ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరాజు శకునితో జూదం బాడుట (సం. 2-53-13)
క. ‘బలవద్ద్యూతార్థముగాఁ | బిలువంబడి మగుడ నగునె? పెక్కులు పలుకుల్‌
పలుకంగ నేల?’ యని య | త్యలఘుఁడు ధర్మజుఁడు జూద మాడఁ గడంగెన్‌.
172
వ. ఇట్లు జూదంబున నయ్యెడు దోసం బెఱింగియు దైవానుశాసనంబున ధర్మజుండు దాని కభిముఖుండయి చందన కర్పూర కస్తూరీ పరిషిక్తంబయిన ద్యూతరంగంబునందు ముందఱ గంధపుష్పార్చితంబు లయిన యభిమతాక్షంబు లమర్చికొనియున్న సౌబల వివింశతి చిత్రసేన వికర్ణులం జూచి ‘వీరిలో నెవ్వఁడు నాతో జూదం బాడెడు వాఁ?’డనిన నాతనికి దుర్యోధనుం డి ట్లనియె. 173
తే. అనఘ! మా మామ శకుని నాకై కడంగి | జూదమాడెడి నీతోడఁ; గాదు నాక
యీతఁ డొడ్డిన ధనరాసు లెవ్వియైనఁ | బోఁడిగా నీకు నీఁగలవాఁడ నేను.
174
వ. అని తనచేతి యనర్ఘ రత్న కటకంబు లొడ్డిన, ‘నన్యులకయి యన్యులు జూదం బాడుట యెంతయు విషమం’ బనుచు ధర్మతనయుండు సాగరావర్త సంభవంబులయిన పరార్థ్యమణిహారంబు లొడ్డె; నిట్లు సుహృద్ద్యూతంబు ప్రవర్తిల్లు నదియైన నచ్చోటికి వచ్చి భీష్మ ధృతరాష్ట్ర విదురకృపద్రోణాశ్వత్థామలు విచిత్రోచ్చాసనస్థు లయి దానిం జూచుచు నప్రహృష్టహృదయు లయి యుండి రంత. 175
తే. అభిమతాక్షముల్‌ దొల్చి మాయావిదుండు | సుబలరాజాత్మజుఁడు ధర్మసుతు జయించె;
నొడుతు నే నింక నని వెండియును గడంగె | శకునితో జూదమాడ నా శశికులుండు.
176
వ. ఇట్లు యుధిష్ఠిరుండు బద్ధమత్సరుండయి పెఱిఁగి యొండొండ యొడ్డుచు నిష్కసహస్రభరితానేకాయుత కుండమండితంబు లయిన సువర్ణభాండాగారంబులును, వజ్రవైదూర్యమరకతమౌక్తికనీలప్రవాళ పద్మరాగాది వివిధ శుద్ధ విపుల రత్న పరిపూర్ణంబు లైన రత్నభాండాగారంబులుం, బ్రత్యేకంబ పంచద్రోణ కాంచన సంచితంబు లయిన చతుశ్శతనిధులును, మణికింకిణీ జాలాలంకృతంబు లయిన యసంఖ్యాత హయ యూధంబులును, జాతరూప వరూధంబులుం గనక కక్ష్యాకుథ సనాథంబు లయిన మదాంధ గంధ సింధుర సందోహంబులుం, బరార్థ్య రత్న భూషణ భూషితంబు లయిన యోషిత్సహస్రంబులును, ననుదినాతిథి జన భోజనపాత్రహస్తులయిన శతసహస్రపరిచారకులును, నర్జునునకుఁ జిత్రరథుం డిచ్చిన గంధర్వ హయంబులం దొట్టి దుగ్ధపానశాలి తండుల ఖాదనంబులం బెరుఁగుచున్న జాత్యశ్వానేకాయుతంబులు, నజావి గో మహిష ఖర రాసభ నివహంబులు నొక్కొక్క యొడ్డునన యొడ్డి యోటుపడినం జూచి విదురుండు ధృతరాష్ట్రునకు రహస్యంబున ని ట్లనియె. 177
క. ఖలుఁ డీ దుర్యోధనుఁ డె | గ్గులతోడన యుద్భవిల్లె; గోమాయురుతం
బులు వించె, దుర్నిమిత్తం | బులు పెక్కులు వుట్టె వీని పుట్టిన వేళన్‌.
178
వ. తొల్లి యెన్నండును బాపంబుం బొరయని మహాభిష భీమసేన ప్రతీప శంతనుల కులంబు దుర్యోధనుకారణంబునం బాపభూయిష్ఠంబు గానున్నయది; యొక్కని కారణంబునఁ గులంబున కెగ్గగు నేని వాని దూషించి కులంబు రక్షించుట ధర్మం బని శుక్రుండు చెప్పెఁ; గులరక్షణార్థం బంధక యాదవ వృష్ణి వీరులు కృష్ణు నియోగించి కులదూషకుండైన కంసుని వధియించిరి గావున. 179
మత్తకోకిల. వాసవాత్మజుఁ బంపు మిప్పుడ వాఁడు ధర్మవిదుండు నీ
శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్‌;
భూసతీశ్వర! దీన నీకులమున్‌ మహీప్రజయున్‌ గత
త్రాసవృత్తిసుఖంబు వొందుఁ; బ్రధానవిగ్రహ మేటికిన్‌?
180
ఉ. ఇమ్మనుజాధమున్‌ గుణవిహీను బహిష్కృతుఁ జేసి ధర్మమా
ర్గమ్మునఁ గౌరవాన్వయముఁ గావుము; పాండుతనూజులం బ్రతా
ప మ్మెసఁగంగ నేలు; మిది పథ్యము సు; మ్మొక నక్క నిచ్చి సిం
హమ్ముల విల్చికో లుఱదె? యన్యులె వారలు కౌరవేశ్వరా!
181
మధ్యాక్కర. అంగారములు గొనువేడ్కఁ బుష్పఫలావళీ లలిత
తుంగద్రుమప్రకరంబుఁ గరుణావిదూరుఁడై కాల్చు
నంగారకారుఁ బోలంగ సమకట్టె నర్థలోభంబు
నం గురుకులహానికరుఁడు ధారుణీనాథ! నీ సుతుఁడు.
182
ఆ. అధికదర్పయుక్తమై బలీవర్దంబు | నగముదరి విదారణంబు సేయఁ
గాలుద్రవ్వునట్లు గడు బలాఢ్యులతోడ | నేచి వీఁడు విగ్రహింపఁ దొడఁగె.
183
వ. ‘ఇంక నయిన నుపేక్షింపక యీ దుష్టద్యూతంబు వారింపు ‘మనినఁ బుత్త్రస్నేహంబున నెద్దియుం జేయునది నేరక ధృతరాష్ట్రుండు మిన్నకుండె; నంత విదురుండు దుర్యోధనున కభిముఖుండై యి ట్లనియె. 184
క. న్యాయంబు విడిచి సౌబలు | మాయా ద్యూతమునఁ బాపమతివై భరతా
మ్నాయు లగు పాండవేయుల | శ్రీ యిమ్మెయిఁ గొనిన నిన్నుఁ జీ యనరె యొరుల్‌.
185
క. ధృతిమంతుల భుజవిక్రమ | జితశత్రులఁ బాండవేయసింహులను మదో
ద్ధతిమైఁ బరాజితులఁ జే | సితి; వారల కిట్లు నికృతి సేయుట లగ్గే?
186
వ. అనిన విని విదురున కలిగి దుర్యోధనుం డి ట్లనియె. 187
సీ. పరుల గుణంబులు పలుమాఱుఁ గీర్తింతు; | పక్షంబ పలుకుదు పాండవులకు;
ధార్తరాష్ట్రుల సంతతంబు నిందింతువు; | కుడిచిన చోటికిఁ గూర్ప వెపుడు;
నుత్సంగతలమున నుగ్రవిషోరగం | బున్నట్లు నీవు మా యొద్ద నునికి;
పరులసంపద సుఖోపాయబలంబునఁ | గొనుట భూపతులకు గుణము కాదె?
 
ఆ. యడుగకయును గర్జ మది యిష్టుఁడై చెప్పు | నతని కాడఁ దగిన యదియ; నన్ను
నిట్టు నట్టు ననఁగ నేల? నీ యిమ్ముల | నుండు; బుద్ధి సెప్పకుండు మాకు.
188
వ. అనిన విదురుం డి ట్లనియె. 189
క. చెడఁ గఱపువార చెలులుం | గడుకొని నీయట్టివారి కర్జంబులు చె
ప్పెడు వారుఁగాక, నీకున్‌ | మడవక మా యట్టివారి మాటలు గొఱయే?
190
తే. ప్రియము పలికెడువారిన పెద్ద మెత్తు, | రప్రియంబును బథ్యంబునైన పలుకు
వినఁగ నొల్లరు, గావున వేడ్కదానిఁ | బలుక రెవ్వరు నుత్తమప్రతిభు లయ్యు.
191
తే. మొదల నప్రియ మయ్యును దుదిఁ గరంబు | పథ్య మగు పల్కు ప్రియులందు బలిమి నైనఁ
బలుక వలయు మోమోడక యొలసి యట్టి | వాఁడు దగు సహాయుండు భూవల్లభునకు.
192
వ. ‘ఏను సపుత్త్రకుండైన వైచిత్రవీర్యు కార్యంబునకు హితుండనై నెగడుదు; నట్టి న న్నన్యథాబుద్ధి నొల్లక పలికితి; పాండవులతోడి విగ్రహంబు లగ్గుగా’దని చెప్పి విదురుండు విగతవచనుండై యుండె; నంత శకుని ధర్మనందనున కి ట్లనియె. 193
ఉ. ‘ఎల్లధనంబు నోటువడి తిందుకులేశ్వర! యింక నొడ్డఁగా
మొల్లము నాకుఁ జూపు’మని ముందట సారెలు ద్రోచి యాడఁగా
నొల్లకయున్న సౌబలున కున్నతచిత్తుఁడు ధారుణీతలం
బెల్లను నొడ్డి యోటువడియెన్‌ బలవద్వ్యసనాభిభూతుఁడై.
194
వ. ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్కఁ దక్కిన మహీతలంబును, బ్రాహ్మణులు దక్క సర్వప్రకృతిజనులను, రాజ పుత్త్రుల నొక్కొక్క యొడ్డున నొడ్డి యోటువడి వెండియు. 195
సీ. తమ్ముల నత్యంత ధర్మసమేతుల | నాయతబాహుల నాజిజయుల
నాదిత్యతేజుల నాదిభూపాలక | చరితుల నభిమానసత్యరతుల
సహదేవనకులవాసవసుతభీములఁ | గ్రమమున నలువురఁ గౌరవేంద్రుఁ
డొక్కొక్క యొడ్డున నొడ్డి తన్నును నొడ్డి | యుక్కివంబున నప్పు డోటు వడిన
 
ఆ. నతనిఁ జూచి శకుని యనియె ‘నిట్లేల ని | న్నొడ్డి తధిప! నీకు నొండుధనము
గలదు; మఱచి తెట్లు? కమలాక్షి పాంచాల | కన్య నీకు ధనము గాదె?’ యనిన.
196
చ. అలయక వెండియుం గడఁగి యక్షరతుండయి ద్రౌపదిన్‌ మహో
త్పలదళచారునేత్రఁ గులభామఁ బణంబుగఁ జేసి యొడ్డి సౌ
బలఖలుచేత నోటువడి పాండుసుతుం డుడిగెన్‌ ధనంబు ల
గ్గలముగ నొడ్డలేమి గతగర్వమునం గడు దీనవక్త్రుఁడై.
197
సీ. ఆతనిఁ జూచి ద్రోణాచార్య కృప భీష్ము | లవిరళ స్వేదాంగు లగుచు వృద్ధ
జనులును దారు నిశ్శబ్ద నిరంతర | ముఖులైరి; విదురుండు మొగము వాయ
నిడి తలవాంచి త న్నెఱుఁగక దుఃఖితుం | డై యుండెఁ; దక్కిన యా సదస్యు
లందఱుఁ బ్రబలబాష్పాంబుధారాకులి | తాక్షులై; రత్యుచ్చమై పయోధి
 
ఆ. పటురవాభమై సభాక్షోభ మయ్యె; దు | శ్శాసనుండుఁ గర్ణసైంధవులును
నధికహర్షవికసితాస్యంబు లొప్ప నొం | డొరులఁ జూచి నగుచు నుండి రపుడు.
198
వ. ధృతరాష్ట్రుండును ‘నిది యేమి సభాక్షోభం? బెవ్వ రెవ్వ రే వస్తువు లొడ్డి?’ రని విదురు నడుగుచుండె; నట్టి యవసరంబున దుర్యోధనుండు పాండవులం దనకు దాసులంగా నొడిచినవాఁడై పెఱిఁగి. 199
క. వరవుళ్ళఁ గలసి తనయిలు | పరువడిఁ దుడువంగఁ గృష్ణఁ బనుచువగన్‌ భా
సుర రాజ్యదర్ప మొప్ప వి | దురుఁ జెచ్చెరఁ బంచె దానిఁ దోడ్కొని తేరన్‌.
200
క. దాని సహింపక విదురుం | డా నరపతి కిట్టు లనియె ‘నజ్ఞానులు నీ
తో నెన లే రొరు; లిట్లు మ | హానిష్ఠురవృత్తిఁ బనుప నగునే నన్నున్‌?’
201
క. మదమలినమనస్కుఁ డరుం | తుదుఁడు నృశంసుఁ డనఁ బరఁగు దుర్జనునకు సం
పద లెడలయ్యును నాతని | మొదలిటి సంపదలతో సమూలంబు చెడున్‌.
202
క. అవనీతలసామ్రాజ్యో | త్సవమునకును యోగ్యమైనసతి ద్రౌపది పాం
డవధర్మపత్ని నీ కం | తవమానము సేయ నేమి యనపాశ్రయయే.
203
తే. ఏల యాశీవిషంబుల నెఱిఁగి యెఱిఁగి | మూర్ఖవై యలిగించెదు? మొనసి యొరుల
ధనము నికృతిమై గొను టిది ధర్మువగునె? | శకునిమతమునఁ బాపంబుఁ జనునె చేయ?
204
వ. జూదంబున నెగ్గు పుట్టు; దీన నయ్యెడు ఫలంబు వేణుఫలంబునుంబోలె సహమూలవినాశంబునకు నిమిత్తం బగు’ననిన దుర్యోధనుండు విదురుం దూలనొదరి, ప్రాతికామి యనువానిం బిలిచి’ యీ విదురుం డెప్పుడు నరిష్టంబ కాని పలుకండు; పాండవులకు వెఱచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని ర’మ్మని పంచిన. 205
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )