ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు రాజసూయంబు సేయ నారంభించుట (సం. 2-30-17)
వ. ఇట్లు నారాయణదేవుచేత ననుజ్ఞాతుండయి తమ్ములయు ధౌమ్య ద్వైపాయనాదులయు ననుమతంబున ధర్మరాజురాజసూయంబు సేయ నుపక్రమించి, సహదేవుంజూచి ‘నీవు ధౌమ్యోపదిష్టంబులయిన యజ్ఞోపకరణ ద్రవ్యంబులు దేర నింద్రసేన ప్రముఖులను నర్జును సారథియయిన రుక్మను సమర్పించి, యజ్ఞాయతనంబున నానాదేశాగతులైన రాజులకు సన్నివేశంబులు సేయించి, నిఖిల మహీతలంబునం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల నెల్ల రాఁబనుపు’ మని పంచిన నతండును దద్వాక్యానంతరంబున నింద్రసేనాదుల ననేక శిల్పివరుల నియోగించి. 282
సీ. శాస్త్రోపదిష్ట ప్రశస్త ప్రమాణల | క్షణముల యజ్ఞోపకరణ తతుల
యజ్ఞాయతనమున నతిరమణీయంబు | లయి యుండ నొనరించి, యందు సర్వ
సంభారములు నించి, సకలదిక్కుల హరి | ప్రస్థంబుచుట్టు నపార భూరి
బహువిధాగారముల్‌ ప్రమదవనంబుల | వాపుల దీర్ఘికావలుల వెలసి
 
ఆ. యాజ్య తైల తండులాది నానా వస్తు | పూరితంబులయి విభూతిఁ దనర
జననుతుండు సేసె సహదేవుఁ డపర భూ | తలముఁ బోలి యొప్పెఁ దత్పురంబు.
283
వ. మఱియు సహదేవానుశాసనంబునఁ బుత్త్ర మిత్త్ర భ్రాతృసమేతులై విరాట ద్రుపద శిశుపాల గాంధార రాజులును బ్రాగ్జ్యోతిషంబున భగదత్తుండును, శక సాల్వ బృహద్బల చంద్రసేన సముద్రసేన కుంతిభోజ పౌండ్రకవాసుదేవులును, వసుదేవ బలదేవ ప్రద్యుమ్న శూరసేనాది యదు వృష్ణి భోజాంధకవరులును, నంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ గౌడాంధ్ర సింహళ కేరళ కుంతల ద్రవిడ మరు యవనపతులును, బార్వతేయులును సాగరానూపవాసులును నాదిగాఁ జతుస్సముద్ర ముద్రిత వసుంధరా చక్రంబునం గల రాజచక్రంబును, సమగ్ర వేద వేదాంగవిదు లైన యగ్రజన్ములును, స్వకర్మ నిరతులైన వైశ్యశూద్రులును వచ్చి యథాపరికల్పిత సన్నివేశంబుల నుండి; రంత ధర్మపుత్త్రుండు భీష్మాదులం దోడ్కొని తేర గజపురంబునకు నకులుం బంచిన. 284
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )