ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు ద్వారకనుండి వచ్చుట (సం. 2-30-9)
క. ద్వారవతినుండి జగదా | ధారుఁడు గృష్ణుండు వచ్చి ధర్మజు ధర్మ
ప్రారంభనిత్యు నుత్తము | భూరిధనంబులను రత్నములఁ బూజించెన్‌.
274
వ. ధర్మరాజును జగదర్చితుం డయిన యచ్యుతు నర్ఘ్యాదివిధులం బూజించి తమ్ములయు ధౌమ్య ద్వైపాయనాదులయు ఋత్విజులయు నాప్తమంత్రులయు సమక్షంబున నధోక్షజున కి ట్లనియె. 275
మత్తకోకిల. ధారుణీధర! ధర్మతత్త్వనిధాన! దానవదర్ప సం
హార! వారిజనాభ! బంధుజనానురంజనకారి! నీ
కారణంబునఁ జేసి మాకు జగంబునం గల భూపతుల్‌
భూరివిక్రమవశ్యు లైరి విభుత్వ మేర్పడుచుండఁగన్‌.
276
క. క్షితిపతులవలన సముపా | ర్జితమైన ధనంబు కొలఁదిఁ జెప్పఁగ వాచ
స్పతికి నశక్యము; దీనిం | బ్రతిపాదింపంగవలయుఁ బాత్రవశమునన్‌.
277
వ. ‘దేవముఖం బైన యగ్నిదేవుముఖంబున విధ్యుక్తంబుగా వేల్చి, దేవతర్పణంబును, యథోచితదక్షిణల నభీష్టదానంబుల మహీదేవ తర్పణంబునుం జేయవలయుం గావున నీ కిష్టంబయిన యజ్ఞంబు చేయించి, నాకును, లోకంబులకుం బ్రియంబు సేయు; మొండె నన్ను రాజసూయాధ్వర విధానంబునందు నియోగించి యనుగ్రహింపు’ మనిన యుధిష్ఠిరునకు నారాయణుం డి ట్లనియె. 278
ఉ. పూజ్యుఁడ వెల్ల వంశముల భూపతులందును, ధర్మ నిర్మల
ప్రాజ్యవిభూతి నద్దివిజపాలకు నట్టిఁడ నీక యొప్పె సా
మ్రాజ్యము దైవసంపదయు మానుషసంపదపేర్మి కావునన్‌
యాజ్యుఁడ విప్డు నీవ భరతాన్వయభూషణ! ధర్మనందనా!
279
క. పంపం దగుఁ దగ దని శం | కింపక నీ కిష్టమయిన కృత్యముల నియో
గింపుము నన్ను భవద్గుణ | సంపత్ప్రవణుల సమస్తజనుల జనేశా!
280
చ. అనిన నుపేంద్రువాక్య మను నయ్యమృతంబునఁజేసి ధర్మనం
దనుఁడు ముదంబు నొంది ‘విదితంబుగ నాకు మనోరథంబు లె
ల్లను సమకూరె నిప్డు, సఫలత్వము నొందె ధనాగమంబు’ లం
చును నెడ నిశ్చయించె మధుసూదనదేవు ననుగ్రహంబునన్‌.
281
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )