ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మజుఁడు యజ్ఞాయతనము ప్రవేశించుట (సం. 2-33-1)
క. ప్రాజ్ఞుఁడు విశేష ధర్మవి | ధిజ్ఞుఁడు ధర్మజుఁడు యజ్ఞదీక్షితుఁ డయి వి
ప్రజ్ఞాతిపరివృతుం డయి | యజ్ఞాయతనమున కరిగె నధికవిభూతిన్‌.
289
ఉ. సమ్మదమంది చూచిరి భృశంబుగ భూజను లెల్ల బ్రహ్మతే
జమ్మును రాజతేజమును సద్బహుభూషణ రత్నరాజి తే
జమ్మును విస్తరించుచు నిజద్యుతి యొప్పఁగ మూర్తమైన ధ
ర్మమ్మును బోలె నున్న గుణమండితు దీక్షితు ధర్మనందనున్‌.
290
క. బ్రహ్మవిదు లయిన నిఖిల | బ్రాహ్మణ సత్తములచేతఁ బరివేష్టితుఁడై
బ్రహ్మణ్యుఁ డొప్పెఁ గురుపతి | బ్రహ్మర్షి పరీతుఁ డయిన బ్రహ్మయపోలెన్‌.
291
క. వేదనినాదము నాశీ | ర్వాదనినాదము ననేకవాదిత్రమహా
నాదంబుఁ జెలఁగె నన్యని | నాదంబు జనంబులకు వినంబడకుండన్‌.
292
వ. అంత ననంత వేదమూర్తులైన పైల ధౌమ్యులు హోతలుగా, యాజ్ఞవల్క్యుం డధ్వర్యుండుగా, ద్వైపాయనుండు బ్రహ్మగా, సుసాముం డుద్గాతగా, వీరల పుత్త్రశిష్యగణంబులు క్రమంబున మైత్రావరుణుండును నచ్ఛావాకుండును గ్రావస్తుతుండును బ్రతిప్రస్థాతయు నేష్టయు నున్నేతయు బ్రాహ్మణాచ్ఛంసియు నాగ్నీధ్రుండును బోతయుఁ బ్రస్తోతయుఁ బ్రతిహస్తయు సుబ్రహ్మణ్యుండునుంగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, సర్వక్రియా సమగ్రంబయి షడంగ సమృద్ధంబయి సంపూర్ణ దక్షిణా సనాథంబయి సకల ధన ధాన్యసమన్వితంబయి జగన్నాథరక్షితంబయి సకలజనానందకరంబయి రాజసూయం బతిరమణీయం బయిన. 293
సీ. ‘అమ్మహామఖమునం దగ్నిముఖంబున | విపులమంత్రాహుతివితతిఁజేసి
సకలదేవతలును, సంపూర్ణదక్షిణా | దానోత్సవంబున ధరణిసురులు,
సముచితసత్కారశతసహస్రంబుల | నఖిలరాజన్యులు, నభిమతాన్న
దానంబుపెంపున ధరణీజనంబులుఁ | దద్దయుఁ దృప్తులై ధర్మచరితు
 
ఆ. ననఘు ధర్మతనయు ననుజసమన్వితు | సంస్తుతించి రధికసమ్మదమున’
నని కురుప్రభునకు నట్లు వైశంపాయ | నోక్తమైన కథ రసోత్కటముగ.
294
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )