ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
సభాపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీరమణీప్రియ! ధర్మవి | శారద! వీరావతార! సౌజన్యగుణా
ధార! భువనైక సుందర! | వీరశ్రీరమ్య! బుధ వివేక నిధానా!
1
వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు రాజసూయ మహోత్సవంబు నొప్పును ధర్మరాజు ధర్మనిత్యతయును స్తుతియించి నారదుం డా సదంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో మనుష్యసామాన్యుండయి యున్న జగన్మాన్యు జనార్దనుం జూచి తొల్లి బ్రహ్మాదిసురగణప్రార్థితుండయి యఖిల మహీభారావతరణార్థంబు నారాయణుండు యదువంశంబున నుదయించుటయు, నయ్యయి క్షత్త్రియ కులంబుల సురదైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల యంశావతారంబులుం దలంచి భవిష్యద్భారత రణంబునకు సంహృష్ట హృదయుండయి యుండు నంత. 2
క. శాంతనవుఁడు భీష్ముండు ప్ర | శాంతుఁడు దత్క్రతువు సూచి సంతుష్టుండై
యంతక తనూజునకు ధృతి | మంతున కత్యంత ధర్మమతి కి ట్లనియెన్‌.
3
మత్తకోకిల. స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్టుఁడున్‌
భూతలేశుఁడు సంయుజుండును బూజనీయులు; వీరిలోఁ
బ్రీతి నెవ్వఁడు సద్గుణంబులఁ బెద్ద యట్టి మహాత్ము వి
ఖ్యాతుఁ బూజితుఁ జేయు మొక్కనిఁ గౌరవాన్వయవర్ధనా!
4
వ. అనిన ‘నట్టివాఁ డెవ్వండు నా కెఱిఁగింపు’ మనిన ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె. 5
సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతిఁ జేసి | యర్కుండు వెలిఁగించు నట్టు; లమృత
సందోహ నిష్యంద చంద్రికఁ జేసి శీ | తాంశుఁ డానందించు నట్టు; సకల
జనులకుఁ దనదైన సదమలద్యుతిఁ జేసి | తనరంగఁ దేజంబుఁ దనుపుఁ దాన
చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీ | కాక్షుండు గృష్ణుఁ డనాదినిధనుఁ
 
ఆ. డబ్జనాభుఁ డుండ; నర్ఘ్యంబునకు నిందు | నర్హు లొరులు గలరె? యజ్ఞపురుషు
నఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు | మధిప! యదియ చూవె యజ్ఞఫలము.
6
వ. అనిన భీష్మువచనంబున నప్పుడు సహదేవోపనీతంబయిన యర్ఘ్యం బర్ఘణీయుండయిన వాసుదేవునకు శాస్త్రదృష్ట విధానంబున ధర్మతనయుం డిచ్చిన, దానింజూచి సహింపక శిశుపాలుం డుపాలంభనపరుం డయి యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజున కిట్లనియె. 7
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )