ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
పాండవ సభామహిమకు దుర్యోధనుండు లజ్జితుం డగుట (సం. 2-43-1)
వ. అట దుర్యోధనుండు శకునియుం దానును సభావిభవంబుఁ జూచు వేడుక నందుఁ గొన్ని దినంబు లుండి, యొక్కనాఁడు దాని యపూర్వరమణీయతకు విస్మితుం డగుచు నయ్యయి ప్రదేశంబులం గ్రుమ్మరువాఁడు వివృతంబైన ద్వారదేశంబు సంవృతంబుగా వగచి చొరనొల్లక, సంవృతంబైనదాని వివృతంబుగా వగచి చొరంబోయిలలాట ఘట్టితగృహద్వారుండయి, సమప్రదేశం బున్నతంబుగా వగచి యెక్కసమకట్టి, నీలాశ్మరశ్మి స్థగితంబైన విమలమణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానం బెగఁద్రోచికొని, స్ఫటికదీప్తిజాల పరివృతంబైన జలాశయంబు స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి, క్రమ్మఱిన వానిం జూచి పాంచాలియుఁ బాండుకుమారులును నగి రంత. 86
ఆ. దాని నెఱిఁగి ధర్మతనయుండు ధృతరాష్ట్రు | తనయునకు సమీరతనయుచేత
దివ్యవస్త్రములును దివ్యభూషణములు | నిచ్చి పుచ్చెఁ బ్రీతి యేర్పడంగ.
87
వ. దుర్యోధనుం డట్లు సభాప్రలంభంబునకు లజ్జితుండయి పాండవుల వీడ్కొని గజపురంబున కరిగి ధర్మరాజు రాజసూయంబు దన కసూయాజననం బగుటయు సకలజనమనో నయనోత్సవంబయిన తత్సభాలక్ష్మి దన మనోనయనంబుల కగ్నిజ్వాలయై మహాదాహంబు సేయుటయు సంతప్తుండై నిదాఘదాహంబున నింకి తఱుఁగు నల్పజలాశయంబునుం బోలెఁ దద్దయుం దఱిఁగి. 88
క. కందు గల పసిఁడి గాఁచినఁ | గంది వివర్ణమయినట్లు కౌరవుకాయం
బొందఁగ వివర్ణమయి కడు | వందె మనస్తాపహవ్యవహదాహమునన్‌.
89
క. అవనీ రాజ్యవ్యాపా | రవిహీనుం డయి సుహృద్విరంజనుఁ డై కౌ
రవపాంసనుండు పాప | వ్యవసాయమునందు బుద్ధి వదలక నిలిపెన్‌.
90
వ. ఇట్లు సకల సుఖోపభోగ విముఖుండయి యెవ్వరితోడం బలుక కున్న దుర్యోధనుం జూచి శకుని యి ట్లనియె. 91
ఆ. ఇన్ని దినములయ్యె నేటికి నాతోడ | నిభపురేశ! పలుక విట్టు లేల?
నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సం | హతులఁ జేసి కలుషమయిన యదియు.
92
క. నా కెఱిఁగింపుము దీని, న | నేకాగ్రతఁ బొందనేల యే నుండఁగ? న
వ్యాకులభవత్ప్రతాప ని | రాకృతులు ధరిత్రిలోని రాజులు నీకున్‌.
93
వ. ‘ఇంత సంతాపింప నేల?’ యనిన నాశకునికి దుర్యోధనుం డిట్లనియె. 94
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )