ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
విదురుఁడు ధర్మరాజుం దోడ్కొని వచ్చుట (సం. 2-52-1)
క. అవిలంఘనీయ మీదు | ర్వ్యవసాయం బనుచు సత్యవచనుఁడు ధర్మా
ర్థవిదుం డప్పుడు ధృతరా | ష్ట్రవిధాతృనియోగమున కొడంబడి యంతన్‌.
154
క. ఇంద్రప్రస్థపురంబున | కింద్రగురుప్రతిభుఁ డరిగి యింద్రసమానుం
జంద్రయశు ననుజసహితు నృ | పేంద్రుని ధర్మసుతుఁ గాంచె నెంతయుఁ బ్రీతిన్‌.
155
వ. అతనిచేత నభ్యర్చితుం డయి కుశలం బడిగి నిజాగమనప్రయోజనం బెఱింగించిన విని, విదురునకు ధర్మతనయుం డి ట్లనియె. 156
సీ. ‘పుత్త్రవత్సలుఁడు విచిత్రవీర్యాత్మజుఁ | డార్యుండు ధృతరాష్ట్రుఁ డాదరించి
నిన్ను నియోగించె నన్నుఁ దోడ్కొని తేర; | నీవును వచ్చితి నెమ్మితోడ;
లాలితాపూర్వసభాలోకనంబున | యందు జూదంబు కార్యంబె? చెపుమ;
జూదంబు కతమున భేదంబు గాకుండ | నేరదు మాలోన; నీనియోగ
 
ఆ. మనఘ! మా కలంఘ్య మయినట్లు ధృతరాష్ట్రు | పనుపుసేయ నీకుఁ బాడి యదియ’
యనుచు విధినియుక్తుఁ డయి యప్డు విదురుతో | నేఁగ నిశ్చయించె నిందుకులుఁడు.
157
క. అనుజులు ద్రుపదాత్మజయును | ననుచరముఖ్యులును ధౌమ్యుఁ డాదిగ విద్వ
జ్జనులును దోఁ జనుదేరఁగ | నినసన్నిభతేజుఁ డరిగె నిభపురమునకున్‌.
158
వ. అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్త్రశతంబుతో భీష్మశల్య శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణాశ్వత్థామ సోమదత్త సమేతుండయి యున్న ధృతరాష్ట్రునకు భానుమతీ ప్రభృతిస్నుషా పరివృతయయి తారకాపరివృత యయి యున్న రోహిణియుంబోలె నున్న గాంధారీదేవికిఁ గురువృద్ధజనులకు నతివినయంబున ననుజ సహితుండయి ధర్మతనయుండు మ్రొక్కె; నంత ద్రుపదరాజనందనయు గాంధారికి మ్రొక్కిన, నక్కోమలిం జూచి గాంధారికోడం డ్రెల్లను విస్మితలయి. 159
తే. ‘అఖిలలావణ్యపుంజంబు నబ్జభవుఁడు | మెలఁతగా దీనియందు నిర్మించె నొక్కొ!
కానినాఁ డిట్టి కాంతి యే కాంతలందు | నేల లే?’దని సామర్షహృదయ లయిరి.
160
వ. ఇట్లు పాండవ కౌరవు లతిప్రణయగౌరవంబున నద్దివసంబు సలిపి రంతఁ బ్రభాతంబ. 161
ఉ. ఆ ధృతరాష్ట్రుచేసిన యనర్ఘమణిప్రకరానుబద్ధ శో
భాధృతి నొప్పుచున్న సభ పార్థివముఖ్యుఁడు ధర్మజుండు దు
ర్యోధనుఁ డర్థిఁ జూపఁగ సహోదరవీరులుఁ దానుఁ జూచి ల
క్ష్మీధరమూర్తి యెంతయును మెచ్చె మనంబునఁ దద్విభూతికిన్‌.
162
వ. అయ్యపూర్వసభామణి కుట్టిమంబున నందఱు సుఖాసీనులయి యిష్టసంభాషణాది క్రీడావసరంబున నున్నంత దుర్యోధనుండు యుధిష్ఠిరున కి ట్లనియె. 163
క. అనఘ! సుహృద్ద్యూతం బిం | దొనరింతము ప్రొద్దువోకయును నగు, జూదం
బునకుం బ్రియుఁడవు దక్షుఁడ | వన విందుము నిన్నుఁ బ్రీతి నక్షజ్ఞులచేన్‌.
164
వ. అనిన వానికి ధర్మతనయుం డి ట్లనియె. 165
తే. క్షత్త్రనీతిక్రమంబులు గావు సూవె | నికృతియును జూదమును; ధర్మనిత్యులైన
వారి కీ రెండు వర్జింపవలయు నెందుఁ; | బాపవృత్తంబు జూదంబు పార్థివులకు.
166
ఆ. కుటిలమార్గు లయిన కుత్సితకితవుల | తోడఁ గడఁగి జూదమాడఁ జనదు;
దానఁజేసి యర్థధర్మవివర్జితు | లగుదు రెట్టివారు జగములోన.
167
వ. ‘మఱియు మాయాద్యూతంబున జయించుట మహాపాతకం బనియును, ధర్మద్యూతంబున జయించుట ధర్మయుద్ధంబున జయించు నంతియ పుణ్యం బనియును నసితుండయిన దేవలుండు చెప్పె’ ననిన నయ్యుధిష్ఠిరునకు శకుని యి ట్లనియె. 168
క. ద్యూతకళాకుశలుండగు | నాతఁడు లోకజ్ఞుఁడును మహామతియును వి
ఖ్యాతుఁడు నగు సత్‌క్షత్త్రియ | నీతి విదుఁడు దగునె దాని నిందింపంగన్‌.
169
క. బలహీను లయిన వారలు | బలవంతుల నొడుచునపుడు బహుమాయల న
చ్చలమునఁ జేయుట యెందును | గలయదియ; జయంబ కాదె కర్తవ్య మిలన్‌.
170
వ. ‘జూదంబున కీ వోడుదేని యుడుగు’ మనిన నాతనికి ధర్మరా జి ట్లనియె. 171
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )