ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
కుంభ నికుంభాది రాక్షసవీరుల నిహతి
వ. అంత నింద్రజిత్తు పరాక్రమంబునకు సంతోషించి నిజంబును గల్లయును దెలియుటకు రావణుం
డనుపఁ జారులేతెంచి యుత్సాహంబుతో యుద్ధ సన్నద్ధులై కెరలుచున్న వానర బలంబులం
గనుంగొని మరలి చనుదెంచి రామచంద్రుని బలంబున్న తెఱం గెఱింగించిరి. అది విని కలంగియుఁ
గలంగనిన భంగి నాశ్చర్యంబు నొంది రామలక్ష్మణులపైకిఁ గుంభనికుంభ గవాక్ష ప్రజంఘ
శోణితాక్షులం బంపిన వారును దమతమ బలంబులతోడఁ గరితురగరథారూఢులై వెడలి
సింహనాదంబులు సేయుచు నావానర సైన్యంబుపైఁ గవిసి శరవర్షంబులు గురియుచుఁ
బరిఘలం జక్కుసేయుచు నడిదంబుల వ్రేయుచు ముద్గరంబులం జెండుచు ముసలంబుల మోఁదుచుఁ
గరులచే మట్టింపుచుఁ దురంగమములచేఁ ద్రొక్కింపుచు రథంబులం దోలి వెంపరలాడుచు
మహాహవంబు సేయుసమయంబునఁ గపిబలంబు లడరి గిరివర్గంబులుఁ దరువర్గంబులును
ననర్గళంబుగఁ గైకొని ప్రతిఘటించి పోరాడునప్పుడు.
67
క. తెంపున వాలికుమారుఁ డ
కంపనుఁ డను వాఁ డెదుర్పఁ గని కోపమునం
గంపింపఁ బట్టి వానిని
జంపెను వక్షంబు పొడిచి సాహసవృత్తిన్‌.
68
వ. అప్పుడు. 69
చ. కనుఁగొని శోణితాక్షుఁడు నకంపను ప్రాణముఁగొన్న వాలినం
దనునిపయిం గడుం గినిసి తార్కొనితాఁకి రథంబుఁ దోలినం
గనలుచు నంగదుండు తురగంబులతోన రథంబు నుగ్గుగా
దనుజుని మీఁదఁ దానుఱికి తన్నినవాఁడునుగూలె నేలపైన్‌.
70
ఆ. అతఁడు నేలఁ గూల నా ప్రజంఘుండును
ఘనుఁడు యూపనేత్రుఁ డెనసి వాలి
కొడుకుమీఁద రాఁగఁ గోపించి మైందుండు
ద్వివిదుఁ డంతలోనె తెంపు మిగిలి.
71
క. దనుజులఁ దోలఁ బ్రజంఘుఁడు
గనుఁగొని యవ్వాలిసుతునికటములు పొడువన్‌
గనలి నిశాచరుశిరమును
ఘనతర దృఢముష్టిఁ బొడిచి కడపెన్‌ ధరకున్‌.
72
సీ. ఘనుఁడు ప్రజంఘుండు కదనంబులోఁ బడ్డ-నక్షయబలుఁడు యూపాక్షుఁ డంత
గదఁగొని వ్రేసిన ఘనతతోఁ గుప్పించి-భుజశక్తి నాతనిఁ బొదివి పట్టి
కొనిపోవునప్పుడు కోపించి యన్నకై-శోణితాక్షుఁడు వచ్చి శూరుఁ డగుచు
విడిపించుకొనఁ జూడ వడిగ మైందుఁడు డాసి-కలన యూపాక్షుని గదిసి పోరి
 
తే. సాహసంబున నొఱలంగఁ జంపుటయును-శోణితాక్షుండు ద్వివిదునిఁ జూచి పొడువ
నతఁడు మూర్ఛిల్లి తెప్పిరి యసురఁ బట్టి-శిరము కూలంగ నడిదంబుచేత వ్రేసె.
73
తే. శోణితాక్షుండు పోరిలోఁ జూర్ణమయినఁ
గుంభుఁ డప్పుడు కోపించుకొనుచు వచ్ఛి
ద్వివిదు నెదుఱొమ్ము నాటఁగఁ దీవ్రశరము
లేసి వడిఁ జంపె నాజిలో నేమి చెప్ప.
74
క. తమ్ముని పాటు గనుంగొని
హుమ్మన మందుండు కుంభు నురతర ముష్టిన్‌
ఱొమ్మున బొడిచిన నతఁ డొ
క్కమ్మున గూలంగ నేసె నమరులు దలఁకన్‌.
75
ఉ. అంగదుఁ డంతఁ గుంభుని శతాంగముపై నొకపర్వతంబు భూ
మిం గలయంగ వ్రేయుటయు మేదినికిన్‌ వడి దాఁటి వాలిపు
త్త్రుం గని దైత్యుఁ డాగ్రహముతో ముసలంబున వ్రేయనొచ్చి తోఁ
కంగొని వజ్రిపౌత్త్రుఁడు సగర్వమునన్‌ దగమోదెనార్చుచున్‌.
76
క. కాలాంతకరుద్రులతోఁ
బోలుపఁ గదుకుంభుఁడపుడు భుజబల శక్తిన్‌
వాలికుమారుని ధరపైఁ
గూలఁగ వడి నేసె నైదుకోలలచేతన్‌.
77
వ. ఇట్లు వాలి కుమారుండు కుంభునిచేత బాణపీడితుండై పడుట యెఱింగి
రామచంద్రుఁడు వానిపై సుగ్రీవజాంబవద్ధనుమదాదులం బంపిన.
78
క. వారంద ఱధిపునాజ్ఞను
భూరుహుములు గిరులుఁ గొనుచు భువనము లదరన్‌
బోరున నార్చుచుఁ గుంభునిఁ
దారసమై వ్రేసిరంత దర్పోద్ధతులై.
79
క. వారలు వ్రేసినతరుగిరు
లారయఁ దనుఁ దాఁకకుండ నవి తునియలుగాఁ
గ్రూరాస్త్రంబులఁ దునుముచు
నారసములఁ వారివారి నాటఁగ నేసెన్‌.
80
క. ఏసినఁ గుంభుని రవిజుం
డాసమయమునందు నేసె నద రంటంగా
నేసినఁ గ్రమ్మఱ రవిజుని
గాసిల వక్షంబు పొడువఁగా నిలఁ బడియెన్‌.
81
తే. మూర్ఛతేఱి యారవిజుఁ డమోఘముష్టి
పూని దౌత్యునిఱొమ్ము పైఁ బొడువ నంత
శరధిమథియించు మందరాచలముమాడ్కి
ధీరత యడంగి దిర్దిరఁ దిరిగి పడియె.
82
ఉ. కుంభుఁడు గూలినంగని నికుంభుఁడు దాఁ బరిఘాయుధంబు సం
రంభ మెలర్పఁ ద్రిప్పి దినరాజతనూజుఁనిపైకి రాఁగ బల్‌
సంభ్రమమొప్ప వాయుజుఁడు శౌర్యము గన్పడ నడ్డమైన ది
క్కుంభిగముల్‌ కలంగఁగను గొబ్బున వక్షమువైచె నార్చుచున్‌.
83
క. వ్రేసిన పరిఘాయుధ మది
వీసము నాటంగలేక విఱిగిన మిగులన్‌
గాసిలి దైత్యుఁడు పవనజు
నాసమయమునందు నేసె నడిదము చేతన్‌.
84
తే. అంత హనుమంతుఁడుగ్రుఁడై యసురగళము
నందు వాలంబు దగిలించి యాకసమునఁ
ద్రిప్పి ధరణీతలంబునఁ ద్రెళ్ళఁ గొట్టి
సింహనాదంబుఁ జేసె నచ్చెరువు గాఁగ.
85
వ. అట్టి సమయంబున. 86
క. హతశేషులు ఘటకర్ణుని
సుతు లాహవభూమిఁ దెగినసుద్దులు లంకా
పతి కెఱిఁగించిన దుఃఖో
న్నతుఁడై యొక్కింతతడవునకు నిట్లనియెన్‌.
87
తే. మనకుఁ గలయట్టి బాంధవగణము సుతులు
దొరలుఁ బరివారమును గంధకరులు హరులు
గుటిలకపియూధములబారి గొఱియ లగుచుఁ
దెగిరి మునుముట్ట నేటితోఁ దీవ్రగతిని.
88
వ. అని చింతింపుచుఁ గొంతవడికి ధైర్యంబుంగొని. 89
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )