ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
రాజసూయమునకు భీష్మాదు లరుదెంచుట (సం. 2-31-4)
క. అనుపమధనరాసులు గొను | చును ననురాగమున రాజసూయమఖాలో
కన కౌతూహలపరు లయి | చనుదెంచిరి భీష్ముఁదొట్టి సద్బంధుజనుల్‌.
285
వ. ఇట్లు వచ్చిన భీష్మ ధృతరాష్ట్ర విదుర ద్రోణ కృపాశ్వత్థామ సోమదత్త కర్ణ భూరిశ్రవశ్శల్య శకుని సైంధవ దుర్యోధన దుశ్శాసన వికర్ణాదుల నెల్లం బ్రియసత్కారంబులం బూజించి వారలతో ధర్మరా జి ట్లనియె. 286
ఆ. మీ యనుగ్రహమునఁ జేయంగఁ గడఁగితి | నిమ్మహాధ్వరంబు నెమ్మితోడ
దీని నిందఱును ననూనంబుగాఁ బూని | పెంపు మెఱసి నిర్వహింపవలయు.
287
వ. అని వారల యనుగ్రహంబు వడసి హిరణ్య రజత రత్న దక్షిణా దాన విషయంబులందుఁ గృపాచార్యునిఁ, గృతాకృత పరిజ్ఞానంబునందు భీష్మద్రోణులను, సకల వస్తు వ్యయంబునందు విదురుని, నానాదేశాగతులైన రాజులు దెచ్చి యిచ్చిన యుపాయనంబులు గైకొన దుర్యోధనుని, భక్ష్యభోజ్యాది వినియోగంబునందు దుశ్శాసనుని నియోగించి. 288
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )