ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
సంజీవనికై హనుమ పయనము
క. ఈయన ప్రాణము లెత్తఁగ
వాయుజ! యలనాఁటిమందు వడిఁ దేవలె నీ
వీయెడ నచటికిఁ దడయక
పోయి వెసన్‌ రమ్ము ప్రొద్దు పొడువక మునుపే.
60
వ. అనిన భూకాంతుండు హనుమంతున కిట్లనియె. 61
క. రమ్మా వాయుతనూభవ!
యిమ్మహి సత్కీర్తిఁ బడయు మీతని ప్రాణం
బిమ్ముగ రక్షింపుము నా
తమ్ములలో నీవు నొక్కతమ్ముఁడ వరయున్‌.
62
వ. అని డాయం జని కౌఁగిటం జేర్చి దీవించి యంపె నప్పుడు. 63
ఆ. పదము లూనఁ ద్రొక్కి వదనంబు దిగఁ జూచి
చేతు లూని నడుము చిక్కఁబట్టి
క్రుంగి నిక్కి యెగసి కుప్పించి వడి దాఁటి
చనియె గగనవీధి ననిలసుతుఁడు.
64
వ. అట్టి సమయంబున. 65
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )