ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
కాలనేమి కపటోపాయము
సీ. దనుజేశుఁ డావార్త విని కాలనేమిగే-హము సొచ్చి నడిరేయి యతనితోడఁ
తనచేత హతుఁ డైన ధరణీశు తమ్ముని-ప్రాణంబు లెత్తంగఁ బవనసుతుఁడు
సనుచున్న యట్టిపని విఘ్న మొనరింపఁ-గ్రక్కున నటఁ బోయి ర మ్మటన్నఁ
గాలనేమి యిదేటి కార్యంబు తగ దన్న-వినక కోపించిన వేగ నరిగి
 
తే. ద్రోణ శైలంబు చేరువత్రోవయందు-వనముఁ గావించి తగ మునీశ్వరునిరీతి
జపము సేయుచుఁ గన్నులు చక్కమూసి-నడుము నిక్కించి పద్మాసనమున నుండె.
66
వ. అప్పు డాకాశమార్గంబునఁ జనుచున్నయప్పవనసుతుండు వనంబుగాంచి త్రోవ దప్పె నని మనంబున
సందియ మొంది యమ్మునీంద్రు నడిగి చనువాఁడై యతనికి నమస్కరించి యిట్లనియె.
67
తే. మునినాథ! నేను రాముని
పనికై చనుచున్న వాడఁ బరమౌషధముల్‌
గొని రావలె మది భావిం
చి నిజమ్ముగ నిపుడు త్రోవ సెప్పుము నాకున్‌.
68
వ. అని ప్రార్థించి దాహోపశమనంబున కుదకంబు వేఁడిన నక్కపట మునీంద్రుం డిట్లనియె. 69
ఆ. పవనతనయ! రామభద్రునిపని మాకుఁ
దీర్పవలయుఁ గాన నేర్పుతోడఁ
బ్రాణరక్షకొఱకు ద్రోణాద్రి కరుగంగ
వలదు వినుము నాదువనమునందు.
70
తే. ఘనతరం బైన సంజీవి కరణి మొదలు
గాఁగ దివ్యౌషధంబులు గలవుగానఁ
గొంచుఁ బోవచ్చుఁ గావునఁ గోరుపండ్లు
తనివి దీఱంగఁ దిని నీళ్ళు త్రాగుమిచట.
71
వ. అని తనహస్తంబున నున్నవిషయుక్తం బైన కమండలూదకంబు చూపినం గని హనుమంతు డవి చాల
వనిన నక్కపటమునీంద్రుండు క్రూరమకరావృతం బైన కమలాకరం బొకం డెఱింగించి పొమ్మనినఁ
బవనాత్మజుండుసని.
72
క. విమలమకరందలుబ్ధ
భ్రమరనికరపక్షపవనపరికంపితస
త్కమనీయ కుముద కైరవ
కమలంబులు గలుగుకొలనుఁ గనుఁగొని యచటన్‌.
73
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )