ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
విభీషణుఁడు రామునికి రావణుని బల సంపదను దెలుపుట
క. రావణుబలసత్త్వస్థితి
యావీరుని శౌర్యమహిమ యభినుతి సేయన్‌
నావశముగా దతం డల
దేవేంద్రుని వెట్టిఁ గొనును దినము నరేంద్రా.
33
క. ఒక్కొక్కగవని వాఁకిట
నొక్కొక్కయేనూరుకోటు లుందురు దైత్యుల్‌
పెక్కురఁ గావలి యుంచును
దక్కక మఱి యెల్లకడలఁ దానును దిరుగున్‌.
34
వ. తన కుమారవర్గంబు లక్షయుం బదివేలు వారల కొక్కొక్కరికి
లక్షమంది బంట్ల నేర్పఱచి యుంచిన వారు లంకవీథులలోఁ గొందఱును
నగరుచుట్టును గొందఱును మఱికొన్నిచోట్ల మఱికొందఱును గుంపుగూడి
తిరుగుచుందురు. అయినను బ్రహ్మాదుల కైనను సాధింప వలనుపడని లంకా
పట్టణము మీచేత సాధింపఁబడఁగలదు. కావున మీరు వేవేగ సముద్రునిం బ్రార్ధించి
సముద్రబంధనంబు సేయవలయు ననిన నంత మహేంద్రపర్వతంబు డిగ్గి సముద్ర
ప్రాంతంబున విడిసి జాంబవదంగదసుషేణనీలమైందాదివనచరవీరులచేత నలు
దిక్కులయందు గలపర్వతంబులను వృక్షంబులను బాషాణంబులను దెప్పించి
కడలి కట్టం గడంగిన.
35
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )