ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
పర్వతములు రువ్వి వారిధిపై వారధి తీరుప వానర వీరుల సముత్సాహము
శా. కూపారుండును సంతసిల్లి జలజాక్షుం జూచి మిన్నంది స
ల్లాపం బుద్ధతిఁ బొంగఁ జూచి విరసోల్లాసంబునన్‌ రాఘవ
క్ష్మాపాలుండును గోపముం గదుర నీగర్వంబు నాచేత వ
మ్మైపోనిప్పుడటంచు లక్ష్మణుఁడు విల్లందియ్యఁ బెన్వీఁకతోన్‌.
36
మ. పరుషోద్యత్కుటిలాకృతిన్‌ బొమలుచూపట్టంగ శోణప్రభో
త్కరరేఖ ల్గనుఁ గొల్కుల న్నిగుడఁ గోదండంబు చేఁదాల్చి భూ
వర వంశాగ్రణి రాముఁ డద్భుతముగా వారాశిమీఁదన్‌ వడిన్‌
శరజాలంబులు పేర్చి వ్రేయుటయు నిచ్చన్‌ బ్రాణభీతిన్‌ వడిన్‌.
37
క. రాముని యెదుట సముద్రుఁడు
తా మానవురూపుఁదాల్చి దైన్యము దోఁపన్‌
రామునకు మ్రొక్కి యపుడా
ధీమంతున కనియె నిలిచి తేజం బెసఁగన్‌.
38
ఆ. ఇంక నేల తడయ నినకులాధీశ్వర!
కపులఁ బంపి వేగఁ గట్టు మయ్య
కట్టఁ గట్టి దాటు కమలాప్తకులచంద్ర!
నీదు కీర్తిలతకు నెలవు గాఁగ.
39
వ. మిమ్మును దరిసించుటకు మిన్నంటఁ బొంగితి నింతియకాని కపటోపాయంబునఁ
బొంగిన వాఁడను గాననిన రామభద్రుండు కరుణాసముద్రుండు గావున
సముద్రు నెప్పటి యట్ల యుండ నియమించి వానరులం బనిచిన.
40
క. రాముని పంపునఁ బ్లవగ
స్తోమం బట్లరిగియరిగి దొడ్డగుకొండల్‌
క్షేమమునఁ దెచ్చి జలనిధి
రామాజ్ఞను వైచి రధిక రభసం బొప్పన్‌.
41
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )