ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
విదురుఁడు ధృతరాష్ట్రునితో జూదమాడఁదగ దని చెప్పుట (సం. 2-51-23)
ఆ. ఇట్టి కార్యమునకు నే నవశ్యంబును | నొడఁబడంగ నోప నుక్కివమున
సుతులతోడ నేల సుతులకు భేదంబు | సేయఁ గడఁగి తిదియుఁ జెట్ట యనక.
130
తే. ఒలసి నీ పుత్త్రులెల్ల నొండొరులతోడ | నె ట్లొడంబడి యుండుదు రట్ల చేయ
వలయుఁ; దమలోన జూదంబు వాదు నగుటఁ | గలహ మూలంబ యెట్టి శాంతులకు నైన.
131
వ. ‘నీ నేర్చు విధంబున శకుని దుర్యోధనుల దుర్వ్యవసాయం బుడిగించి యిక్కురువంశంబు రక్షింపు’ మనిన విదురునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. 132
ఉ. పుత్త్రుల కేల భేదమగు భూనుత! యేనును నీవు జాహ్నవీ
పుత్త్రుఁడు నుండఁగా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె? నాకు నా
పుత్త్రులకుం బ్రసాదకృత బుద్ధులు వేల్పులు గాన దీనికిన్‌
మిత్రనిధీ! యొడంబడుము మిన్నక సంశయ మంద నేటికిన్‌?
133
వ. ‘వడిగల తురంగంబులం బూనిన రథం బెక్కి యింద్రప్రస్థపురంబునకుం జని యిందులకు ధర్మనందనుం దోడ్కొని ర’ మ్మని విదురుం బంచిన, నాతండును నాపగేయున కంతయు నెఱింగించి ‘యిది యపకర్మం’ బనుచుండె; నిట ధృతరాష్ట్రుండు దన నిర్మింపంబంచిన సభ దుర్యోధనునకుం జూపి యాతని కేకాంతంబున నిట్లనియె. 134
క. జూద మిది యేల? దీనను | భేదము మీలోనఁ బుట్టుఁ బెలుచన; యుష్మ
ద్భేదమునఁజేసి యె గ్గు | త్పాదిల్లు ధరిత్రిఁ బ్రజకు భయజననంబై.
135
ఉ. ఇమ్మహి నీవుఁ బాండవులు నెప్పటియట్ల పరస్పరానురా
గమ్మున నేలుచున్కి యిది కార్యము; పాండవలక్ష్మి నీ కస
హ్య మ్మన నేల? వంచనఁ బరార్థ పరిగ్రహబుద్ధిఁ జేసి పా
పమ్మగుఁ; బాపకారులకుఁ బాయు నవశ్యము నర్థధర్మముల్‌.
136
వ. ‘ధర్మాధర్మవిదుండైన విదురున కిది సమ్మతంబు గాదు; ధర్మజు ధనసంపదకంటె నేనుమడుంగులు నీకు ధన సంపద గలదు; వాని చేసిన యజ్ఞంబుకంటె విశేషంబుగా దక్షిణ లిచ్చి నీ కిష్టంబయిన యజ్ఞంబు సేయుము; నీకును భూలోకంబునంగల రాజులెల్లం దమసర్వస్వమ్ములుఁ దెచ్చియిత్తు’ రనిన విని దుర్యోధనుండు దండ్రి కి ట్లనియె. 137
క. ఇమ్ముల ధర్మజుతో జూ | దమ్మాడఁగఁ గాన్ప నాకు ధరణీశ్వర! య
జ్ఞ; మ్మదియ సమస్తైశ్వ | ర్యమ్ములు వడయఁగ నుపాయ మభిమతబుద్ధిన్‌.
138
క. మీ రిందుల కందఱుఁ జను | దేరఁగ నే నంద యుండితిని సభ చూడన్‌;
ధారుణి నట్టి యపూర్వ స | భారచనలు వినఁగఁ జూడఁబడ వెవ్వరిచేన్‌.
139
వ. నిర్మల స్ఫటిక శిలానిర్మితం బై శశిప్రకాశంబై వివిధరత్న ప్రభా భాసురంబైన యా సభావిభవంబు చూచువేడుక నందుఁ గ్రుమ్మరు వాఁడ హరినీల బద్ధస్నిగ్ధ మణిస్థలంబునందు జలబుద్ధింజేసి పరిధానోత్కర్షణంబుసేసి, విమల శిలాతలబుద్ధి నుదకపరిపూర్ణం బయిన వాపి సొచ్చి, కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుం జూచి వృకోదరుండు నగియె; దాని నంతయు నెఱింగి ధర్మరాజ చోదితులయిన కింకరులు నాకుం బరిధానంబులు దెచ్చి యిచ్చిరి; మఱియు వివృతద్వారంబుఁ గవాట ఘటితం బని చొరనొల్లక, కవాటఘటితంబు వివృతంబుగా వగచి, చొరంబోయి తత్కవాట స్ఫటిక శిలా ఘట్టిత లలాటుండ నైన నన్నుం జూచి యనేక సహస్ర విలాసినీ పరివృతయయియున్న ద్రౌపది నగియె; నంత నకుల సహదేవులు పఱతెంచి ‘యిదె వాకిలి యిట వచ్చునది’ యని నన్నుం దోడ్కొని పోయి; రట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యం బయి యున్నది. 140
క. పెద్దలు హీనతఁ బొందిరి | తద్దయు హీనులు సమృద్ధిఁ దనరిరి నియమం
బెద్ది విధియోగమున కసు | హృద్దర్పోన్నతులు సూచి యెట్లు సహింతున్‌.
141
క. పరమసుఖోపాయంబునఁ | బరసంపద చేకొనంగఁ బడునేని నరే
శ్వర! యంతకంటె మిక్కిలి | పురుషార్థం బెద్ది యొండు భూనాథులకున్‌.
142
క. నముచి యను దనుజుఁ డుగ్రత | పము సేయుచు నున్నవాని బలమథనుఁ డధ
ర్మమున వధియించె; రిపుప | క్షము నెమ్మెయి నైనఁ జెఱుపఁగా వలయు నిలన్‌.
143
ఆ. అల్పుఁడయ్యు మనుజుఁ డతి పరాక్రమమునఁ | బేర్మిఁ దరతరంబ పెరుగుచున్న
వాఁడు మ్రాని మొదలి వల్మీక మా మ్రానిఁ | జెఱుచు నట్లు గడఁగి చెఱుచుఁ బగఱ.
144
తే. అహితవృద్ధి యుపేక్షితం బగుడు నల్ప | మగు మహావ్యాధియును బోలె నది యసాధ్య
మయి యుపేక్షకు నిర్మూలితాత్ముఁ జేయుఁ | గాన పాండవశ్రీ యుపేక్ష్యంబు గాదు.
145
వ. ‘దాని నెవ్విధంబున నయిన నపహరింపవలయు; నట్లుగాని నాఁడు నా హృదయ తాపంబున కుపశమనంబుగా; దనిన దుర్యోధనునకు శకుని యి ట్లనియె. 146
సీ. నాగరథాశ్వసన్నాహ మొనర్పక, | యొడ్డనంబులు దీర్ప, కుభయ సైన్య
వీరుల కరముల వివిధాయుధంబుల | నన్యోన్యసంఘట్టనారవంబు
లెసఁగంగ సంగ్రామ మేర్పడఁ జేయక, | యక్షముల్‌ దొలిచి యే నశ్రమమునఁ
బ్రతిపక్షతతుల సంపదలు జయించి నీ | కిచ్చెద; వగవంగ నేల? ధర్మ
 
ఆ. రాజుఁ బ్రీతితోడ రావించి యతనితోఁ | గడఁగు జూద మాడఁ గౌరవేంద్ర!
యొండు పాటఁ బాండవోన్నతి వేల్పుల | కయిన నపహరింప నలవి గాదు.
147
వ. అనిన ధృతరాష్ట్రుండు దాని కొడంబడనొల్లక ‘యేను విదురు శాసనంబున వర్తిల్లుచున్నవాఁడ; నాతం డర్థానర్థ విదుండు, సకలకార్యసమర్థుండు; జూదంబున విగ్రహం బగు ననియె; బలవంతులతోడి విగ్రహంబు పరిహరించుట లగ్గు; నా వచనంబు ధర్మోపేతంబు; దీని నతిక్రమించి యనుతాపంబు సేయక యిప్పుడు జూదం బుడిగి యెప్పటియట్ల యుండుట కార్యం’ బనిన విని దుర్యోధనుం డతని కి ట్లనియె. 148
క. తనకార్య మొరుమతంబున | నొనరింపఁగ నేర నగునె యొరునిమతంబుం
దనమతము నొకఁడు గా నో | పునె? చెచ్చెర నిశ్చయింపఁబోలునె దానిన్‌?
149
ఆ. విదురుమతము పాండవేయహితార్థంబు; | వానిబుద్ధి నెగడవలవ; దన్య
పక్షపాతబుద్ధిఁ బరఁగుచు నుండెడు | నట్టి వాని నాప్తుఁ డనఁగ నగునె?
150
వ. ‘జూదం బన్నది పురాణంబులయందును వినంబడు; దీన దోషంబు లేదు; సుహృద్ద్యూతంబున దేవతలు దేవసాయుజ్యంబు వడయుదురు; గాన, దీనిం బ్రవర్తింప శకుని కానతిచ్చి యిందులకు ధర్మనందను రావింప వలయు’ ననిన ధృతరాష్ట్రుండు పెద్దయుం బ్రొద్దు చింతించి, యెట్టకేనియు దాని కొడంబడి, విదురుం బిలిపించి వాని కి ట్లనియె. 151
చ. అనుపమరత్నకాంచనచయాంచిత మీ సభ దీని ధర్మనం
దనుఁ డనఘుండు దానుఁ దన తమ్ములు నిందుల కేఁగుదెంచి చూ
చినఁ గడు సంతసం బగు విశిష్టజనస్తుత! నీవు వానిఁ దో
డ్కొని చనుదెమ్ము భూసురసఖున్‌ బుధబంధుజనానురంజనున్‌.
152
వ. ‘ఇట్టి విచిత్ర రత్న సభావేదికాతలంబున నతండును దుర్యోధనుతోడం బ్రొద్దువోక సుహృద్ద్యూతంబుఁ బ్రవర్తించు’ ననిన విని విదురుండు విషణ్ణహృదయుండయి ‘మాయా దురోదరంబు దురర్థంబుగాఁ జింతించి దీని నుడిగిన నుభయపక్షంబులకు ల గ్గగు’ నని పెక్కుమాఱులు వారించి. 153
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )