ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
లక్ష్మణునిచే నింద్రజిత్తు సంహారము
శా. సౌమిత్రిం గని గర్వమొప్పఁ బలికెన్‌ శౌర్యంబు సంధిల్లఁగా
నామీఁదం బఱపింపవచ్చితివె నా నాగాస్త్రసంఘంబులన్‌
నేమిమ్మందఱఁ గట్టుటల్‌ మఱచితే నేఁడైనఁ జింతింపుమీ
నీ మాసత్త్వవిశేషమెల్ల మదిలో నిక్కంబుగా లక్ష్మణా.
108
వ. అని బాణ ప్రయోగంబు సేసిన. 109
క. వానిని బ్రతిశరములు దాఁ
బూనిక సంధించి త్రుంచి భుజబలశక్తిన్‌
దానవుని మూర్ఛపుచ్చెను
భానుకులుం డంత నొక్కబాణముచేతన్‌.
110
ఆ. ఇంద్రజిత్తుఁ డప్పు డినకులోద్భవునిచే
మూర్ఛనొంది తెలిసి మూర్ఖుగతిని
భాసమాన మైన బాణత్రయంబున
నతని నొవ్వనేసి యార్చెనంత.
111
సీ. సౌమిత్రి తా వానిచాపంబు నడిమికి-ఘనతరాస్త్రంబుచేఁ దునుఁగ నేసి
పదిబాణములు వానిబాహుమధ్యంబునఁ-గాటంబుగా వడి నాట నేసి
తురగంబులను నాల్గు తూపులఁ దునుమాడి-సారథి నొక్కట సంహరించి
శరవృష్టిఁ గప్పిన సురవైరి కోపించి-కాద్రవేయాస్త్రసంఘంబు లేయ
 
తే. గరుడశరమునఁ దునిమి లక్ష్మణుఁడు కినిసి-వడిఁ గుబేరాస్త్ర మతనిపై వైచె నసుర
దానిఁ దునిమాడి వేగ నైంద్రాస్త్ర మేసె-నరవరుఁడు దాని యామ్యబాణమునఁ ద్రుంచె.
112
వ. ఇట్లు త్రుంచిన. 113
క. వరుణాస్త్రంబును నేసెను
సురరాజవిరోధి రాజసూనుని మీఁదన్‌
గర మలిగి రాముసోదరుఁ
డరుదారఁగ దాని ద్రుంచెనైంద్రాస్త్రమునన్‌.
114
వ. మఱియును. 115
తే. కనలి దానవుఁ డతనిపై గంధపుష్ప
సమితి నొప్పెడు గంధర్వశరముఁ దొడిగి
వ్రేయఁ గోపించి దశరథోర్వీపసుతుఁడు
ఖండశశిబాణమున దాని గండడంచె.
116
వ. ఇట్లు గంధర్వ శరంబును ద్రుంచి యంతటం బోవక దేవేంద్రదత్తంబైన భుజగాస్త్రంబు
వింట సంధించి వేదంబులు నిత్యంబగునేని రామచంద్రుండు ధర్మాత్ముండేని యింద్రాదిబృందారక
ద్రోహి యైన యింద్రజిత్తునిశిరంబు నీ శరంబు ద్రుంచుంగాక యని వానిపై లక్ష్యంబు చేసి ప్రత్యాలీఢ
పాదస్థుండై నిలిచి కర్ణాంతంబుగాఁ దిగిచి యేసిన నదియును గాలానలాభీల జ్వాలాజాలంబు
లుప్పతిల్ల గగనంబునం బఱతెంచి యక్కఱకు రక్కసుని శిరంబుఁ ద్రుంచిన.
117
క. కనుఁగొని దేవత లందఱుఁ
దనుఁ బొగడఁగ మరలి రాముతమ్ముఁడు విజయం
బునఁ వచ్చి మ్రొక్క నాతని
మనుజేంద్రుఁడు కౌఁగిలించి మఱి యిట్లనియెన్‌.
118
క. నీచేత వీఁడు త్రుంగుట
భూచక్రంబెల్ల మేలు పొందెను వినుమీ
నా చేత దశముఖుండును
నీచుఁడు తెగుఁటెల్ల నిజము నిర్మలచరితా.
119
వ. ఇట్లు సౌమిత్రి చేత నింద్రజిత్తు తెగెనని చెప్పిన నారదుని వాల్మీకి మహామునీంద్రుం డటమీఁది
కథావిధానం బెట్టి దనియడుగుటయు.
120
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )