ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
భీమునకు భీష్ముండు శిశుపాలుని వృత్తాంతంబు సెప్పుట (సం. 2-40-1)
వ. ఇట్లు నిఖిల క్షత్త్రియత్రాసజననంబుగా నలిగి దంతసందష్ట దారుణ ముఖుండై శిశుపాల నిర్మూలనాభీల సంరంభంబున నున్న భీమసేను వారించి భీష్ముం డిట్లని చెప్పె ; ‘నిద్దురాత్ముండు తొల్లి చేదివంశంబున దమఘోషుం డనువానికి సాత్వతికిం జతుర్భుజ లలాట నేత్రంబులతో నుదయించి. రాసభరవంబున నేడ్చుచున్నం జూచి తల్లిదండ్రులు భయవిస్మయాధీనమనస్కులయి యున్న వారికి నొక్క యశరీరభూతం బిట్లనియె.’ 52
ఆ. వీని నొరులు చంపఁగా నోప రెవ్వరు; | నెవ్వరేని వీని నెత్తికొనుడు
మిగిలియున్న బాహుయుగళంబుఁ గన్నును | నడఁగు వీని కతఁడ యంతకుండు.
53
వ. అనిన నయ్యశరీరివచనంబులు విని వార లాశ్చర్యమానసులయి, యా కుమారుం జూడవచ్చిన వారికెల్ల నెత్తికొన నిచ్చుచున్నంత. 54
చ. అతివికృతస్వరూపధరుఁ డైన కుమారకుఁ బ్రీతితోడ సా
త్వతిఁ దమ మేనయత్తను ముదంబునఁ జూడఁగఁగోరి యద్భుత
ప్రతిభులు రామకేశవులు పన్నుగ నేఁగిరి చేదిధారుణీ
పతిపురి కొక్కనాఁ డఖిల బాంధవ మంత్రిసుహృత్సమేతులై.
55
వ. ఇట్లు వచ్చిన రామకేశవులం బ్రియసత్కారంబులఁ బూజించి సాత్వతియు నబ్బాలు బలదేవుచేతికి నెత్తికొననిచ్చి తదనంతరంబ నారాయణుచేతికి నిచ్చిన. 56
క. అక్కొడుకు నబ్జనాభుం | డక్కజముగ నెత్తికొనుడు నందఱుఁ జూడన్‌
గ్రక్కున నొక్కట నడఁగెను | మిక్కిలి చేతులును వానిమిక్కిలి కన్నున్‌.
57
వ. దానిం జూచి సాత్వతి యద్భుతచిత్తయై యశరీరిపలుకు లప్పుడు దలంచి తన పుత్త్రునకు మురవైరివలన మరణం బగుట యెఱింగి యతని కి ట్లనియె. 58
క. కుపథప్రవృత్తుఁ డయి వీఁ | డపనయమున నీ కనిష్టుఁ డయినను గరుణా
నిపుణుఁడవై నీ మఱఁదికి | నపరాధశతంబు సైఁపుమయ్య యుపేంద్రా!
59
వ. అని వీనితల్లి తొల్లి జగద్వల్లభుండైన జనార్దనుం బ్రార్థించి తత్ప్రసాదంబున వరంబు వడయుటం జేసి శతాపరాధంబులు నిండునంతకు వీఁ డన్యులచేత నప్రతిహతుండు; కృష్ణునిచేత నిహతుండగు; నది కారణంబుగా. 60
చ. ఇతనికి నిట్లు న న్నుఱక యెగ్గులు వల్కఁగఁ బోలెఁగాక, యు
ద్ధతమతి నన్యు లీతని విధంబునఁ బల్కి మదీయచాప ని
ర్గత చటులోగ్రమార్గణ నికాయ పయోధి మునుంగ కిట్లు ద
ర్పితులయి పోవనేర్తురె గభీరపరాక్రమ! మారుతాత్మజా!
61
వ. అని పలుకుచున్న భీష్మభీముల నతిక్రమించి శిశుపాలుండు జనార్దనున కభిముఖుండయి యి ట్లనియె. 62
మ. అవమాన్యున్‌ సభలోన మాన్యుఁ డని సౌహార్దంబునం గౌరవ
స్థవిర ప్రేరణ నిన్నుఁ బాండుతనయుల్‌ తప్పంగఁ బూజించి ర
య్యవివేకాస్పదు లైన పాండవులు మోహాంధుండు భీష్ముండుఁ గే
శవ! నీవుం గడఁగుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్‌.
63
వ. అని శిశుపాలుండు గర్వించి పలికిన విని చక్రధరుం డఖిల రాజచక్రంబు విన నిట్లనియె. 64
సీ. ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము | వోయిన నీతఁ డన్యాయవృత్తి
నిట బాలవృద్ధుల కెల్ల భయంబుగా | ద్వారకాపురిఁ గాల్చె, వీరులైన
భోజరాజన్యులు పొలఁతులతోడ రై | వతకాద్రిఁ గ్రీడాభిరతిఁ బ్రమత్తు
లయియున్న వారల నదయుఁడై వధియించె; | దేవాభుఁ డగు వసుదేవు చేయు
 
ఆ. నశ్వమేధమునకు నభ్యర్చితం బైన | హయము నపహరించి యజ్ఞమునకు
విఘ్న మాచరించె; వీఁ డతిపాపుఁ డై | బభ్రుభార్యఁ దనకు భార్యఁ జేసె.
65
వ. ‘మఱియు వాగ్విషయంబు లయిన యపకారంబు లనేకంబులు సేసె; మా యత్త సాత్వతి నన్నుం బ్రార్థించుటంజేసి యిద్దురాత్ముండు సేసిన యపరాధశతంబు సహించితి; నిప్పుడు మీ రిందఱు నెఱుంగ నాయం దకారణ వ్యతిక్రమం బుపక్రమించి యత్యంతశత్రుం డయ్యె’ ననిన విని శిశుపాలుం డతిపరుష వచనుం డగుచుఁ బురుషోత్తమున కి ట్లనియె. 66
క. నీ కూర్మియు నీ యలుకయు | నా కవి యేమిటికి దుర్గుణప్రియ! మొదలన్‌
నా కిచ్చిన యక్కన్యకఁ | జేకొని నీ కిట్లు పలుక సిగ్గును లేదే!
67
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )