ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
ప్రాతికామి ద్రౌపదిని సభకుఁ దోడ్కొని వచ్చుట (సం. 2-60-3)
ఆ. అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి | సూతనందనుండు ప్రాతికామి
పాండవాగ్రమహిషిపాలికిఁ జని భక్తి | వినతుఁ డగుచు నిట్టు లనియె సతికి.
206
తరువోజ. ‘ధనసంపదలు నిజధరణిరాజ్యంబుఁ దనయులం దమ్ములఁ దన్నును నిన్నుఁ
దనరఁ జూదంబాడి ధార్తరాష్ట్రులకు ధర్మతనూజుండు దా నోటువడియె;
వనజాక్షి! కౌరవవరుపని నిన్ను వడిఁ దోడుకొని పోవ వచ్చితి నిపుడ;
చనుదెమ్ము కౌరవేశ్వరుకడ’ కనిన జలజాయతాక్షి పాంచాలి యి ట్లనియె.
207
ఆ. ‘ఏయుగంబునందు నెట్టి దుష్కితవుండు | భార్య నొడ్డి యోటువడినభర్త
గలఁడె? యిది వినంగఁ గడు నపూర్వం బయ్యె; | నిట్లు సేయునొక్కొ యిందుకులుఁడు?
208
తే. మున్ను ద న్నోటువడి మఱి నన్ను నోటు | వడియెనో, నన్ను ము న్నోటువడి విభుండు
గ్రన్నఁ ద న్నోటువడియెనో యన్న! నాకు | నెఱుఁగఁ జెప్పుము దీని నీ వెఱుఁగుదేని.’
209
వ. ‘ఎఱుంగవేని యక్కితవు నడిగి వచ్చి మఱి నన్నుం దోడ్కొని పోవనగునేని తోడ్కొని పొ’మ్మనినం బ్రాతికామి క్రమ్మఱి వచ్చి పాంచాలిపలుకులు ధర్మరాజునకుం జెప్పిన, దురోదర పరాజయ దుఃఖిత చేతస్కుం డగుటం జేసి యతఁడు వానికి నదత్తప్రతివచనుం డైనఁ, బ్రాతికామికి దుర్యోధనుం డి ట్లనియె. 210
క. ‘సందిగ్ధ మయిన యర్థము | నిందఱ సన్నిధిన యడిగి; తింద ఱెఱుంగన్‌
సుందరిఁ బాంచాలేంద్ర సు | తం దోడ్కొని రమ్ము, పొమ్ము! తడయక’ యనినన్‌.
211
వ. వాఁడును ద్రౌపది పాలికింబోయి ‘దేవీ! నీ యడిగిన యర్థంబ నిర్ణయించువా రయి సభ్యులు నిన్ను రాఁబంచిరి; ర’మ్మనిన దుర్యోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజుసమ్మతంబునకు వెఱచి, యక్కోమలి ప్రాతికామిపిఱుంద నేకవస్త్రయు నధోనీవియు నవిరళగళితనయనోదకబిందుసందోహపరిపీడ్యమానపీనస్తన పరిధానాంతరయు నగుచు సభకుం జనుదెంచి కురువృద్ధుసమీపంబున నున్నంత; ద్రౌపదిం జూడ నోపక లజ్జితులయి దుఃఖాయమాన మానసులయి తలలు వాంచియున్న పాండవుల వైలక్ష్యం బుపలక్షించి సంతసిల్లి దుర్యోధనుండు దుశ్శాసనుం బిల్చి ‘ప్రాతికామి వృకోదరునకు వెఱచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని ర’మ్మని పంచిన. 212
ఆ. నిర్దయాత్ముఁ బాపనిరతు దుశ్శాసనుఁ | బనుచు టెఱిఁగి కృష్ణ పంకజాక్షి
గడుభయంబు నొంది గాంధారియొద్దకు | నరిగెఁ గడు నడంగి యతిరయమున.
213
చ. తడయక కౌరవానుజుఁడు దాని పిఱుందన పాఱి ‘యింక నె
క్కడ కరుగంగఁబోలుఁ? జులుకం జను దెమ్మిట; సౌబలుండు ని
న్నొడిచె దురోదరంబునఁ; గురూత్తము నర్థమ వైతి; నిన్నునుం
బుడమిని దమ్ముఁ గోల్పడిరి పొల్తి! భవత్పతులైన పాండవుల్‌.’
214
వ. అనుచు డాయ వచ్చిన నక్కోమలి ‘రజస్వల నన్ను ముట్టకు; మేకవస్త్ర నయి యున్నదాన; గురుబంధు జనాధిష్ఠి తంబైన సభకు నెట్లు రా నేర్తు?’ ననిన ‘నీ వేకవస్త్ర వైతేమి విగతవస్త్ర వైతేమి? ని న్నెట్లుం దోడ్కొని పోదు’నని బలాత్కారంబున. 215
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )