంబు ననుకరించుచున్న యది; వేదంబు లన్నియు మూర్తిమంతంబులయిన యట్లు మహాయాజ్ఞికు లయిన మహీసురవరులు నీ యభ్యుదయంబు గోరుచున్నవారు గావున రాజసూయాధ్వరం బెడసేయక చేయు’మని పలుకుచున్న యవసరంబున. 273
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )