ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుని దురాలోచనము (సం. 2-43-19)
ఉ. నీవును జూచి, తట్టిసభనేని వినంబడ దేయుగంబులన్‌;
భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్ట భో
గావహ మేక్రియం బడసెనయ్య? మహాత్ముఁడు దాన నేమి సం
భావితభాగ్యుఁ డయ్యెను బ్రభాకరతేజుఁడు ధర్మజుం డిలన్‌.
95
చ. కడు భయమంది వానికిఁ దగన్‌ మఱి వైశ్యులపోలె వశ్యులై
పుడమి నతిప్రసిద్ధులగు భూపతులెల్ల మహాధనావళుల్‌
దడయక తెచ్చియిచ్చి కరదానము సేయుటఁ బార్థివత్వ మే
ర్పడియెఁ బృథాగ్రపుత్త్రునకుఁ; బాండవతేజము పర్వె నెల్లచోన్‌.
96
ఉ. యాదవుచేతిచక్రము భయంకరమై శిశుపాలమస్తక
చ్ఛేదము సేసినం గడుఁ బ్రసిద్ధులు శూరులునైన రాజు ల
య్యాదవుముందటన్‌ జయ జయ ధ్వను లిచ్చిరి గాని, వాని శౌ
ర్యోదయవృత్తికట్టెదుర నోపర యెవ్వరు విక్రమింపఁగన్‌.
97
చ. అతుల పరాక్రమార్జితములైన ధనంబులపేర్మిఁ జేసి యు
న్నతమగు చున్న పాండునరనాథ తనూజుల లక్ష్మి నా కస
మ్మతమయి సూ వెలింగె విను మాతుల! మానధనాఢ్యుఁ డైన భూ
పతి సహియింపనోపునె సపత్నులవృద్ధియు నాత్మహానియున్‌.
98
వ. ‘ఏమి సేయుదము? పాండవుల లక్ష్మి యెవ్విధంబున మన కపహరించి కొననగు?’ ననిన దుర్యోధనునకు శకుని యి ట్లనియె. 99
క. దీనికి ధృతరాష్ట్రునను | జ్ఞానము వడయుడును మనకు సమకూరు ధరి
త్రీనాథ! భవదభిప్రా | యానుగుణైశ్వర్య మతిశయంబుగఁ బ్రీతిన్‌.
100
వ. అని యప్పుడ శకుని దుర్యోధనుం దోడ్కొని ధృతరాష్ట్రునొద్దకుం జని యాతని శరీరకార్శ్య వైవర్ణ్యంబులు సెప్పిన విని యదరిపడి ధృతరాష్ట్రుండు కొడుకు నొడలంటి చూచి కడు దుఃఖితుండయి యి ట్లనియె. 101
సీ. కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమ | ర్పితమయ్యె నీయంద పేర్మితోడ;
ననుజులు మిత్రులు ననుచరులును నీకుఁ | బ్రీతుల కాని యప్రియులు లేరు;
వివిధోపభోగముల్‌ దివిజేశునకుఁ గల | యట్టుల కలవు నీ కనుభవింప;
సకలభూపతులుఁ బాయక భక్తియుక్తులై | యొలసి నీ పనుపు సేయుదురు; పేర్మి
 
ఆ. నేమి గొఱఁతయయ్యె? నిట్లు డయ్యను దను | చ్ఛాయ దఱిఁగి యుండ సకలధరణి
రాజ్యభోగ సుఖ పరాఙ్ముఖత్వముఁ బొంద | నేల నీకుఁ గురుకులేశ్వరుండ!
102
వ. అనిన విని ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డి ట్లనియె. 103
క. పాండవుల విభవ మది యా | ఖండలు విభవంబుకంటెఁ గడుమిక్కిలియై
యొండొండ పెరిఁగి దిక్కులు | నిండెఁ దదీయ ప్రతాప నిర్మల రుచితోన్‌.
104
క. సామాన్యమె యుత్తర కురు | భూములు మొదలుగ సమస్తభూములు విజయ
శ్రీమహిమను సాధించెఁ ద్రి | ధామపరాక్రముఁడు శక్రతనయుఁడు బలిమిన్‌.
105
తే. సఖ్యసంబంధములఁ జేసి చక్రధరుఁడు | ద్రుపదుఁడును దక్కఁ దక్కిన నృపతులెల్ల
నరియుఁ బెట్టనివారు లే రఖిల జలధి | వలయిత క్షోణిలోఁ బాండవులకుఁ బ్రీతి.
106
తే. శైల కానన ద్వీప విశాల మయిన | వసుమతీ చక్రమంతయు వారి వశమ;
యేను నొకరాజసుతుఁడనై యెట్లు దీనిఁ | జూడ నోపుదుఁ బ్రాభవశూన్యునట్లు.
107
తే. నన్ను రత్నపరిగ్రహణంబునందుఁ | బాండవుండు నియోగించెఁ బార్థివేంద్ర!
సర్వరత్నాకరైక ప్రశస్త రత్న | పుంజముల కాస్పదము ధర్మపుత్త్రుగృహము.
108
తే. యజ్ఞదీక్షితుఁ డయిన ధర్మాత్మజునకు | గౌడకాంభోజపతు లనేక ప్రకార
వర్ణకంబళములు శుకవర్ణవాహ | నివహములుఁ దెచ్చియిచ్చిరి నెమ్మితోడ.
109
ఉ. సాగరసారవారిరుహ శౌక్తిక మౌక్తిక విద్రుమద్రుమై
లాగురు చందనంబులు ప్రియంబున నిచ్చిరి తెచ్చి యున్నత
శ్రీగుణయుక్తిమైఁ బరఁగు సింహళకేరళచోళపాండ్యదే
శాగతరాజపుత్త్రులు మహాగుణశాలి కజాతవైరికిన్‌.
110
ఉ. మందిత సూర్యరశ్మి రుచిమన్మణిహారచయంబుతోఁ గట
స్యంది సుగంధిదాన జల సంపద నొప్పెడు వాని దేవకీ
నందనుఁ డిచ్చెఁ బ్రీతిఁ బదునాలుగువేలుగజంబులన్‌ జనా
నందనకీర్తియైన యమనాథతనూజున కిష్టమిత్రుఁడై.
111
క. హరియును గిరీటియును నొం | డొరుల కభీష్టములు సలుపుచుండుదు రంద
య్యిరువురు నేకాత్ములు జన | శరణ్యు లుత్తములు నిత్యసాంగత్యమునన్‌.
112
వ. మఱియు నయ్యుధిష్ఠిరున కనురక్తుండయి విరాటుండు రెండువేలు గజంబుల నిచ్చె; ద్రుపదుండు వేయి గజంబులను బదివేలు హయంబులను బదునాలుగువేలు విలాసినీజనంబులం బదివేలు దాసీ గృహస్థుల నిచ్చెఁ; గురు కుకురోలూక కేకయ కాశ్మీర కాంభోజ గాంధార మద్ర ద్రవిడ మగధ మాళవ కళింగాంగ వంగ బంగాళగౌడాంధ్రకేరళకోసలాది మహీపతులునుం బ్రాగ్జ్యోతిషంబున భగదత్తుండును మరుకచ్ఛనివాసులును జేదిపతులును నాజానేయ బాహ్లిక హూణ పారసీయ దేశంబులం గల హయంబులం బర్వతనిభంబులైన యిభంబులను దివ్యాంబరాభరణ భూషితంబులయిన యోషిత్సహస్రంబులను నపరిమితంబులయిన యజావి గో మహిషంబులను హిరణ్య రత్నరజత కంబళాంబరాదుల నిచ్చిరి; మఱియు మేరుమందరమధ్య కీచక వనవాసులయిన గుళింద పారద బర్బర తురుష్క టెంకణ కోంకణాధిపతులును వశగతులై హిమశైల రామశైల కురుదేశంబులైన కౌసుమ క్షౌద్ర పాత్రంబులను దివ్యౌషధంబులను నింద్ర నీలేంద్ర గోప పిక చంద్ర మయూర కీర వర్ణ తురంగంబులను సౌవర్ణ కీటజ పట్టజాండజ శయ్యలను నిశిత దీర్ఘ నిస్త్రింశంబులను మణి కాంచన ఖచిత గజ దంతమయ శిబికాసనంబులను నిచ్చిరి; వాసవ సఖుండయిన గంధర్వపతి చిత్రరథుం డనువాఁడు నన్నూఱు గంధర్వ హయంబుల నిచ్చెఁ; దుంబురుండను గంధర్వుండు నూఱు హయంబుల నిచ్చె. 113
ఉ. భావిపురాతనాద్యతనపార్థివలక్ష్ములు పాండవేయు ల
క్ష్మీ విభవంబుతోడ నుపమింప సమంబులు గా వశేష రా
జావళిలోన నత్యధికులైన సపత్నులపేర్మిఁ జూచి యేఁ
జూవె సహింపనోపక కృశుండ వివర్ణుఁడ నైతి నెంతయున్‌.
114
ఆ. ఒక్క లక్ష భూసురోత్తముల్‌ గుడిచిన | మొనసి తనకుఁ దాన మ్రోయు శంఖ;
మొక్క నిమిషమేని యుడుగక మ్రోసె న | య్యధ్వరోత్సవంబు నన్నినాళ్ళు.
115
సీ. జన్నంబు చూడంగ సకలభూములనుండి | వచ్చిన రాజన్యవరుల నవని
సురులను వైశ్యుల శూద్రుల నాత్మీయ | బంధుసుహృద్వీరభటనియోగ
జనులను బేదల సాధుల నిత్యంబుఁ | దాన పరీక్షించి, తగ వెఱింగి,
యన్నంబు దయఁ బెట్టి, యందఱుఁ గుడిచినఁ | దనుమధ్య యర్ధరాత్రంబు నపుడు
 
ఆ. గాని కుడువదట్టె కమలాక్షి ద్రౌపది; | యదియుఁగాక యమ్మహాధ్వరమున
నధముఁ డయ్యుఁ గడుఁబ్రియంబున నభ్యర్చి | తుండ కాని వంచితుండు లేఁడు.
116
క. ధరణి హరిశ్చంద్రుఁడు భా | సురయశుఁ డయి చేసె రాజసూయం; బదియున్‌
సరిగా దని యే వగతును | సురుచిరవిభవమునఁ బాండుసుతుయజ్ఞముతోన్‌.
117
వ. అట్టి రాజసూయాధ్వరంబున నవభృథసమయంబునందు బ్రహ్మర్షి రాజర్షి లోకపాలపరివృతుం డయిన మహేంద్రుండునుం బోలె నున్న ధర్మతనయు నారదపారాశర్యాదిమహాముని సమేతుండయి ధౌమ్యుం డశేషతీర్థజలంబుల నభిషిక్తుం జేసిన. 118
సీ. అభిషిక్తుడయిన యయ్యమరాజసుతునకు | సాత్యకి మౌక్తికచ్ఛత్ర మొప్పఁ
బట్టె; భీముండును బార్థుండు మణిహేమ | దండ చామరయుగధారు లయిరి;
కమలనాభుండును గవలును ద్రుపదేశ | పుత్త్రుండు వేర్వేఱ భూమిపతుల
మూర్ధాభిషిక్తుల మ్రొక్కించుచుండిరి | దర్పంబు వెలయంగ; దానిఁ జూచి
 
ఆ. యేను మొదలుగా మహీపతు లెల్లను | దీప్తిఁ దఱిఁగి యుండఁ దివిరి మమ్ము
నగిరి కృష్ణ పాండునందన ద్రౌపదీ | సాత్యకులుఁ గరంబు సంతసమున.
119
వ. మఱియు నయ్యుధిష్ఠిరుండు. 120
సీ. ‘అనఘుఁడై యెనుబది యెనిమిది వేవురు | బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మవిదుల
వెలయంగ నల్లిండ్ల నిలిపి, ప్రత్యేకంబ | ముప్పండ్రు దాసుల నొప్ప నిచ్చి
ముదముతో రక్షించుఁ, బదివేవురుత్తమ | భూసురు లతని యగ్రాసనమునఁ
గలధౌతమయ పాత్రములఁ బ్రతిదినమును | గుడువను గట్టను దొడువఁ బూయ
 
ఆ. ననుభవింపఁ గలుగు టది యేమి పురుషార్థ | మయ్య; కష్టపురుషు నట్టు లొరుల
పేర్మిఁ జూచుచుండఁ బెద్దయు నే నోప’ | ననినఁ బతికి నిట్టు లనియె శకుని.
121
క. భానుప్రభుఁ డగు పాండుమ | హీనాథాత్మజులలక్ష్మియెల్లను నీకున్‌
నే నపహరించి యిత్తు ధ | రానుత! మాయాదురోదరవ్యాజమునన్‌.
122
వ. ‘ధర్మతనయుండు జూదంబునకుఁ బ్రియుండు గాని యందుల యుక్కివం బెఱుంగం; డే నక్షవిద్యయం దతి దక్షుండ; నాతని నశ్రమంబున నోడించి తదీయ రాజ్యవిభూతి నీ కిచ్చెద; వగవకుండు’ మని పలికిన శకుని పలుకులకు సంతసిల్లి దుర్యోధనుండు దండ్రిపాదంబులపయిం బడి మ్రొక్కి ‘యీ శకునిమతంబున కొడంబడవలయు’ ననినఁ గొడుకునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. 123
క. ధీరమతి విదురుతోడ వి | చారింతము; వాఁడు నయవిశారదుఁడు కళా
పారగుఁడు దీర్ఘదర్శి య | పార హితారంభుఁ డుభయపక్షంబులకున్‌.
124
వ. ‘సురపతి గురుండైన బృహస్పతి సేసిన నీతిశాస్త్ర రహస్యంబులం దెవ్వరికంటె విదురుం డెంతయు విశారదుం; డాతని బుద్ధిబలంబునను నాపగేయు బాహుబలంబుననుంజేసి యీ రాజ్యతంత్రంబు వర్తిల్లుచున్నయది; గావున నవ్విదురానుమతంబున నెగడుట లగ్గగు’ ననిన దుర్యోధనుం డి ట్లనియె. 125
తే. పాండుపుత్త్రుల కెప్పుడుఁ బక్షపాతి | విదురుఁ డని చెప్పఁ దొల్లియు విందు; దీని
నెఱిఁగి వారించుఁ గా, కతఁ డేల శకుని | కైతవంబున కొడఁబడుఁ గౌరవేంద్ర!
126
తే. దీని కొడఁబడు; మొడఁబడవేని నేఁడ | యీ క్షణమ సర్వభక్షుచే భక్షితుండ
నగుదుఁ; దెల్ల మే నట్లైన వగపుఁ దక్కి | విదురుఁడును నీవు నుండుఁడు ముదముతోడ.
127
క. అని కడు నడలుగఁ బలికిన | విని ధృతరాష్ట్రుండు దుఃఖవివశాత్మకుఁ డ
య్యును నెద నది యుచితము గా | దని వగచుచు నాత్మజునకు నాహ్లాదముగన్‌.
128
వ. అప్పుడు వేవురు శిల్పాచార్యుల రావించి, కనకరత్న ఖచిత స్తంభ సహస్రంబులను విచిత్రద్వార శతంబులను వివిధ రత్నరుచిర ప్రదేశంబులనుం జేసి రమ్యంబుగా నొక్క సభ నిర్మింపంబనిచి, యొక్కనాఁ డే కాంతంబ విదురునకు శకునిదుర్యోధనుల యభిప్రాయంబు చెప్పిన విని, యతండు విస్మితుండై, కలి ద్వారసమీపం బగుటయు జూదం బఖిలప్రజాక్షయకరం బగుటయు నెఱింగి ధృతరాష్ట్రున కి ట్లనియె. 129
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )