ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
రామ రావణుల భీకర సంగ్రామము
క. తన కట్టెదురను గూలిన
దనుజులఁ బెక్కండ్రఁ జూచి దశకంఠుఁడు దాఁ
గనలుచు సూతున కనియెను
జననాయకుమీఁద రథముఁ జన నిమ్మనుచున్‌.
19
ఆ. అధిపుఁ డానతిచ్చినట్టుగా సూతుండు
రామచంద్రుమీఁద రథము వఱపె
నపుడు శంఖకాహళాదిరవంబులు
వందిజనులనుతులు సందడింప.
20
వ. ఇట్లు శతాంగతురంగ హేషారవంబులును బహుళకింకిణీ ఘంటికా
నినదంబులును రణనేమిస్వనంబులును దనుజభటాట్టహాసంబులును బోరుకలంగ
సంగరరంగంబున కరుగుదెంచు నక్తంచరేశ్వరుండు ధనుర్ధరుండై ప్రతిఘటించు సమయంబున.
21
క. తన కెదిరించిన రామునిఁ
గని దనుజవిభుండు కినుక గదురఁగ నటఁ జ
య్యన నాగాస్త్రములను దన
ధనువునఁ గీలించి యేసెఁ దనభుజశక్తిన్‌.
22
క. అవి లెక్కఁ గొనక పొరిఁబొరి
నవనీనాయకుఁడు గినుక నసురాధిపుపై
దివిజారు లులికి పాఱఁగఁ
బవిసన్నిభ మైన తీవ్రబాణము లేసెన్‌.
23
సీ. లంకేశుఁ డవి యెల్ల లక్ష్యంబు సేయక-తిమిరాంబకములు సంధించి
నిబిడమై చీఁకటి నిండంగఁ బర్వినఁ-గపు లెల్ల నంధులై కళవళింప
నుర్వీశ్వరుం డంప నుగ్రబాణంబుల-నంధకారం బంత నడఁగఁ జేసి
వాసవారాతిపై వహ్నిబాణము నేయ-నాతండు రౌద్రాస్త్ర మడర నేసె
 
తే. రెండు బాణంబులును గూడి గం డెసంగఁ-బెనఁగి యాకాశమున నుండి పృథ్విమీఁదఁ
బడియె నద్భుతగతి జగత్ప్రళయముగను-సురలుఁ గపులును దైత్యులుఁ జోద్యపడఁగ.
24
వ. అట్లు మహాద్భుతకరంబుగా సమరంబు జరుగుచున్న సమయంబున. 25
క. రామునిమేనను బాణ
స్తోమంబులు నాట నేసె సురరిపుఁ డలుకన్‌
రాముఁడు ఘననారాచ
స్తోమంబులు నాట నేసె సురరిపుమీఁదన్‌.
26
చ. ధరణిపుమీఁదనుం గనలి దానవనాయకుఁ డేసె నంత భీ
కరశరభోష్ట్ర కాకఫణిగండకఘూకబలాకభేకసూ
కరకిరిఋశ్యకూర్మశుకగర్దభ భల్లుకనీలకంఠకే
సరివృకగృధ్రకీటబకసైంధవసైరిభవక్త్రబాణముల్‌.
27
వ. ఇట్లు నిరంతరంబుగాఁ బ్రయోగించిన. 28
చ. పరువడి మీదవచ్చు పటుబాణచయంబులఁ జూచి రాఘవుం
డరుదుగ వాని నన్నిటి వియత్తలవీథిని ద్రుంచి క్రమ్మఱన్‌
సురరిపుమీఁద నేసె బలసూదనముఖ్యులు సూచి మెచ్చని
బ్బరముగ నగ్నిబాణము నభంబునఁ గీలలు పర్వుచుండఁగన్‌.
29
వ. అమ్మహాస్త్రంబువలన. 30
క. దహన ముఖంబుల శరములు
గ్రహముఖములు గలుగునట్టి ఘనతరశరముల్‌
మిహిరముఖంబుల శరములు
బహుళముగాఁ గల్గి దైత్యపతిపైఁ బర్వెన్‌.
31
ఆ. అంత దానవేంద్రుఁ డాబాణతతు లెల్ల
దృణములట్లు నడుమఁ ద్రించి వైచి
మయునిచేతఁ గొన్న మహనీయ మగునట్టి
శంబరాఖ్య మైనశరము వైచె.
32
క. ఆశరమున బహుశస్త్రము
లాశుగతిం గలిగి గవియ నన్నిటి నొకటన్‌
నాశము చేసెను రాముం
డాశాపతు లలర మన్మథాస్త్రముచేతన్‌.
33
ఆ. శంబరాఖ్యశరము జగదీశుబాణంబు
వలనఁ జెడక రామువక్ష మడర
నాటె నంతలోన నాకారిపై నేసె
విశిఖతతులు వేయి వేయునెడను.
34
క. రావణుఁ డాబాణములకు
వేవేగను ప్రతిఘటించి వేసినశరముల్‌
చేవ మెయిఁ దాకిఁ వడి ధా
త్రీవలయంబునను బడి ధరిత్రి వడంకెన్‌.
35
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )