ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
శిశుపాలుఁడు ధర్మరాజు నాక్షేపించుట (సం. 2-34-1)
మ. అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీ
దివిజుల్‌ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయు దు
ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్‌ వార్‌ష్ణేయుఁ బూజించి నీ
యవివేకం బెఱిఁగించి తిందఱకు; దాశార్హుండు పూజార్హుఁడే?
8
చ. కడుకొని ధర్మతత్త్వ మెఱుఁగంగ నశక్యము; ధర్మబాహ్యు ని
న్నొడఁబడ నిష్టుఁడై కఱపి యుత్తము లుండఁగ వాసుదేవుఁ డ
న్జడునకుఁ బూజ యిమ్మని విచారవిదూరుఁడు భీష్ముఁ డెంతయున్‌
వెడఁగుఁదనంబునం బనిచె; వృద్ధులబుద్ధులు సంచలింపవే.
9
చ. ఇతనికిఁ గూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్‌
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక, మహాత్ములైన భూ
పతులయు విప్రముఖ్యులసభన్‌ విధిదృష్ట విశిష్ట పూజనా
యతికి ననర్హు నర్హుఁ డని యచ్యుతు నర్చితుఁ జేయఁ బాడియే?
10
సీ. ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే | వసుదేవుఁ డుండంగ వసుమతీశ!
ఋత్విజుం డని విచారించి పూజించితే | ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి;
యాచార్యుఁ డని వినయమునఁ బూజించితే | కృతమతుల్‌ ద్రోణుండుఁ గృపుఁడు నుండ;
భూనాథుఁ డనియెడు బుద్ధిఁ బూజించితే | యాదవుల్‌ రాజులే యవనిమీఁదఁ;
 
ఆ. బూజనీయులైన పురుషులలోపల | నెవ్వఁడయ్యెఁ గృష్ణుఁ? డిట్టు లేల
పూజ్యులయినవారిఁ బూజింపనొల్లక | భీష్ము పనుపుఁ జేసి బేల వయితి.
11
చ. పురుష విశేష విత్తముఁడు పూజ్యుఁడు రాజులలోన నీయుధి
ష్ఠిరుఁ డని నీ గుణాళి ప్రకటించి మనంబులలోన ధారుణీ
శ్వరులు భవన్మఖంబునకు వచ్చిన నిందఱ కివ్విధంబునం
బరఁగ నవజ్ఞ సేయు టిది పాడియె ధర్మువె ధర్మనందనా!
12
క. నీ వెఱుఁగక యిచ్చిన నిది | నా విషయమె యని మనంబునం దలఁపక ల
జ్జా విరహితుఁ డయి యర్ఘ్యము | గోవిందుఁడు గొనియెఁ; దనకుఁ గొను టుచితంబే?
13
క. చనఁ బేడికి దారక్రియ | యును, జెవిటికి మధురగీతియును, జీకునక
త్యనుపమ సురూపదర్శన | మును జేయుటఁ బోలుఁ గృష్ణుఁ బూజించు టిలన్‌.
14
ఉ. ‘ఈ యవనీశ్వర ప్రవరు లిందఱు నిన్ను నగంగ నిట్లుగాఁ
జేయుదె ధర్మరా జను విశేషసమాఖ్య నిరర్థకంబుగా
ధీయుత!’ యంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గులాడుచుం
బోయె సదంబు వెల్వడి సపుత్త్రబలుండయి చైద్యుఁ డల్కతోన్‌.
15
వ. ఆ శిశుపాలు పిఱుందన చని ధర్మనందనుండు వానిం బ్రియవచనంబుల ననునయించుచు ని ట్లనియె. 16
క. భూరిగుణోన్నతు లనఁదగు | వారికి ధీరులకు ధరణివల్లభులకు వా
క్పారుష్యము చన్నె? మహా | దారుణ మది విషముకంటె దహనముకంటెన్‌.
17
ఉ. ఆదిజుఁడైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు, వే
దాది సమస్త వాఙ్మయములందుఁ బ్రశంసితుఁడైన వాఁడు,లో
కాది, త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా
మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని; యుక్తమ కా కిది యేమి దోసమే?
18
క. పరమార్థ ప్రతిభఁ దమో | హరు నచ్యుతు భీష్ముఁ డెఱిఁగిన ట్లెఱుఁగఁగ నీ
కరిది శిశుపాల! పెద్దల | చరితం బల్పులకు నెఱుఁగ శక్యమె యెందున్‌?
19
క. గురుఁ డని సమస్తలోకో | త్తరుఁ డని నీకంటె వృద్ధతములైన నరే
శ్వరు లచ్యుతు నర్చన నెడఁ | గర మభినందింప నీకుఁ గాదనఁ దగునే.
20
వ. అని యా శిశుపాలుం బట్టువఱుచుచున్నంత ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె. 21
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )