ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరాజు శకునితో రెండవమాఱు జూదంబాడుట (సం. 2-67-21)
క. ధర్మసుతుఁ డొడ్డి శకుని క | ధర్మ స్థితి నోటు వడియె; దైవము చెయిదిన్‌
నిర్మితమయిన శుభాశుభ | కర్మ ఫలం బెట్లు దేహి గడవఁగ నేర్చున్‌.
279
వ. అంత ననుద్యూతపరాజితులయిన పాండవులు దమరాజ్యోపభోగంబులు విడిచి విప్రసుహృద్బాంధవ జనానుగమ్యమానులయి వనంబునకుం బోవ సమకట్టి భీష్మ ధృతరాష్ట్ర విదురకృప ద్రోణాచార్యుల నా మంత్రించిన విదురుం డి ట్లనియె. 280
క. వనవాసపరిక్లేశం | బున కోపదు కుంతిదేవి భోజాత్మజ గా
వున నా గృహమున నుండెడు | ననవరతము భక్తితో మదభ్యర్చితయై.
281
సీ. ధర్మజ్ఞుఁడవు నీవు పేర్మిఁ, బరాక్రమ | ధనుఁడు భీముం, డింద్రతనయుఁ డఖిల
యుద్ధ విశారదుం డిద్ధయశోనిధి, | నకులుఁ డర్థాఢ్యుండు, ప్రకట బుద్ధి
నెంతయు సంయమవంతుఁడు సహదేవుఁ, | డధ్యాత్మవిద్య నారాధ్యుఁ డెందు
ననఘుండు ధౌమ్యుండు, వినుతార్థ ధర్మంబు | లందు విచక్షణ సుందరాంగి
 
ఆ. ద్రుపదతనయ; యిట్లు విపులగుణాళి న | న్యోన్య హితుల రగుట నన్యు లుర్వి
నాదరింపఁగాక భేదింపనోపెడు | వారు గలరె మిమ్ము ధీరమతుల.
282
వ. మఱియుఁ గృష్ణద్వైపాయనుచేత శిక్షితులరు, నారదుచేత రక్షితులరు, మీకుం బురోహితుండు ధౌమ్యుండు, దైవమానుషసంపన్నులరు, బలపరాక్రమంబులంజేసి రాజులను, ధర్మచరితంబునం జేసి ఋషులను, మహత్త్వంబునంజేసి కుబేరవాసవాదులను జయించిన వారలరు, మిమ్ము భూమియు గాడ్పును జంద్రాదిత్యులు నెల్లకాలము రక్షించుచు నుండెడు; మెల్ల కార్యంబులయందును నప్రమత్తుల రయి వర్తిల్లునది; భవత్పునర్దర్శన మయ్యెడు మరుగుం’డని కఱపిన గురువృద్ధానుమతంబునం దమ తల్లి చరణంబులకు మ్రొక్కినం గొడుకుల. 283
సీ. అధికలజ్జావనతాస్యుల, నపగతా | భరణాంబరుల, ధర్మపరుల, నజిన
వల్కలధారుల, వరమునివేషులఁ | బాండుకుమారుల భానునిభులఁ
జూచి దుఃఖిత యయి సుతులార! యిట్టి దు | ర్వ్యసనోపహతులైనవారి మిమ్ముఁ
జూడక ముందఱ సురలోకమున కేఁగి | పాండుభూపతి పుణ్యభాగి యయ్యె;
 
తే. భక్తిఁ బతితోన పోవఁ దపంబు సేసె | మాద్రి; యే నేల పోవక మందభాగ్య
నయితి నని విలాపించుచు నపుడు గుంతి | యేడ్చె దుఃఖితు లగుచుండ నెల్లవారు.
284
వ. మఱియును 285
మత్తకోకిల. వీర లిట్టు లనాథులై మునివృత్తి నుండెడు వారె హా
ద్వారకాపురనాథ! కేశవ! దైత్యభేది! భవత్పదాం
భోరుహాశ్రితులైన వీరలఁ బూని కావక యుండఁగా
ధారుణీధర! నీకు ధర్మువె ధర్మనిర్మలమానసా!
286
తరలము. అమితసత్త్వులు ధర్మమూర్తు లహర్పతిప్రతిముల్‌ రిపు
ద్రుమహుతాశను లాపగేయుఁడు ద్రోణుఁడున్‌ విదురుండు గౌ
తముఁడు నుండఁగ ధర్మమార్గము దప్పఁ బాడియె? పాండవో
త్తములు రాష్ట్రనిరాసయోగ్యులె ధార్తరాష్ట్రుల వంచనన్‌?
287
క. అన్న! సహదేవ! నీవును | నన్నలతో నరిగె దయ్య యట నడవుల కీ
వున్నను సుతు లందఱు నిం | దున్నట్టుల నాకుఁ జిత్త మూఱడి యుండున్‌.
288
వ. అనుచు శోకాక్రాంత యయి కుంతీదేవి దనకు వినయవినమితోత్తమాంగ యయిన పాంచాలిం జూచి బాష్పజలంబు లురుల ని ట్లనియె. 289
క. ధవళాక్షి! నీ కతంబునఁ | బవిత్రమై ద్రుపదకులముఁ బాండుకులంబున్‌
భువనముల వెలిఁగె నీ వు | ద్భవ మౌటను జొచ్చుటను శుభస్థితితోడన్‌.
290
ఆ. ‘పురుషవృషభు లయిన పురుషులతోడన | యరిగి పరమభక్తిఁ బరిచరింపఁ
బోవఁ గనుట నీవు పుణ్యంబు సేసితి’ | వంచుఁ బ్రీతిఁ గౌఁగిలించుకొనియె.
291
వ. అని యిట్లు కోడలిం గొడుకులను దీవించి కుంతీదేవి విదురుగృహంబున నుండె; నంత. 292
ఆ. పతులపిఱుఁద మందగతి ముక్తకేశియై | పోవుదాని ద్రుపదపుత్త్రిఁ జూచి
వంతఁ గౌరవేంద్రు నంతిపురంబున | వారలెల్లఁ దలలు వాంచి రడలి.
293
ఆ. ధర్మతనయుపిఱుఁదఁ దమ్ములు నలువురు | నరుగుచుండి తత్సభాంతరమున
జనులు వినుచునుండ సంభృతక్రోధులై | పలికి రధికపరుషభాషణముల.
294
క. సాహసమున మద్బాహు గ | దాహతి దుర్యోధనాదులగు రిపుల జగ
ద్ద్రోహులఁ జంపుదు నత్యు | గ్రాహవమున హరిహరాదు లడ్డం బైనన్‌.
295
ఆ. దుష్టచిత్తుఁ డయిన కష్టు దుర్యోధను | శిరము దన్నువాఁడ ధరణిఁ గూల్చి;
హీనుఁడైన దుస్ససేనుని వధియించి | వేఁడిరక్త మానువాఁడఁ గడఁగి.
296
మ. కనకోర్వీధర సానుసార రుచిమద్గాండీవ నిర్ముక్త ప
త్త్రినిపీతారుణ వారిశేషముఁ బతత్రివ్రాతముల్‌ ద్రావున
య్యని నాతోడఁ జతుర్దశాబ్దమున మాఱైపోరు కర్ణాది దు
ర్జన సంఘంబుల మార్తురం దునుముదున్‌ సంగ్రామరంగంబునన్‌.
297
క. మాయాద్యూతంబున ని | ర్జేయులఁ గా మమ్ము నిట్లు సేసిన ఖలు న
న్యాయపరు శకుని నస్మ | త్సాయకజితహస్తుఁ జేసి చంపుదు మాజిన్‌.
298
వ. అని భీమార్జున నకుల సహదేవులును విజృంభించి కృతప్రతిజ్ఞులై; రట్లు పాండవులు పరిత్యక్తవిభవు లయి నిజాయుధంబులు ధరించి గజపురంబు వెలువడి; రంత. 299
సీ. ధృతరాష్ట్రవిభుని మందిరమున నఱచుచుఁ | బఱచె గోమాయువుల్‌ పట్టపగల;
యప్రదక్షిణముగా నయ్యె నుల్కాపాత; | మపమేఘమై యున్న యంబరమున
విద్యుత్సహస్రముల్‌ విలసిల్లె; మఱి రాహు | పర్వంబు గాకయ భానుఁ బట్టె;
భూకంప మయ్యె నప్పుడు; సభాంతరమున | నరులెల్ల వినుచుండ నారదుండు
 
ఆ. పలికె నద్భుతముగఁ ‘బదునాలుగవ యేఁడు | భారతాజి యగు; నపారవీరు
లయిన పాండవులు జయం బందుదురు భీమ | మఘవసుతుల విక్రమమున’ ననుచు.
300
వ. ధృతరాష్ట్రుండును దాని నంతయు విని ‘కొడుకుల దుర్ణయంబుల నింక నెట్టి యరిష్టంబులు పుట్టెడునో’ యని వగచుచు విదురుం బిలిచి, ‘ధౌమ్య ద్రౌపదీ సహితు లయిన పాండవు లెట్లు వోయి’ రని యడిగిన నతనికి విదురుం డి ట్లనియె. 301
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )