ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
ధృతరాష్ట్రుండు ద్రౌపదిగోరినవరంబు లిచ్చుట (సం. 2-63-27)
క. సుందరి! నా కోడండ్రుర | యం దభ్యర్హితవు నీవ; యతిముదమున నీ
కుం దగఁ బ్రియంబు సేసెద | నిందుముఖీ! వేఁడు మెద్ది యిష్టము నీకున్‌.
257
వ. అనినం బాంచాలి యి ట్లనియె. 258
ఆ. కరుణతోడ నాకు వరము ప్రసాదింప | బుద్ధియేని లోకపూజితుండు
మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు | వలనఁ బాయవలయు వసుమతీశ!
259
వ. ‘అ ట్లయినం గురుకుమారులు గురువృద్ధజనలాలితుండై పెరిఁగిన ప్రతివింధ్యు దాసపుత్త్రుం డనకుండుదు; రిదియ నా యిష్టం’ బనిన ‘నిచ్చితి; నింక రెండవవరంబు వేఁడు’ మనిన ద్రౌపది యి ట్లనియె. 260
క. నెమ్మిని ధర్మజు నలువురు | దమ్ములుఁ దమ యాయుధములఁ దమవర్మవరూ
థమ్ములయుఁ దోడ సకల హి | తమ్ముగఁ బాయంగవలయు దాస్యము వలనన్‌.
261
వ. అనిన ధృతరాష్ట్రుండు ‘నీకోరిన వరం బిచ్చితి; నింక మూఁడవవరంబు వేఁడు’ మనిన ద్రౌపది యి ట్లనియె. 262
ఆ. ‘వైశ్యసతికి నొక్క వరము, సత్‌క్షత్త్రియ | సతికి రెండు, శూద్రసతికి మూఁడు,
విప్రసతికి నూఱు వేఁడఁజ న్వరములు | గాన యింక వేఁడఁగాదు నాకు.’
263
వ. అనిన ధృతరాష్ట్రుండు కోడలి గుణంబులకు ధర్మం బెఱుంగుటకు సంతసిల్లి, యనుజ సహితుం డయిన యుధిష్ఠిరు రావించి ‘నీవు సర్వసంపదలు స్వరాజ్యంబు నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖం బుండుము; నీకు లగ్గయ్యెడు’ మని వెండియు. 264
తే. నీవు నిత్యంబు వృద్ధోపసేవఁ జేసి | యెఱుఁగు దెల్ల ధర్మంబులు; నెఱుక లేక
కడఁగి నీ కెగ్గు సేసె నా కొడుకు; దీని | మఱచునది; నీకు నే నొండ్లు గఱపనేల?
265
క. మనమున వేరమిఁ దలఁపమి | యును, సక్షమచిత్తుఁ డగుటయును, గుణములు కై
కొని దోషమ్ములు విడుచుట | యును నుత్తముఁ డయిన పురుషు నుత్తమగుణముల్‌.
266
వ. ఏను బుద్ధిలేక జూదం బుపేక్షించితి; నల్పబుద్ధిసత్త్వుండయిన వృద్ధు నన్నును, మీతల్లి యయిన గాంధారినిం దలంచి, దుర్యోధనాదులు సేసిన దుర్నయంబులు సేకొన కుండునది; సర్వశాస్త్రవిదుం డయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండవుగా నిక్కురుకులంబునకు లగ్గగు’నని ధర్మరాజుఁ బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన. 267
తరలము. తరుణి ద్రౌపది యిట్లు పాండవధార్తరాష్ట్రులదైన భీ
కర పరస్పర కోపవేగము గ్రన్నఁ బాచి విపత్తి సా
గర నిమగ్నుల నుద్ధరించెఁ బ్రకాశకీర్తుల ధీరులం
బురుషసింహములన్‌ నిజేశులఁ బూని తద్దయుఁ బ్రీతితోన్‌.
268
సీ. దాని నంతయు భీమసేనుండు విని ‘రాజ్య | సంప్రాప్తి పాండవసత్తములకు
సతికారణంబున ధృతమయ్యె నను నింత | కంటెను గష్టంబు గలదె యొండు;
పేర్మి నపత్యంబుఁ గర్మంబు విద్యయు | నను నివి తేజంబు లట్టె తగిన
పురుషున కెందును; నిరతంబు మిక్కిలి | తేజంబు కర్మంబు; దీని విడిచి
 
ఆ. యలుక గాఁడె పురుషుఁ’ డని కోపఘూర్ణిత | రక్తనేత్రుఁడై ‘పరాక్రమమున
శత్రువరుల నుగ్రసంగరంబునఁ జంపి | కుతలరాజ్యమెల్లఁ గొందు’ ననుచు.
269
వ. మృగమధ్యంబున నున్న సింహంబునుంబోలె ననుజమధ్యంబున నున్న యాతనిం గరంబున వారించి, ధర్మరాజు ధృతరాష్ట్రు శాసనంబునం దమ్ములుం దానును ద్రౌపదీ సహితంబుగాఁ గాంచనరథారూఢుఁ డై యింద్రప్రస్థపురంబున కరిగిన; నిట దుశ్శాసనుచేత నంత వృత్తాంతంబును విని దుర్యోధనుండు కర్ణశకుని సైంధవులతో విచారించి ధృతరాష్ట్రుపాలికిం జని యి ట్లనియె. 270
క. అహితుల నెల్ల విధంబుల | విహతులఁగాఁ జేయునది వివేక మని మరు
న్మహితుండు చెప్పె నిది మును | బృహస్పతి సురేశ్వరునకుఁ బ్రియహితబుద్ధిన్‌.
271
వ. అప్పాండవుల కెంత లగ్గు సేసియు నింక హితుల మయ్యెదమె? యాశీవిషంబుల నలిగించి కంఠ సమీపంబున విడుచునట్లు వారల విడిచిపుచ్చి కర్జంబు దప్పితిమి. 272
ఉ. భూ విదిత ప్రతాప పరిభూత విపక్షుఁడు సవ్యసాచి గాం
డీవము గొన్న భీముఁడు వడిన్‌ గదగొన్నఁ, గవల్‌ కృపాణచ
ర్మావరణాది భాసిత మహాభుజ విక్రములైన, వారలన్‌
లావె రణంబులో మన కలంఘ్యబలాఢ్యుల నింక నోర్వఁగన్‌.
273
వ. ‘కావున వారల ననుద్యూతంబునఁ బరాజితులం గావించి విరళ దేశ నిర్వాసితులం జేయుట కార్యం’ బనిన విని ధృతరాష్ట్రుం డొడంబడి, యప్పుడ యనుద్యూతార్థంబు ధర్మనందనుం దోడితేరం బ్రాతికామిం బంచినం ‘బితృనియోగంబును విధినియోగంబు నతిక్రమింప నగునే’ యని. 274
క. నృపవరుఁ డనుజులుఁ దానును | ద్రుపదతనూజయుఁ బ్రియంబుతో నరిగెను హ
స్తిపురంబునకు నశేష | స్వపక్షజన హృదయములకు సంతాపముగన్‌.
275
వ. అం దెప్పటియట్ల ధృతరాష్ట్ర నిర్మిత సభాసీనులై యున్నంత నభిమతాక్షుండైన శకుని కితవుండు ధర్మరాజున కి ట్లనియె. 276
క. ధనసంపద రాజ్యంబున | దినకరతేజుండు మిమ్ము ధృతరాష్ట్రుఁడు పెం
పునఁ బూజించెం గావునఁ | జన దింకను వాని నొడ్డి సరి క్రీడింపన్‌.
277
వ. ‘ఇది యపూర్వంబైన పణంబు; దీని నొడ్డి యోటువడిన వార లజినవల్కలంబులు గట్టి వన్యమూలఫలాశనులై బ్రహ్మచర్యంబునం బండ్రెండేండ్లు వనవాసంబు సేసి, పదుమూఁడగు నేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబు సేసి, యం దెఱుంగఁ బడిరేని వెండియుఁ బండ్రెండేండ్లు వనవాసంబు నొక్కయేఁ డజ్ఞాతవాసంబుఁ జేయుచుండు వా; రిట్లోపుదేని జూదం బాడుద’ మనిన ‘ననుద్యూతార్థం బాహూతుండనై మగుడ నగునే’ యని. 278
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )