ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
దుశ్శాసనుఁడు ద్రౌపదిని సభలోని కీడ్చి తెచ్చుట
ఉ. ఆ వనజాననం గురుకులాపశదుండు గడంగి రాజసూ
యావభృథంబునందు వసుధామరమంత్రపవిత్రవారిధా
రావళిఁ జేసి పావనము లైన శిరోజములం దెమల్చి పా
పావహుఁ డీడ్చి తెచ్చె సభ కందఱు సంభ్రమమంది చూడఁగన్‌.
216
వ. ఇట్లు వాతావధూతంబైన పతాకయుంబోలె దుశ్శాసనాకృష్టయై ద్రౌపది వికీర్ణకేశయు వివర్ణవదనయునై కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్ట భూయిష్ఠంబైన సభకు వచ్చి కోపలజ్జాపరవశ యయి. 217
చ. అనుపమ దైవయోగహతుఁ డయ్యు నవశ్యము ధర్మసంపదం
దనరున కాక ధర్మజుఁడు ధన్యుఁడు ధర్మపథంబు తప్పఁద్రొ
క్కునె కురువృద్ధులార! భృశకోపనుఁ డీతఁడు నన్ను నేల దు
ర్జనుఁ డిట యీడ్చి తెచ్చె నవిచారపరుం డయి దుర్మదంబునన్‌.
218
చ. ‘ఇది యుచితంబు గా దనక యిక్కురుముఖ్యులు సూచుచుండ దు
ర్మదుఁ డయి వీఁడు నన్ను నవమానితఁ జేసెడి; సర్వధర్మ సం
విదు లన నున్న యీ భరతవీరులవంశము నేఁ డధర్మ సం
పద నతినింద్య మయ్యె’ నని భామిని గృష్ణుఁ దలంచె భీతయై.
219
వ. ఇట్లు జగత్త్రయ విజయ భుజవీర్య సనాథులైన నాథులు గలిగియు ననాథయుంబోలెఁ బాంచాలరాజపుత్త్రి భయార్తయై యార్తజన శరణ్యుండైన జగన్నాథు జనార్దనుం దలంచుచుఁగపట ద్యూతమధుమదోన్మత్తుండయిన ధర్మపుత్త్రు నిమిత్తంబున నుద్గతంబయిన పాండవపరాజయ దహనంబుఁ దన రూక్ష కటాక్ష వీక్షణ వచనంబులఁ బ్రవర్తించుచున్నదానిఁ జూచి దుఃఖితుండై భీమసేనుండు ధర్మరాజున కి ట్లనియె. 220
క. ధన కనక రత్న వరవా | హన ధరణీ రాజ్యములును నాయుధములు మ
మ్మును నోటువడుట యుచితమ | యినసన్నిభ! వీని కెల్ల నీశుఁడ వగుటన్‌.
221
క. ద్రుపదతనూజం బణముగఁ | గపటద్యూతమునఁ జేయఁగాఁ దగునె జనా
ధిప! యిది దుష్టద్యూతము | నెపమునఁ బరిభూత యయ్యె నిష్కరుణులచేన్‌.
222
వ. ‘శకునికైతవం బెఱింగియుం బాపద్యూతంబునఁ బ్రవర్తించి యధర్మ ప్రవృత్తుండ వయితి కావున భవద్బాహు దాహంబు సేయవలయు’ నని కోపించి పలికినం బవనతనయునకు నర్జునుం డి ట్లనియె. 223
సీ. ధర్మతనూజుండు ధర్మువు దప్పిన | ధరణీతలం బెల్లఁ దల్లడిల్లుఁ;
దగిలి సుహృద్ద్యూత ధర్మయుద్ధములకుఁ | బరులచేఁ బిలువంగఁబడి విభుండు
గడగక విముఖుండు గాఁ జన దని శుభ | క్షాత్త్రధర్మంబు లోకంబునందు
నిలిపెఁ దా; నిది పతినేరమియే? దైవ | వైపరీత్యం బైన వనరఁ దగునె?
 
ఆ. గురుల ధర్మపరులఁ గోపించి ధీరు ల | తిక్రమింతురే? తదీయనిత్య
ధర్మగౌరవం బధార్మికు లగుచున్న | పరులచేతఁ జెఱుపఁబడియె నిట్లు.
224
వ. అనుచు దుఃఖితులగు చున్న పాండవులను దుశ్శాసనాపకృష్టయై సభాంతరంబున నున్న ద్రౌపదిం జూచి వికర్ణుం డన్యాయశ్రవణవికర్ణులై మిన్నకున్న సభ్యుల కి ట్లనియె. 225
క. సమచిత్తవృత్తు లగు బు | ద్ధిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్న విచా
రము సేయ వలయు; నవిచా | రమునఁ బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్‌.
226
వ. ‘ఇక్కురువృద్ధు లైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులును నాచార్యులయిన ద్రోణకృపాదులుం బలుకరైరి; యున్న సభాసదులెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం’డనిన నెవ్వరుం బలుకకున్న ‘నే నిందు ధర్మ నిర్ణయంబు సేసెద; నెల్లవారును వినుండు; జూదంబును వేఁటయుఁ బానంబును బహుభక్షణాసక్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలిన పురుషుండు ధర్మువుం దప్పివర్తిల్లు; నట్టి వాని కృత్యంబులు సేకొనం దగవు; కిత వాహూతుండై వ్యసనవర్తి యయి పరాజితుం డయిన పాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధారణ ధనంబయిన పాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత; యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొని తెచ్చుట యన్యాయం’ బనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె. 227
ఆ. ‘ఎల్లవారు నెఱుఁగ నొల్లని ధర్మువు | బేల! నీకుఁ జెప్ప నేల వలసెఁ?
జిఱుతవాని కింత తఱుసంటి పలుకులు | సన్నె వృద్ధజనము లున్నచోట?
228
వ. నీవు ద్రౌపది నధర్మవిజిత యని పలికితి; సభాసదులెల్ల నెఱుంగ ధర్మజుండు దన సర్వస్వమ్ము నొడ్డి యోటువడి నప్పు డిది వానికి వెలిగాదు గావున ధర్మవిజితయ; యిట్లు గానినాఁడు పాండవు లిందఱును దీని విజితఁగా నేల యొడంబడుదురు? మఱి యేకవస్త్రయై యున్న దీని సభకుం దోడ్కొని వచ్చుట ధర్మువు గాదంటి; భార్యకు దైవవిహితుం డయిన భర్త యొక్కరుండ; యిది యనేకభర్తృక గావున బంధకి యనంబడు; నిట్టిదాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లే’ దని కర్ణుండు వికర్ణువచనంబులకుం బ్రత్యాఖ్యానంబు సేసిన విని, దుర్యోధనుండు దుశ్శాసనుం బిలిచి ‘యిప్పాండవులయు ద్రౌపదియు వస్త్రంబు లపహరింపు’ మని పంచిన దాని నెఱింగి. 229
క. కితవవ్యవసాయపరా | జితు లగుటం జేసి బలిమి చెడి పాండుసుతుల్‌
ధృతిఁ దమ పయిపుట్టము లా | యతకీర్తులు మున్నపెట్టి యా సభ నున్నన్‌.
230
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )