ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
అతికాయ కుంభకర్ణుల సంహరణము
వ. ఇట్లు పెద్దయుం బ్రొద్దు వీరావేశంబునఁ బోరుచుండఁ గుంభకర్ణుండు
విజృంభించి బలంబుల కుఱికిదిగ్గజకర్ణపుటస్ఫాటితంబుగా నార్చుచు వానరవీరుల
నసంఖ్యంబుగా మ్రింగుటకుంగడంగిన రఘువీరుం డలిగి బ్రహ్మాస్త్రంబు ప్రయోగించి
వాని శిరంబును దునిమాడె నంత నతికాయుండు తన పినతండ్రి పాటున కలిగి
రాఘవేంద్రునికభిముఖంబుగా నిలిచి దివ్యాస్త్రంబులు ప్రయోగించుచుండ
లక్ష్మణుం డడ్డుసొచ్చి నానాస్త్రంబులు ప్రయోగించి ఘోరంబుగా యుద్ధంబుసేసి
కడపట వారుణాస్త్రంబు వింత సంధించి విడిచిన నది యతికాయుని శిరంబుం
ద్రుంచె నంత హతశేషులైన రాక్షసులు కాందిశీకులయి రావణుంజేరి.
51
తే. దేవ! దేవాంతకుఁడు సచ్చె దీనవృత్తిఁ
గుంభకర్ణుండు సమసెను ఘోరలీలఁ
దెగువ నతికాయుఁడును మ్రగ్గె దీని కింకఁ
బూని ప్రతికార మొనరింపు భూరితేజ.
52
వ. అని విన్నవించిన మండిపడి రావణుం డింద్రజిత్తుం బంపిన నతండాగ్రహంబున. 53
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )