ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముఁడు శిశుపాలుని నిందించుట (సం. 2-35-6)
ఉ. పాలితదుర్ణయుండు శిశుపాలుఁడు బాలుఁడు; వీని నేల భూ
పాలక! నీకుఁ బట్టువఱుపన్‌? మఱి ధర్ము వెఱుంగ వీనికిం
బోలునె రాగకోప పరిభూత మనస్కున కల్పరాజ్య ల
క్ష్మీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాదశీలికిన్‌?
22
వ. అని ధర్మరాజును వారించి శిశుపాలుం జూచి భీష్ముం డిట్లనియె. 23
చ. అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి; నీవు మూ
ర్ఖవు శిశుపాల! యింకఁ బలుకన్‌ వలసెన్‌ సభలోన నున్న యీ
యవనిపులెల్ల నాతని దయం బరిముక్తులు, వానిచేత నా
హవ జితులుం, దదీయశరణార్థులుఁగా కొరులయ్య చెప్పుమా!
24
తే. ఉత్తమ జ్ఞానవృద్ధు నా నుండె నేని | బాలుఁ డయ్యును బూజ్యుండు బ్రాహ్మణుండు;
క్షత్త్రియుఁడు పూజ్యుఁ డమితవిక్రమసమృద్ధి | నుర్విపతులలో నధికుఁడై యుండె నేని.
25
క. ఈ రెండు కారణముల ము | రారాతియ యర్ఘ్యమునకు నర్హుఁడు; జగదా
ధారుండు మాక కాదు, స | దారాధ్యుఁడు విష్టపత్రయావాసులకున్‌.
26
క. వృద్ధు లొకలక్ష యున్నను | బుద్ధియె యెవ్వరికి వారిఁ బూజింపంగా;
నిద్ధరణీశులలో గుణ | వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్‌.
27
క. పూజితుల తృప్తులగుదురు | భూజను లొరు; లచ్యుతుండు పూజితుఁ డగుడుం
దేజమున జగత్త్రితయముఁ | బూజితమయి తృప్తిఁబొందుఁ బుణ్యసమృద్ధిన్‌.
28
సీ. ‘బుద్ధియు మనమును బురుషుండు నవ్యక్త | మగుచున్న ప్రకృతియు నంబరంబు
ధరణియుఁ దరణియు దహనుండుఁ జంద్రుండు | గాడ్పును దిక్కులుఁ గాలములును
దానయై జంగమస్థావరాత్మకమైన | సకల భూత ప్రపంచంబు నెల్లఁ
దన దివ్యశక్తిమైఁ దాల్చిన సర్వాత్ము | సర్వభూతేశ్వరు సర్వవంద్యు
 
ఆ. నధికయోగ నిష్ఠితాత్మకులగు మహా | యోగివరులు తత్త్వయుక్తిఁజేసి
యెఱిఁగినట్టు నీకు నెఱుఁగంగఁబోలునే?’ | యనుచు భీష్ముఁ డన్న యవసరమున.
29
చ. ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం
బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై
నిడియెద నంచుఁ దాఁ జరణమెత్తె సభన్‌ సహదేవుఁ డట్టిచో
నుడిగి సభాసదుల్‌ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై.
30
చ. చెలువుగఁ బుష్పవృష్టి గురిసెన్‌ సహదేవుపయిన్‌; దివంబునన్‌
వెలయఁగ సాధువాదములు వించె; సభాసదులెల్ల విస్మయా
కులిత మనస్కులైరి; తన కుంచెయుఁ గృష్ణమృగాజినంబునుం
బలుమఱు వీచుచుం గలహబంధుఁడు నారదుఁ డాడె వేడుకన్‌.
31
వ. అంత శిశుపాలుసేనాపతి సునీథుండను వాఁ డతిరోషపరుషవచనుం డగుచు, స్వపక్షక్షత్త్రియులనెల్ల నొక్కంతం జేర్చికొని, శిశుపాలు ననుమతంబున యుద్ధసన్నద్ధుం డయియున్న సమయంబున. 32
చ. రయవిచల త్తురంగమ తరంగములన్‌ మదనాగనక్ర సం
చయముల సంచలచ్చటుల సైనిక మత్స్యములన్‌ భయంకరం
బయి యదువృష్ణిభోజ కుకురాంధక వాహినియుం గలంగె ని
ర్దయతరరోషమారుత నితాంత సమీరితమై క్షణంబునన్‌.
33
వ. అట్టి సకల క్షత్త్రియ క్షోభంబు సూచి భయసంభ్రమాక్రాంత హృదయుండయి ధర్మరాజు భీష్మున కి ట్లనియె. 34
తరలము. ధరణిలోఁ గల రాజు లెల్లను దారుణక్షయకాలసా
గరములట్లు గలంగి; రిప్డు మఖప్రయోగము విఘ్నముం
బొరయ కుండఁ బ్రజాపకారము వుట్టకుండఁగ నీవు చె
చ్చెరఁ బితామహ! వీరి కిచ్చటఁ జిత్తశాంతి యొనర్పవే.
35
వ. అనిన ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె. 36
క. నీ యజ్ఞమునకు విఘ్నము | సేయఁగ నోపుదురె యొరులు? జితదైత్యుఁడు నా
రాయణుఁడు యజ్ఞపురుషుఁ డ | జేయ పరాక్రముఁడు దీనిఁ జేకొని కావన్‌.
37
సీ. ‘చైద్యునకై పూని సన్నద్ధులై యున్న | యీ రాజు లిందఱు నీక్షణంబ
హరి యల్గి చూచుడు నంతకక్షయమున | కరిగెడు వార; ఘోరాహవమున
దమఘోషనందనుదర్పంబు నిప్పుడ | యడఁగెడుఁ; గడుఁబెక్కులయ్యుఁ గుక్క
లిభకుంభదళనమహిష్ఠనిష్ఠురనఖ | ముఖుఁడగు హరిమీఁద మొఱిఁగి యేమి
 
ఆ. సేయనోపుఁ? గృష్ణు సింహపరాక్రము | నెఱుఁగకున్నవారె యెల్లవారు?’
ననిన భీష్ముపలుకు లవి కర్ణశూలంబు | లయినఁ జేదినాథుఁ డాగ్రహించి.
38
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )