ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
ఇంద్రజిత్తు మాయా సమరము
వ. అని దీనాలాపంబు లాడుచున్న తండ్రికి నకస్కరించి మేఘనాదుండు మేఘగంభీర వాక్యంబుల
దుఃఖోపశమనంబు చేసి నేఁటితోడఁ బగ సాధింతునని ప్రాగల్భ్యంబుగఁ బలికి యనిపించుకొని
గజవాజిశతాంగాదు లగు చతురంగబలంబులు గూర్చుకొని ఛత్రచామరంబులు పిక్కటిల్ల నట్టహాసంబు
సేయుచు లంకాపురంబు వెడలి సంగ్రామరంగంబునకుం జని తనబలంబులఁ జక్రాకారంబుగా నిలిపి
తన్మధ్యంబున రథావతరణంబుచేసి రక్తాంబరగంధమాల్యంబులు ధరియించి లోహపాత్రంబునఁ
గృష్ణసర్పరక్తంబు నించి తర్పణంబు చేయుచుఁ దద్విధియుక్తంబైన హోమంబులు సేయుచుండు నెడ
నొకకృత్తి ప్రత్యక్షంబై నిలిచి మెచ్చితి వరం బిచ్చెద వేఁడు మనిన నతండు తా నాకసంబున
నుండి భండనంబు సేయునెడఁ గపులకుం గానరాకుండ నంధకారంబు గావించిన నేను వారిని
జయింతునని ప్రార్థించిన నియ్యకొనియె నంత మేఘనాదుండు నభంబున కెగసి మహాంధకార
బాణంబు వ్రేసిన దానంజేసి పెంజీకటిం గప్పినఁ జీకాకై పాఱుచున్న వానరులంగని
వాయునందనుండు శ్రీరామచంద్రునితో నిట్లనియె.
102
క. వాయవ్యాస్త్రము చేతను
బాయును జు మ్మంధకారబాణ విశేషం
బీయెడ నేయుఁడు శ్రీరఘు
నాయక! యని విన్నవింప నవ్వుచు నంతన్‌.
103
క. విల్లెక్కు వెట్టి మారుత
భల్లము సంధించి తివిచి పార్థిపుఁ డలుకన్‌
బెల్లార్చి యేసె గగనం
బెల్లను వడిఁ దూల దైత్యుఁ డిలపైఁ గూలన్‌.
104
ఆ. రాజతిలకుఁ డంబరమ్మున కెగయంగ
వాయుశరముఁ దొడిగి వ్రేయఁ దడవె
మాయశక్తి దొలఁగి పోయిన నంతలో
మేఘనాదుఁ డుర్విమీఁదఁ బడియె.
105
చ. పడియును మేఘనాదుఁడు సుపర్వులు బెగ్గిల నుగ్రబాణముల్‌
తొడిగి ప్లవంగ సేనపయిఁ దోరముగా నడరింప నంతటన్‌
బెడబెడనార్చి మారుతివిభీషణు లుగ్రత దానవావళిన్‌
బొడిపొడి సేయలక్ష్మణుఁడు పూనికనాతనిఁ దాఁకె నార్చుచున్‌.
106
క. అంతట దానవసేనలు
పంతము చెడి తలలు వీఁడ బాఱం గని తా
నెంతయు వెఱవకుఁ డనుచును
గుంతము ద్రిప్పుచును దైత్యకుంజరుఁ డంతన్‌.
107
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )