ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
విదురుఁడు ధృతరాష్ట్రునకుఁ బాండవు లడవికిఁ బోయిన రీతి సెప్పుట (సం. 2-71-3)
సీ. వదనసరోజంబు వస్త్రాంతమునఁ గప్పి | కొని యేఁగె ధర్మనందనుఁడు; మఱియు
భీమబాహులు రెండుఁ బెద్దలుగాఁ జాచి | ఘనసత్త్వుఁ డమ్మరుత్తనయుఁ డరిగె;
నిసుము చల్లుచు నమరేంద్రపుత్త్రుఁడు వోయె; | భూరేణులిప్తశరీరుఁ డగుచు
నకులుండు సనియె; మానక లజ్జఁ జేసి య | ధోవక్త్రుఁ డై సహదేవుఁ డరిగె;
 
ఆ. వివృతకేశభరము వ్రేలంగ ద్రౌపది | సనియె; రౌద్రయామ్య సామగాన
ముఖరితాస్యుఁ డగుచు మ్రోల ధౌమ్యుం డేఁగె | సకలజనులు శోకజలధిఁ దేల.
302
వ. అనిన ‘నట్లేల వార లరిగి?’ రని యడిగిన విదురుం డి ట్లనియె. 303
క. నీకొడుకునికృతిఁ జేసి య | పాకృత రాజ్యుఁ డయి ధర్మపతి నిజరూక్షా
లోకనజనదాహభయ | వ్యాకులుఁ డై చనియె దృష్టి వారించి వడిన్‌.
304
క. సమరమున బాహుబల ద | ర్పము మెఱయం గంటి ననుచు బాహు లతివిశా
లములుగఁ జేయుచు నరిగెను | సమీరజుఁ డరాతిభీతిసంజననుం డై.
305
క. వెఱచఱవ నింతకంటెం | దఱుచుగ బాణంబు లేసి తడయక పగఱం
జెఱుతు నని యిసుము చల్లుచు | నుఱక ధనంజయుఁడు రణజయోన్నతుఁ డరిగెన్‌.
306
వ. మఱి దుఃఖాను భావంబున కనుచితంబైన తన సుందర రూపంబు సూచి జనులు దుఃఖింప కుండ వలయు నని ధూళి ధూసరిత శరీరుండై నకులుం డరిగె; దీనంబైన తన యాననంబు సూచినవారికి నెల్ల నెగ్గగు నని యవనతవదనుం డయి సహదేవుం డరిగె. 307
చ. తడిసిన యేకవస్త్రపరిధానముతోడ విముక్తకేశియై
తొడరుచు దుఃఖభావమున ద్రోవది వోయె మహాహవంబునం
బడిన నిజేశ మిత్ర సుత బంధు జనంబులు శోకవేదనం
గడుకొని యట్ల యేఁగుదురు కౌరవభామిను లన్విధంబునన్‌.
308
క. భారతరణహతు లగు కురు | శూరుల పరలోకవిధులు సూచించి క్రియా
పారగుఁడు ధౌమ్యుఁ డరిగె వి | చారజ్ఞుఁడు రౌద్రయామ్యసామోద్గీతిన్‌.
309
వ. అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుం డయి. 310
తరలము. సమరశూరులు పాండవుల్‌ జితశత్రు లున్నతచిత్తు లు
త్తములు వారలతోడి వైరము ధర్మయుక్తిఁ గరం బయు
క్తము ప్రజాక్షయకారణం బని తద్దయున్‌ భయమందుచున్‌
విమనుఁడై పడియుండె హా యని వెచ్చనూర్చుచు విన్న నై.
311
వ. అట్లు వగుచుచున్న ధృతరాష్ట్రునకు సంజయుం డి ట్లనియె. 312
సీ. పాండుకుమారులఁ బరమధార్మికు లని | వగవక రాష్ట్రంబువలనఁ బాపి
వసుపూర్ణమైన యివ్వసుమతి సేకొంటి | వసుధేశ! నీ కింక వగవ నేల?
కలశజ విదుర గంగాసుత ప్రభృతులు | వారింప వారింప వశము గాక
కర్ణ గాంధారుల కఱపులు విని, వారి | కపకారి యయ్యె నీ యాత్మజుండు;
 
ఆ. వగవ కధికు లయిన వారితో వైరంబు | సేసికొంటి కరము చెట్ట యనక;
నీవు నీ సుతుండు నేర్తురు గా, కొరు | లేమి సేయనేర్తు రిందుకులుఁడ!
313
వ. అని సంజయుండు పలికిన విని విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. 314
తరలము. వగవ నేటికి నింకనైనను వారలం బిలిపించి యీ
జగతి నెప్పటియట్ల యేలుచు సంతసంబున నుండఁగా
జగదధీశ్వర! పంపు; వంచన చన్నె? యన్యుల సంపదల్‌
మిగిలి చేకొన నిట్లు సేసిన మెత్తురే మది నుత్తముల్‌?
315
ఆ. అనిన విదురుపలుకు లా ధృతరాష్ట్రుండు | వినియు విననియట్లు విపినవాస
గతులఁ బాండుసుతులఁ గ్రమ్మఱింపక యుపే | క్షించెఁ బూర్వవిహిత కిల్బిషమున.
316
వ. మఱియు ద్రోణుండు పాండవులకు నెయ్యుం డయ్యును దొల్లి యాజోపయాజుల వరంబున నగ్ని కుండంబున నుద్భవిల్లిన ద్రుపదాత్మజుండు ధృష్టద్యుమ్నుండు పాండవసంబంధి యయి ప్రతివీరుం డగుట నాతనితోఁ దనకు సమరం బగు నని యెఱింగి పాండవానుగమనంబు సేయ నొల్లక గజపురంబున ధృతరాష్ట్రు నొద్దన యుండె; ని ట్లింద్రప్రస్థపురంబున నిరువది మూఁడేఁడులు రాజ్యంబు సేసి పాండవులు పాపద్యూత పరాజితు లయి. 317
క. వీరులగు పాండు సుతులు మ | హారణ్యనివాస నిరతులయి ధరణీబృం
దారక సహస్రములతో | సారమతుల్‌ సనిరి నిత్యసత్యవ్రతులై.
318
క. అని యిట్లు సభాపర్వం | బున కథ జనమేజయునకు మొగి వైశంపా
యను చెప్పిన విధమంతయు | మనునిభ! శుభచరిత! నిత్యమహిమాతిశయా!
319
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )