ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
రావణునికిఁ బ్రహస్తుని శాంత వచనములు
క. నీ కేల యింత కోపము
నీకు హితముఁ జెప్పుచున్న నీతమ్ముని నీ
వే కత్తివ్రేసి చంపిన
లోకులు నిను మెత్తురయ్య లోకస్తుత్యా.
26
తే. గుణయుతుండైన మనవిభీషణుఁడు లేని
లంక యేటికి సైన్యంబు లింక నేల
వైభవం బేల యామీఁదఁ బ్రాణ మేల
శాంత మవధారు దేవ నీ స్వాంతమందు.
27
వ. అని ప్రహస్తుండు రావణుకోపంబును గొంత శాంతపఱిచె నప్పుడన్న
కోపంబునకుఁ దమ్ముండు కుంభకర్ణుండు వడవడ వడఁకి యన్న కెదురాడ నోపక
తమ్మునిఁ గాదనలేక గద్దియమీఁదఁ గూర్చుండియున్న యన్నకు మ్రొక్కి నిదుర
గృహంబునకుం జనియె నట రావణుండు విభీషణుం జూచి యోరీ నీవు విశ్వాస
ఘాతకుండవు స్వామిద్రోహివి గావున నీవు నా కొక్క పేదనరునిఁ బెద్దజేసి చెప్పెద
వాతఁడె పౌరుషశాలియేని నీవాతనింజేరి సుఖంబున బ్రతుకు మనిన నతండిట్లనియె.
28
సీ. విను రాక్షసేశ్వర! విష్ణుసన్నిభుఁడు రా-ముండు హా! పేదనరుండె నీకు
నతనిసత్యస్థితి యతనిపరాక్రమం-బిపుడు నీ కెఱుంగంగ నెట్టు లగును
అవనీశుబాణంబు లతిరయంబున వచ్చి-దండించునప్పుడైనఁ దలఁచు నన్నుఁ
బర్వత శిఖరముల్‌ పడినట్టు నీతల-లిలఁ గూలునపుడైనఁ దలఁచు నన్ను
 
తే. నీకు దమ్ముండ నౌటనే నీవు బ్రతుకు-కొఱకుఁ జెప్పిన నీ కింతకోప మేల
వినుము నామాట సీత నర్పించి యతని-శరణు వేడుము వలదు నీసాహసమ్ము.
29
వ. అని చెప్పిన హితవచనంబులకు మఱింత కోపోద్దీపితమానసుండై
యాజ్యాహుతిం బ్రజ్వరిల్లిన హుతాశను గతిన్మండిపడి పెళపెళనార్చి గద్దియమీఁదం
గూర్చున్న విభీషణుని వక్షంబు పగులం దన్నిన నతండు తనకన్నులనుండి
తొరఁగు జలకణంబులు హస్తంబులం దుడిచికొనుచు నాక్షణంబున మంత్రులుం దానును
దనతల్లియైన కైకసి యొద్దకుం జని సాష్టాంగదండ ప్రణామంబాచరించి
యన్నచేసిన దుర్ణయం బెఱంగించి శరణాగతవత్సలుండైన శ్రీరామచంద్రుని
సన్నిధానంబునకుఁ బోవుచున్నాఁడ నని చెప్పి యాయమ్మయనుమతంబు వడసి దీవనలు గైకొని
చని సముద్రతీరంబున విచారగ్రస్తుండై యున్న శ్రీరామచంద్రునింగని విభీషణుండు.
30
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )