ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
చక్రాయుధముచేత శిశుపాలుండు చచ్చుట (సం. 2-42-21)
చ. అని శిశుపాలుఁ డొండొకట నప్రియముల్‌ హరిఁ బల్కుచున్నచో
ననలశిఖాలి దూల దనుజాంతకచక్రము రాజచక్ర మె
ల్లను భయమంద మూర్ధవికలంబుగ నప్పుడు సేసెఁ జేదినం
దను తనువున్‌ బృహద్రుధిరధారలు బోరన మీఁది కొల్కఁగన్‌.
68
ఉ. ప్రల్లదమేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రి తుల్యుఁడై
త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజ మంబరం
బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చె విస్మయో
త్ఫుల్ల విశాలనేత్రు లయి భూపతులెల్లను జూచుచుండఁగన్‌.
69
క. ఘనజాలము లేకయుఁ బెలు | చన పిడుగులతోడి వృష్టి చైద్యుని పాతం
బునఁ గురిసె; సముద్ర మహా | ద్రి నికాయముతో ధరిత్రి దిర్దిరఁ దిరిగెన్‌.
70
క. జయ జయ నినాదమున న | వ్యయు నంబుజనాభు భువనవంద్యు నుపేంద్రుం
బ్రియమునఁ బొగడెడు జనముల | దయిన మహాధ్వనియుఁ జెలఁగె నతితుములంబై.
71
వ. అంత ననంతశయనుండు శిశుపాలు సంస్కరింపం బంచి వాని కొడుకుం జేదిరాజ్యంబున కభిషిక్తుం జేసె; నట్లు ప్రశాంతవిఘ్నంబయి, సుఖారంభంబయి, ప్రభూతభక్ష్యాన్నధనదానసనాథంబయి, జగన్నాథ రక్షితంబయి రాజసూయమహాధ్వరంబు సమాప్తప్రయోగం బయిన. 72
ఉ. దేవగురుద్విజప్రకరతృప్తికరున్‌ వరరాజసూయ య
జ్ఞావభృథాభిషేకవిమలాంగు విశుద్ధయశోనిధిన్‌ జగ
త్పావను ధర్మనందను సభాస్థితుఁ జూచి ముదంబు చెంది రిం
ద్రావరజాది మిత్రు, లసహత్వముఁ బొందిరి ధార్తరాష్ట్రులున్‌.
73
వ. ఇట్లు మహావిభూతితో నున్న ధర్మరాజు నొద్దకు వచ్చి నానాదేశాగతులయిన రాజు లి ట్లనిరి. 74
మాలిని. జగదభినుతసామ్రాజ్యంబుతో నొప్పు నీ య
త్యగణిత గుణయుక్తం బైన ధర్మప్రవృత్తిన్‌
మిగిలి వెలిఁగె నాజామీఢవంశంబు విద్వ
ద్గగనతపన! సర్వక్షత్త్రవంశంబులందున్‌.
75
వ. ‘ఏము భవదీయ రాజసూయ మహోత్సవ దర్శనంబునను భవత్కృత సత్కార గౌరవంబుననుం జేసి కృతార్థుల మయితిమి. మా మా దేశంబులకుం బోయెద’ మని చెప్పి వీడ్కొని చని; రప్పుడు ధర్మరాజువచనంబున భీష్మధృతరాష్ట్రుల భీమసేనుండును, యజ్ఞసేను నర్జునుండును, సపుత్త్రకులయిన (కర్ణ) శల్య సుబలుల నకులుండును, గృపద్రోణాశ్వత్థామల సహదేవుండును, విరాట భగదత్తుల ధృష్టద్యుమ్నుండునుం, బార్వతేయులైన రాజుల సౌభద్రద్రౌపదేయులును ననిచి రంత. 76
క. సతత ధన దానములఁ బూ | జితులయి తృప్తులయి గుణవిశిష్టమహీదే
వతవరులు ధర్మసుతు మా | నితగుణు దీవించి చనిరి నిజ గృహములకున్‌.
77
వ. నారాయణుండును బాండునందనుల నందఱం గ్రమంబున వీడ్కొని ద్వారవతికిం బోవుచుండి ధర్మరాజున కి ట్లనియె. 78
తే. సకలభూతసంఘంబు పర్జన్యుఁ, బక్షి | సమితి బహుఫలవృక్షంబు, నమరు లింద్రు
ననిశమును నుపజీవించునట్లు బంధు | జనులు ని న్నుపజీవింప మనుము పేర్మి.
79
వ. ‘మఱియు నప్రమత్తుండవయి నిఖిలప్రజారక్షణంబు సేయు’మనినఁ గృష్ణునకు ధర్మరా జి ట్లనియె. 80
ఉ. నీకరుణం గరంబు రమణీయతరంబయి సర్వవిఘ్నదూ
రీకృతమై సమాప్తి నొనరెన్‌ ధరణీధర! యిమ్మఖంబు; భూ
లోకములోన నేను నృపలోక నమస్కృతిఁ గీర్తిఁ బర్వితిన్‌;
నా కులమున్‌ వెలింగె సుగుణంబుల కాస్పదమై పవిత్రమై.
81
క. ద్వారవతి నుండియును నిట | యారసియుండునది దానవాంతక! లోకా
ధార! సమీపస్థుండవ | దూరంబున నుండియుం జతుర్భుజ! మాకున్‌.
82
వ. ‘నిన్నుం బాసి నిమిషంబయిన నిర్వహింప నేర’మని ధర్మరా జెట్టకేనియు గరుడగమనుగమనంబున కొడంబడియె; నంత. 83
చ. అనిలజవాశ్వయుక్తమయి హాటకరత్న విచిత్ర తార్‌క్ష్య కే
తనమయి మేఘనాదమయి దారుక సారథియైన దివ్య కాం
చన రథ మెక్కి యాక్షణమ సాత్వతకుంజరుఁ డేఁగె భక్తి నా
తని ననిచెన్‌ యుధిష్ఠిరుఁడు దమ్ములు దానును బాదచారియై.
84
క. తగిలి విలోచన గోచర | మగు నంతకు దృష్టి నిలిపి యట హృదయం బి
మ్ముగఁ జొనిపి యెట్టకేనియు | మగిడిరి హరి ననిచి దీనమతిఁ బాండుసుతుల్‌.
85
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )