ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
మాల్యవంతుని మరణము
వ. అని యిట్లు సందియంపడి కాఁడని నిశ్చయించి యంత హనుమంతుండు దక్షిణపాథోనిధి దఱియం
జనునప్పుడు దశాననుపంపున సేనలఁ గూడి మాల్యవంతుం డెదిరించి శస్త్రాస్త్రంబులు గురియించి
నొప్పించినం గని వాతూల సంభవుండు వాల మల్లార్చి యార్చిపేర్చి దనుజబలంబులఁ జలంబునం
దఱిమి వాలముఖంబున గళంబులు పట్టి నానాముఖంబులం బాఱవైచినన్‌ గని మాల్యవంతుండు
తీవ్రశరంబుల నొప్పించిన నడరి యద్దానవేంద్రుని కంఠంబున వాలంబుంగీలించి గిరంగిరం
ద్రిప్పి సముద్ర మధ్యంబునఁ బడవైచిన వాఁడును బాతాళంబునకుం జనియె నాక్షణంబ.
83
తే. మాల్యవంతునిఁ బోకార్చి మానుషమున
గగనమండలఁ మందందఁ పగులనార్చి
వచ్చునప్పుడు శతకోటివారిజాప్త
దీప్తిఁ గనుపట్టెఁ బ్రాచీనదిక్కునందు.
84
వ. ఇట్లు వెలుంగుచున్న మహౌషధాచలంబు దివ్యదీప్తులు గనుంగొని రాఘవేశ్వరుం
డది సూర్యోదయం బని మనంబునఁ దలంచి కపిరాజున కిట్లనియె.
85
చ. అదె కనుఁగొంటిరే కలయ నర్కుఁడు పూర్వగిరీంద్ర శృంగమం
దుదయమునొందె నింక నిటనుంచినఁ దమ్ముని ప్రాణవాయువుల్‌
బ్రదుకుట దుర్లభంబకట! పల్మఱు మ్రొక్కెడు ప్రొద్దె మాకుఁ దా
నదయత శత్రుఁడయ్యెఁ గపులార వినుండిదె మీకుఁ జెప్పెదన్‌.
86
తే. మాకులంబున కెల్లను మహినిఁ దలఁపఁ
దానె కర్తయై యుండియు ధర్మ మగునె
యుదయ మందంగ మనుమఁ డిట్లున్న యెడను
గొసరి చుట్టాలుఁ బగవారిఁ గూడవలెనె.
87
క. ఈ లాగునఁ దాఁ బొడిచిన
మా లక్ష్మణు ప్రాణ మేల మగుడును భానుం
గూలఁగ నేసెద విల్లును
గోలలుఁ దెమ్మనుచు నందికొనునాలోనన్‌.
88
వ. రామచంద్రునకు జాంబవంతుం డిట్లనియె. 89
ఉ. భానుఁడు కాఁడు చూడు నరపాలక! మందులకొండదీప్తు లీ
మానము దోఁచెఁగాని యనుమానములేదు వినుండు వేడ్కతో
వానరసేన నింకెదురు వాయుతనూజుని గారవింపఁగా
మానవనాథ! పంపు మనుమాత్రనె వచ్చెనతండు తీవ్రతన్‌.
90
క. అనిమిషులు సన్నుతింపఁగ
హనుమంతుఁడు ద్రోణశైల మతిశీఘ్రముగాఁ
గొని వచ్చి నిలిచి రఘురా
ముని శ్రీపాదముల కెలమి మ్రొక్కినయంతన్‌.
91
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )