ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
శిశుపాలుఁడు భీష్మునిఁ దూలనాడుట (సం. 2-38-1)
ఉ. ‘ఇమ్ముదివెఱ్ఱి వీనిఁ బరమేశ్వరుఁగాఁ గొనియాడె; ధర్మత
త్త్వమ్ములు పాండవేయులును దానునుగాని యెఱుంగరట్టె; సా
మమ్మున నెల్లవారి నవమాన్యులఁ జేసె నమాన్యుఁడంచు రూ
క్షమ్మున భీష్ముఁ జూచి బలగర్వితుఁ డి ట్లని పల్కె నల్కతోన్‌.
39
ఉ. నెట్టన ధర్మనందనుఁడు ని న్నవలంబము సేసి యోడతోఁ
గట్టినయోడవోలె గతగౌరవుఁడై కడుఁదూలెఁ గృష్ణుఁ జే
పట్టి బిభీషికల్‌ ధరణిపాలుర కిప్పుడు సూపి; తెందు నీ
యట్టి దురాత్ములుం గలరె; యంత యధీరులె ధారుణీపతుల్‌?
40
సీ. పూతనాఘాతంబుఁ, జేతనేతరమైన | శకటంబు త్రోపును జరణనిహతి,
వీఁకతోఁ గడుఁబూచుమ్రాకుల విఱుపును, | వల్మీకమాత్రపర్వతము నెత్తి
కొని, లావుగలఁడు వీఁ డన నేఁడు దివసంబు | లునికియు, వృషవధయును ననంగఁ
బమ్మిన కృష్ణుబీరమ్ములు వొగడుచు | నున్న నీ నాలుక యొక్కఁడయ్యు
 
ఆ. వ్రయ్యవలయు నూఱు వ్రయ్యలుగాఁగ; న | ట్లయినఁ గాని చాల వతనిఁ బొగడ;
నెల్లదాని నేన యెఱుఁగుదు; నెందు వాఁ | డర్ఘ్యదానయోగ్యుఁ డయ్యెఁ జెపుమ.
41
వ. స్త్రీలను గోబ్రాహ్మణులం గూడువెట్టువారిని విశ్వసించినవారిని వధియించుట మహాపాతకం బని పెద్దలు సెప్పుదు; రట్టివానియందు గోవిందుఁడు స్త్రీవధయును గోవధయునుం జేసె; నీవునుం గడు ధర్మువెఱింగినవాఁడ వయి వీని కర్ఘ్యం బిప్పించి; తదియునుంగాక యన్యకామ యయిన యంబ యను కన్యక నపహరించి నీవు దెచ్చిన నెఱింగి నీ తమ్ముండు విచిత్రవీర్యుండు ధర్ము వెఱిఁగినవాఁడై దాని విడిచి పుచ్చె. 42
క. జననిందిత మయి నీయం | దనపత్యత యను నధర్మ మది యుండఁగ ధ
ర్మనివృత్తచరిత్రక! నీ | యనుశాసన మెట్లు నమ్మ నగు జనములకున్‌?
43
వ. తొల్లి సముద్రతీరంబున నుండి యొక్క వృద్ధహంస ధర్మాధర్మంబులు సెప్పుచు ధర్మమార్గంబున వర్తిల్లుచుండుఁ డని పక్షుల నెల్ల శిక్షించుచుఁ బ్రాణిహింస సేయక తపోవృత్తి నున్న దానికి సముద్రజలచరంబు లయిన పక్షులు రుచ్యంబు లగు భక్ష్యంబులు దెచ్చి పెట్టుచుం దత్సమీపంబునం దమ తమ యండంబుల నెల్ల నిక్షేపించి భక్షణార్థం బొక్కనాఁ డతిదూరం బరిగిన, నిట యాహంసయు నయ్యండంబుల భక్షించిన దాని నొక్క పక్షి గని యా పక్షులకెల్లం జెప్పిన, నవి దద్దయు దుఃఖించి యా యంచను వధియించెం గావున నట్ల నీవు నధర్మప్రవృత్తుండవై ధర్మశిక్ష సేయుచుఁ గౌరవుల కాపద యాపాదించుచున్నవాఁడవు. 44
క. విదితముగ నధికబలసం | పద నోర్చె నుపేంద్రుఁ డవనిపాలుర నంచున్‌
మదిఁ బొగడితి; నా యెఱుఁగని | యదియె జనార్దనుబలంబు నత్యున్నతియున్‌?
45
క. సకలక్షత్త్రభయంకరు | నకు బార్హద్రథికి ననిమొనన్‌ మార్కొన నో
పక వలియం బాఱఁడె యీ | ముకుందుఁడు భయాతిరేకమునఁ బదిమాఱుల్‌.
46
వ. అమ్మహాసత్త్వు జరాసంధుం బరమబ్రహ్మణ్యు బ్రాహ్మణవేషంబున భీమార్జునులం దోడుసేసికొని వధియించె; నవి యెల్లం ద్రివిక్రము పరాక్రమంబులుగా నశ్రాంతవచనుండ వయి. 47
ఆ. బూతు వొగడినట్లు వొగడెదు; పొగడంగ | వలయునేని సుగుణవంతు లయిన
కర్ణ శల్యు లాదిగాఁ గల వీరులఁ | బొగడుచుండరాదె ప్రొద్దువోక.
48
ఆ. అన్యకీర్తనంబు నన్యనిందయుఁ దన్నుఁ | బరఁగఁ బొగడికోలుఁ బ్రబ్బికోలు
నాపగాతనూజ! యార్యవృత్తములు గా | వనిరి వీని నాద్యులయిన మునులు.
49
వ. అని రూక్షాక్షరవచనంబుల నాక్షేపించుచున్న శిశుపాలుం జూచి సహింపనోపక భీమసేనుం డతిరౌద్రాకారంబున నలిగిన. 50
చ. ప్రకటితకోపవేగమునఁ బద్మదళాయతనేత్రముల్‌ భయా
నకతర లీలఁ దాల్చె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖ మై
భ్రుకుటి లలాటదేశమునఁ బొల్చెఁ ద్రికూటతటిత్రిమార్గగా
నుకృతిఁ బ్రభంజనప్రియతనూజున కంతకమూర్తి కచ్చటన్‌.
51
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )