ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
క. అమలిన శుభచారిత్రా
కమలదళ సమాననేత్ర! కౌశికమిత్రా!
ద్యుమణికులవార్ధిసోమా!
సమదాసురజనవిరామ! జానకిరామా!
1
వ. శ్రీనారదమహామునీశ్వరుండు వాల్మీకి కెఱింగించిన తెఱంగెఱింగించెద నాకర్ణింపు మట్లు. 2
ఆహవ రంగమునకు రావణాగమనము
ఆ. చారులరుగుదెంచి సౌమిత్రిచే నింద్ర
జిత్తుఁ డీల్గె ననుచుఁ జెప్పుటయును
బంక్తి ముఖుఁడు సుతునిఁ బలుమాఱు దలఁచుచు
వగవఁ జొచ్చె నెల్లవారు వినఁగ.
3
వ. ఇట్లనేక ప్రకారంబులఁ గుమారుం బలవరింపుచు దుఃఖింపుచుఁ
గొంతతడవున కూఱడిల్లి ధైర్యంబు నూలుకొల్చి తనకుమారుం జంపినవానిని నేఁ
డవశ్యంబును సంగ్రామ రంగంబునఁ జంపుదు నని నియమంబు చేసి తత్క్షణంబ.
4
సీ. శైలసన్నిభములౌ సామజంబులతోడ-ననిలవేగము గల్గు హరుల తోడఁ
గాంచనోజ్జ్వలములౌ ఘనరథంబులతోడఁ-బ్రతి లేని ఘనమూల బలముతోడఁ
గిమ్మీరవర్ణోరు కేతనంబులతోడఁ-దఱచైన పట్టు ఛత్రములతోడ
భేరీ మృదంగాది పృథువాద్యములతోడ-వరశంఖకాహళ ధ్వనులతోడఁ
 
తే. బాదఘట్టన చలితోర్విభాగుఁ డగుచు-వనధు లెల్లను బిండలివండు గాఁగ
నడిచె లంకేశుఁడధిక సన్నాహమునను-రామచంద్రునితోడను రణ మొనర్ప.
5
మ. కరిఘీంకారములున్‌ మహాజవతురంగవ్రాతహేషావళుల్‌
వరకోదండనినాదముల్‌ సుభటదుర్వారాట్టహాసంబులున్‌
గురుశంఖోజ్జ్వలనాదముల్‌ దశదిశాక్రోశంబుగా నొక్కటై
పరగన్బంక్తి ముఖుండు దా నడిచెఁ గోపస్ఫూర్తి నిశ్శ్వాసుఁడై.
6
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )