ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
శ్రీరాముఁడు మకరాక్షుని రూపు మాపుట
క. దైతేయవల్లభుఁడు గడు
ప్రీతిన్‌ మకరాక్షుఁ జూచి పృథుతరశక్తిన్‌
మీ తండ్రి ఖరునిన్‌ఁ జంపిన
యాతనిపై సూడు వీఁగు మరుగుమటన్నన్‌.
90
సీ. సింధురరథభటసైంధవంబులతోడఁ-దఱచైన పట్టు ఛత్రములతోడఁ
బటహభేరీముఖ్యబహువాద్యములతోడ-దట్టంపునానాయుధములతోడ
వందిమాగధసూతబృందస్తుతులతోడఁ-గెరలాడుబిరుదుటెక్కెములతోడ
బహుళకాహళశంఖభాంకారములతోడ-రాజిల్లునవచామరములతోడ
 
తే. నడిచె దిగ్దంతి భూదారనాగకూర్మ-కులనగేంద్రయుతముగ భూతలము గదలఁ
బదరజఃపాళి సంఛన్నభానుఁడగుచు-దక్షుఁడై నట్టిమకరాక్షుఁ డాక్షణంబ.
91
వ. ఇట్లు భయంకరంబుగాఁ గదలి వానరవీరులతోడం దలపడి పోరాడునెడ
వానరబలంబులు తలచెడి పాఱుటగని రాజపుంగవుండోహో వెఱవకుఁ డని
తనమఱువునకున్‌ మరలించి మకరాక్షుందేఱి చూచి చండకాండముల తండంబులు
ఖండించి హరుల శరంబులపాలుచేసి రథంబులను సారథులతోడం గూడఁ
బృథ్విం గలిపి బలంబులఁ జలంబునం దఱిమి సింహనాదంబు చేసినం గినిసి
మకరాక్షుం డిట్లనియె.
92
క. మా తండ్రి ఖరునిఁ జంపిన
నీతో యుద్ధంబు సేయ నేఁడిదె కలిగెన్‌
నా తీవ్ర నిశిత సాయక
పాతంబుల పాలొనర్తుఁ బగ దీఱ నినున్‌.
93
మ. అని గర్వోక్తులు పల్కుచుం గెరలి తీవ్రాస్త్రంబులారాముపైఁ
దనబాహాబలశక్తి నేయఁ గని కోదండంబునం దప్పుచున్‌
వనజాప్తాన్వయుఁ డేసె వాని నటగీర్వాణుల్‌ ప్రశంసింపఁగా
దనుజుం డేసెను రామభూవిభునిపైఁ దద్బాణజాలంబులన్‌.
94
క. ఆశరము లుడిపి మఱియొక
యాశుగమున వానిచాప మపుడు దునిమి యా
దాశరథి రథము పొడిగాఁ
గౌశలమున నేయ వాఁడు క్ష్మాస్థలి కుఱికెన్‌.
95
ఆ. ధరకు నుఱికి దుష్టదైత్యుడు గదఁ ద్రిప్పి
భానుకులుని నేయ దానినొక్క
విశిఖముననె తునిమి వేగంబె విభుఁ డగ్ని
శరముఁ దొడిగి వానిశిరము ద్రుంచె.
96
క. ఆయెడ మకరాక్షుఁడు రిపు
సాయకములు దూఱ నాటి చచ్చుట విని దై
తేయుఁడు గుండెలు వగులఁగఁ
బాయని దుఃఖము పాలుపడి చింతిల్లెన్‌.
97
వ. ఇట్లు చింతాక్రాంతుండై కొంతతడ వూరకుండి మేఘనాదునిఁ గనుంగొనియె. 98
క. అక్కట! నీవును నేనును
దక్కఁగ మఱి తక్కినట్టిదళములు దెగఁగా
నొక్క కపి యైన గానీ
యక్కడ రిపులందు నొచ్చిరనఁగా వింటే.
99
వ. అదియునుంగాక. 100
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )