ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
విరోచన సుధన్వుల వృత్తాంతము
వ. ఈయర్థం బితిహాసంబులయందు వినంబడుఁ; దొల్లి ప్రహ్లాదునికొడుకు విరోచనుండును నంగిరసుండను విప్రునికొడుకు సుధన్వుండును నొక్క కన్యా ప్రతిగ్రహ నిమిత్తంబున నెల్లసుగుణంబుల ‘నేన పెద్ద, నేన పెద్ద’ నని తమలో నిద్దఱును ప్రాణంబు లొడ్డుగా నొడ్డి వివాదంబు సేసి ప్రహ్లాదు పాలికిం జని; రందు సుధన్వుండు ప్రహ్లాదున కి ట్లనియె. 239
తే. నీవు ధర్మవిదుండవు మా వివాద | మెఱిఁగి తీర్పు గుణశ్రేష్ఠుఁ డితఁడొ నేనొ
చెప్పు; మన్యథాబుద్ధివై చెప్పితేని | మఘవు కులిశంబు వ్రచ్చు నీ మస్తకంబు.
240
వ. అనినం బ్రహ్లాదుండు భయంపడి కశ్యపుకడకుం జని విరోచన సుధన్వులు తన్ను వివాదనిర్ణయం బడిగిన విధంబును జెప్పిన విని వానికిం గశ్యపుం డి ట్లనియె. 241
తే. సాక్షియును ధర్మదర్శియు సాక్షిధర్మ | విధులు దప్పంగఁ జెప్పిన నధమవృత్తి
వరుణపాశసహస్రంబు వానిఁ గట్టి | పాయు నేఁటేఁట నొక్కొకఁ డాయతముగ.
242
వ. ‘ధర్మం బధర్మవిద్ధంబయి సభకు వచ్చిన దానిం దీర్పనిసభ్యు లధర్మవిద్ధు లగుదురు; మఱి సభ్యులు కామక్రోధంబులు విడిచి యధర్మంబు నాపనినాఁ డయ్యధర్మంబునం దొక్కపాదంబు సభ్యుల, నొక్కపాదంబు భూపతిఁ, దక్కినయది గర్తనుం బొందు; సమంజసులైన సభ్యులచేత విధ్యుక్తం బయ్యెనేని నధర్మంబు కర్తనుం బొందుఁ; గావున ధర్మంబు దప్పక చెప్పవలయు’ననినం బ్రహ్లాదుండు ధర్మమతియై విచారించి తనకొడుకుకంటె గుణశ్రేష్ఠుఁడుగా సుధన్వుం జెప్పినఁ, ‘బుత్త్రస్నేహంబు విడిచి ధర్మువు దప్పక చెప్పి’ తని ప్రహ్లాదుం బ్రశంసించి సుధన్వుం డరిగెఁ; గావున ‘మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధిసేయుం’ డని విదురుండు పలికిన, దుర్యోధను భయంబున సభ్యు లెవ్వరుం బలుకరయిరి; ద్రౌపదియు నట్లు సకలక్షత్త్రియసమక్షంబున దుశ్శాసనుచేతం బరిభవింపంబడి దుఃఖిత యయి. 243
సీ. ‘అవ్విధంబున నొప్పి యా స్వయంవరము నాఁ | డఖిల భూపతులచే నట్లు సూడఁ
బడి, పాండవుల ధర్మపత్నినై, గోవిందు | చెలియలినై, వీనిచేత నిట్లు
పరిభూత నగుచు సభామధ్యమున మహీ | పతులచేఁ జూడంగఁ బడితి; నింత
వడుదునె? యిపుడు నా పలుకుల కెవ్వరుఁ | బ్రతివచనం బేల పలుక రైరి?
 
ఆ. ధన్యులార! యే నదాసినే? దాసినే? | యెఱుఁగఁ జెప్పి పనుపుఁ’ డెల్ల దాని
ననుచు వనరుచున్న నాపగాసుతుఁడు శాం | తనవుఁ డిట్టు లనియె దానిఁ జూచి.
244
వ. ‘అవ్వా! నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యుధిష్ఠిరుఁడు సెప్పవలయుఁ; గానినాఁడు ధర్మసూక్ష్మత యెవ్వరికి నెఱుంగ గహనంబు; దీని ఫలంబు వేగంబ యిక్కురుకులపాంసను లనుభవింతు’ రని పలుకుచున్న యవసరంబున నక్కోమలిం జూచి నగుచు. 245
తే. ‘తరుణి! యేవురకంటె నొక్కరుఁడ భర్త | యగుట లగ్గు; జూదంబున నాలి నోటు
వడని వానిఁగాఁ దగు భర్తఁ బడయు మింక’ | ననుచు రాధేయుఁ డుల్లసమాడె నంత.
246
ఉ. అమ్ముదితన్‌ విభీతహరిణాక్షిఁ గలాపవిభాసికేశభా
రమ్మున నొప్పు దానిఁ దన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా
రమ్మని సన్న సేసె ధృతరాష్ట్రసుతాగ్రజుఁ డప్డు; దాని దూ
రమ్మునఁ జూచి కౌరవకురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్‌.
247
క. లయసమయదండధర ని | ర్దయుఁడై ధరణీశు లెల్లఁ దనపలుకులు వి
స్మయసంభ్రమభయసంభృతు | లయి వినుచుండంగ నిట్టు లనియెన్‌ సభలోన్‌.
248
ఉ. ధారుణి రాజ్య సంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరుదేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్‌.
249
వ. అని సర్వజన భయానక క్రోధావేశ వివశుండయి యాయుధంబు లున్న వలనికి దృష్టులు సలుపుచు నగ్రజు మొగంబు సూచుచున్న భీమసేను నతిరౌద్రాకారంబు సూచి భీష్మ విదుర ద్రోణాదు‘లిది కోపంబున కవసరంబు గా’దని యాతనిం బ్రశాంతచిత్తుం జేసి రంత. 250
క. ధృతరాష్ట్రు నగ్నిహోత్రా | యతనంబున నఱచె వఱళు, లగ్నులు శాంత
ద్యుతులయ్యెఁ, గౌరవ స్త్రీ | తతిహృదయము లధికశోకతప్తము లయ్యెన్‌.
251
క. క్రూరాత్మకులై దుష్పద | వీ రతులగు ధార్తరాష్ట్రవీరుల శయ్యా
గారముల నెగసె నెంతయు | ఘోరంబుగఁ గాక ఘూక ఘూత్కారంబుల్‌.
252
క. అట్టి మహోత్పాతంబులు | పుట్టినఁ గృప విదుర కలశభూ శాంతనవుల్‌
‘నెట్టన ధృతరాష్ట్రజులకుఁ | బుట్టె నరిష్ట’ మని రిష్టమునఁ దమలోనన్‌.
253
వ. అంత నంతయు నెఱింగి గాంధారి విదురుం దోడ్కొని ధృతరాష్ట్రు కడకుంబోయి పాండవపరాజయంబును ద్రౌపదిపరిభవంబును దుర్నిమిత్తోత్పత్తియుం జెప్పిన విని, ధృతరాష్ట్రుండు దుర్యోధనుం బిలిచి యి ట్లనియె. 254
చ. పరమపతివ్రతన్‌ సభఁ దపస్వినిఁ బాండవధర్మపత్ని ధ
ర్మరత నయోనిజం బ్రకృతిమానవభామినిఁగాఁ దలంచి దె
ప్పరములు వల్కఁగాఁ దగునె? బాల్యము నాదిగ దుష్టభావనం
బెరిఁగితి నీ నిమిత్తమునఁ బెద్దయు దుఃఖితు లైరి పాండవుల్‌.
255
వ. ‘వారలవలన నీ దురాగ్రహం బుడుగు’మని కొడుకును భంగించి సకలబాంధవహితంబు సేయందలంచి ద్రౌపదిని రావించి శాంతవచనంబుల నిట్లనియె. 256
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )