ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
దుశ్శాసనుండు ద్రౌపది కట్టిన పుట్టం బొలుచుట (సం. 2-61-40)
సీ. ఇది సేయఁ గా దని మది విచారింపక | సద్గర్హితుండు దుశ్శాసనుండు
నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు | సభలోన విడ్చె నాశంక లేక
యుడుగక యొలువంగఁ బడియు ము న్నపనీత | మైన తద్వస్త్రంబు నట్టి వలువ
లలితాంగిజఘనమండలమునఁ బాయక | యొప్పుచు నున్న నయ్యువిదఁ జూచి
 
ఆ. సభ్యులెల్ల నుదితసమ్మదు లయిరి దు | శ్శాసనుండు వస్త్రచయము పర్వ
తోపమాన మయిన నొలువంగ నోపక | యుడిగె లజ్జఁ బొంది యుక్కు దక్కి.
231
వ. ఇట్లు భీమసేనుండు ద్రుపదరాజనందనకు దుశ్శాసనుండు సేసిన యవమానంబు సూచి కోపరక్తాంత నయనుం డగుచు నంతకాకారంబున దంతసందష్టదారుణముఖుండయి యెల్లవారును విన ని ట్లనియె. 232
మ. కురువృద్ధుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో
ద్ధురుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్‌ దుశ్శాసనున్‌ లోకభీ
కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌.
233
వ. ‘ఇట్లు సేయనైతినేని పితృపితామహుల గతికిం దప్పినవాఁడ నగుదు’ ననిన నతని యతిమానుషంబయిన మహావ్యవసాయంబున కద్భుతం బంది దిక్కులు చూడక ధిక్ఛబ్దముఖరిత ముఖు లగుచు సభాజనులు తమలో సపుత్త్రకుండయిన ధృతరాష్ట్రు నిందించుచు ‘ద్రుపదరాజపుత్త్రి వాక్యంబులు విచారింపక వృద్ధరాజు లుపేక్షించి’ రనుచుండి; రంత నుద్యతబాహుం డయి విదురుం డెల్లవారిని వారించి యి ట్లనియె. 234
క. సుమతులు పాంచాలీ ప్ర | శ్నము నర్థము నేర్పడన్‌ విచారింపుఁడు పా
పము వొందు ధర్మసందే | హము దీర్పనినాఁడు సభ్యులగు సజ్జనులన్‌.
235
మత్తకోకిల. ఈ వికర్ణుఁడు బాలుఁ డయ్యును నేర్పరించి యథావిధిన్‌
దేవమంత్రియపోలె ధర్మువుఁ దెల్పె; నీతనిబుద్ధి మీ
రేవగింపక చేకొనుం డిది; యెల్లయందును ధర్మ స
ద్భావ మొక్కని కేర్పరింపఁగ బ్రహ్మకైనను బోలునే?
236
ఆ. సభకు వచ్చి ధర్మసందేహ మడిగిన | నెఱిఁగి చెప్పకుండిరేని సభ్యు
లనృతదోషఫలమునం దర్ధ మొందుదు | రనిరి ధర్మవేదులైన మునులు.
237
ఆ. ధర్ము వెఱిఁగి దానిఁ దా నొండుగా లాభ | లోభ పక్షపాతలోలబుద్ధి
సభల నెవ్వఁడేని సభ్యుఁడై పలుకు వాఁ | డనృతదోషఫలము ననుభవించు.
238
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )