కావ్యములు ఋతుఘోష గుంటూరు శేషేంద్ర శర్మ
నమస్క్రియ
అంకితము
 
వసంతర్తువు
గ్రీష్మర్తువు
వర్షర్తువు
శరత్తు
హేమంతము
శిశిరఘోష


నమస్క్రియ
కవితామ్నాయ రహస్యముల్‌ దెలియగా కాంక్షించినావేని, పొ
మ్మననిన్‌ నీ వెవనిందలంపక తదేకాసక్తితో జేరుమా
కవిసమ్రాట్టగు విశ్వనాధు ప్రతిభా గంభీర వారాన్నిధిన్‌
శివకోటీర ఝరీతురీయ వచన శ్రీ సన్నిధిన్‌ బెన్నిధిన్‌.
ఎవని యాకృతిమించు హిమశైల శిఖరమై
కవులలో పుడమి మానవులలోన
ఎవని భారతి వెల్గు నేకైక దీపమై
జగములం దాగామి యుగములందు
ఎవని మన్గడ యొప్పు శ్రవణపీయూషమై
కథలలో సూరి వాక్సుధలలోన
ఎవని స్థానముగ్రాలు నవనవోన్మేషమై
ఋషులలో నిఖిలానిమిషులలోన
అతడు కవియును ఋషియు దేవతయుగాడు
కవులు ఋషులును దివిజులుంగలసి మెలసి
మ్రొక్కు సాక్షాత్‌ పరబ్రహ్మ మూర్తిగాక
విశ్వనాధుండు కేవలావిర్భవుండె!
అంకితము
శ్రీ కారుణ్య మగణ్యమై కవి జగజ్జేగీయ సాద్గుణ్యమై
లోకాలోకపరీత యావదవనీ లుంటాక పంటాన్వయా
నీక ఖ్యాతి శరణ్యమై వెలయు వన్నెల్‌ పొన్నలూర్వంశపుం
బ్రాకారంబుల బచ్చతోరణములై వాసించు నశ్రాంతమున్‌
కవితాతుందిల మందహాసుడును రాకా శీకరాంశుప్రభా
నివహక్షీర పటీర గాంగలహరీ నీహార హారావళీ
శివసంకాశ యశః ప్రకాశయుతుడౌ శ్రీ కోటరెడ్డి ప్రభుం
డవిలంఘ్య ప్రతిభా సముద్భట లుఠత్‌ ద్యావామహీమండలీ
ప్రవసత్‌ తేజుడు వీర రాఘవ మహా భాగుండు తద్వంశ సం
భవులై భవ్య పరంపరా విభవులై భాసింతు రెంతేనియున్‌
దివిషద్వీధికి చంద్రసూర్యుల వలెన్‌ తేజంబు వాటించుచున్‌.
నరులేగాదు సురాసురాద్యఖిల త్రింశత్కోటి బృందారకుల్‌
సరియే తన్మహనీయ వంశలతికా సంజాత మల్లీవిక
స్వరకింజల్క కిశోరమూర్తికి సమస్త గ్రంథసందర్భ ని
ర్భర విద్యా మహనీయమూర్తికిని శుంభ ద్రెడ్డి కోటయ్యకున్‌.
పున్నమనాటి రేయి విరబూచిన కన్నె గులాబి గిన్నెలో
వెన్నెల తూలికం దడిపి విశ్వవిధాత దిగంతసీమలం
జెన్నగు మేలుబంతిగ వచించి రచించిన యట్టి సర్వలో
కోన్నత మూర్తియై వెలయు కోటయరెడ్డికి సాటియుందురే.
ఆతడజాతశత్రుడు సమస్త సుధీజనమిత్రుడార్జవో
పేతచరిత్రు డగ్రపదవీ భరణైక సమగ్రపాత్రుడున్‌
భూతల సర్వమానవ సమూహ శిరోమణియంచు నెంచి వి
ఖ్యాతిగ మద్వచో గగనఘంట ఘటించి వచింతు నెంతయున్‌.
మాటలు గావు మా హృదయ మంజుల కుంజములందు జల్లు ప
న్నీటి వెలంది తేటలది నెయ్యముగాదు సరోజపత్రికా
పాటల కాంతి పుంజములపై బరుగెత్తు మరంద ధార, వే
యేటికి సాధుతోయధి జనించిన పూర్ణ శశాంక మూర్తియే.
వేయి గులాబి కన్నెలర విచ్చునుగాక సహస్ర కోకిలల్‌
కోయని కూయుగాక ఒక కోటినిశీధులు పండువెన్నెలల్‌
గాయునుగాక నాహృదయ కంజము రంజిలబోదు తన్మృదు
చ్ఛాయల కోయిలంబలె ప్రశాంతి వసించెడు వేళలంబలెన్‌.
తన సౌహార్దము సత్క్రియాచరణ విద్యావద్యమే గాని యే
క్షణికామోద వినోదకాలకలనా జన్యంబొగా, దామనిన్‌
వనసీమల్‌ పులకించి పూచి వలపుల్‌ వ్యాపించి దీపించిన
ట్లనయంబున్‌ విలసిల్లుగాతమని నేనాశింతు నాస్నేహమున్‌.
కలిమిజూచి నేను కట్టుబడ్డది లేదు
బలిమిజూచి బెదరి పారలేదు
చెలిమి నన్నుబట్టి సేవకునింజేయు
చిగురుగుత్తి నాదు చిత్తవృత్తి.
నాకుంగల్గిన భూరిహర్షమునకున్‌ దార్కాణగా నీకృతిన్‌
నీకర్పించితి మెచ్చి యీయపర వాణీమంజుమంజీరముల్‌
నీకల్యాణగుణాత్తకీర్తి కలకంఠీ కంఠఘంటాపథ
వ్యాకీర్ణ స్వరమాధురీభరములై వ్యాపించు తద్వైఖరుల్‌.
వసంతర్తువు
ఇది మధుమాసమా! అవుర
యెంత మనోహర మెందుజూచినన్‌
సదమల కాంతులం గులుకు
జాజులు మల్లెలు తీగసంపెగల్‌
కొదమగులాబులుం జిగురు
గొమ్మల రెమ్మల శాద్వలమ్ములన్‌
ముదమున ముంచె నీసుమ
సముద్రము విశ్వదిశాంతరాళమున్‌.
ఈ ఆకాశము నీ మహాజలధులు
న్నీధారుణీ మండలం
బీ యందాల తరుప్రపంచనిచయం
బీ విశ్వవైశాల్య మెం
తో యంతస్సుషమా సముల్బణముతో
నుఱ్ఱూత లూగించె నా
హా! యూహావిహగమ్ము తానెగిరిపో
నాశించె నుత్కంఠతో.
నీలిజలంబు నీలిధరణీ
వలయంబు వినీల శైలముల్‌
నీలి తరుప్రపంచములు
నీలియనంతము - యెందు జూచినన్‌
నీలిమ; నీలిమాకలిత
నిర్భర కంఠము పిల్చినట్లు నా
నీలిమదేహపంజర వి
నిర్గతమై పరుగెత్తె నెంతయున్‌.
ఏ మాకందతరు ప్రవాళములనో
హేలాగతిం గోకిలా
భామాకంఠము శంఖమై మొరసె
శుంభత్‌ కీరనారీదళ
శ్యామంబై మెరసెన్‌ నభంబు,
భ్రమర జ్యావల్లి మల్లీసుమ
శ్రీ మీనాంక శరమ్ములంగురిసె
వాసిం జైత్రమాసమ్మునన్‌.
చిక్కని చిగురాకుజీబులో పవళించి
యెండువేణువు కంఠమెత్తి పాడె
తలిరాకులూడిచి తపసిగా మసలిన
నగ్నవల్లికయు పర్ణములదాగె
జిలుగు సీతాకోకచిలుక రూపము దాల్చి
కీటకయోగి కంకేళి గవిసె
శిశిర వ్రతాచార జీర్ణ మారుతమూర్తి
యలరు గిన్నెల గందమలదుకొనియె
ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ
యెడద పురుషునిలో మొగ్గదొడిగెనేమొ
విశ్వమందిరకుడ్యముల్‌ విరుగగొట్టి
మోహకల్లోలవీచిక ముంచివైచె.
ఎల బ్రాయమ్మున విశ్వమందిరమునన్‌
హేలాకళామూర్తితో
కొలువై కన్నులపండువైన పురుషున్‌
గోర్కుల్‌ పిసాళించి మై
పులకింపం దిలకింపగా ప్రకృతి సొం
పుల్‌ గుల్కు సింగారియై
యలరుల్‌ కెంజిగురుల్‌ ధరించిన వసం
తారంభకాలంబిదే.
ఆ యాకర్షణ మా మహోత్సవము
నా యావేశ మాకాంక్షయున్‌
ఏయాలింగనకున్‌, సుధామధుర పా
నీయాధరాపేక్షకున్‌
ఏ యుద్వేల రతిక్రియాకలనకున్‌
ఏ మాత్రముంగాదు తా
నేయంతర్గత సృష్టిసూత్రమహిమా
హేవాకమో చూడగన్‌.
ఆసల్‌ దీరునె దృష్టిచే, మహితగా
ఢాలింగనాయుక్తిచే
నాసంయోగ నిరంతవేదనములే
యద్వైతసంసిద్ధికో
నైసర్గంబగు నేయగాధకుహ
రాంతః ప్రజ్వలానందకీ
లాసంతర్పణకో శరీరమొక కా
రాగారమై తోచగన్‌.
ఇది వాసంత రసస్రవంతి; యిది
ధాత్రీజీవకూలంబులన్‌
గదియంబారెను హోరుమంచు, నళినీ
కాసారతీరంబులన్‌
బొదలం దోటల బాటలాధరలతో
పోలేని కూలీజనుల్‌
మదిలోగుందుచు చేలలోదిరిగిరా
మధ్యాహ్న కాలంబులన్‌.
కొండల కోనలన్‌ నదుల
కోవల త్రోవల నాట్యమాడుచుం
బండువుసేయగా కుసుమ
బాలలు శోకరసాలవాలమై
కొండొకకంఠమే శిథిల
కుడ్య గుహాంతరితాంధకారమం
దుండియొ నిర్గమించె విన
వోయి తురంగము నాపుమించుకన్‌.
కలికి గులాబిఁగేలగొని,
కమ్మని తెమ్మెర గుఱ్ఱమెక్కి, కెం
పులదలిరాకుబాకు నడుముం
గులికింతువు గాని, చూడు, నీ
జిలుగు పసిండి దువ్వలువ
చీరచెరంగున భాగ్యశోకపం
కిలకలనాకళంకములు
గీల్కొనె మేల్కొనవోయి మిత్రమా.
లోకాలోకపరీత భూవలయ
కల్లోలంబులందాటి యే
రాకాకోకిలశోకమో మలయ
నారంభించె వాసంతికన్‌;
నా కళ్యాణ హృదంతరాళ కల
కంఠస్వైర ఘంటాపథ
వ్యాకీర్ణ స్వరమాధురీలహరులై
భాసింప తద్వైఖరుల్‌.
తిమిరతమాలపల్లవము
తీరున కోకిల యాకులందునన్‌
గుములుచు కూరుచుండి యొక
కోమలగీతిక పాడినంతనే
సమధిక విశ్వశోకమయ
సాహితి పొంపిరివోవ త్రోవలన్‌
విమలరవంబు మాహృదయ
వేణువులన్‌ రవళింపనేలనో.
తోరపు పంటచేలు పువు
దోటలు బాటలు పచ్చబీళ్ళు పొం
గారు తటాకముల్‌ తనవి
గావు; విశాలధరాతలమ్మునన్‌
దూర గ్రహాంతరాగత వినూతన
జీవిగ గ్రుమ్మరిల్లి యిల్‌
సేరగబోవు శ్రామికుడు
చీకటి దిక్కుల పిక్కటిల్లగన్‌.
చేలంబూవులు వెక్కిరించె
గగనశ్రీ చంద్రరేఖాంకయై
వేళాకోళముజేసె తాళవనిలో
వేలాదితారావళుల్‌
గోలంజేసెను చింతకొమ్మపయినం
ఘూకంబు శోకించె నా
కూలీవాడు కుటీరగర్భమున
నాక్రోశించె దైన్యంబునన్‌.
ముదుసలి తల్లిదండ్రులును
ముగ్గురు పిల్లలు చిన్నచెల్లెలున్‌
ఒదిగి పరున్న జీర్ణకుటిలో
నిటువైపున భార్య యావలన్‌
జిదుగులచెంత దాను శయ
నించును కన్నులుమూసి, మిన్నులన్‌
దదియ శశాంకరేఖయు
నితాంతనిశాగతి నస్తమింపగన్‌.
నేలయు నింగియుం దెలియ
నీక యొకేతిమిరంబు విశ్వమం
దేలెను కీచురాళ్ళు ముఖరించె
మిణుంగురు లంధకారముం
జీలిచె చెట్లకొమ్మలును
శీర్షములన్‌ విరబోసి దయ్యముల్‌
వోలె చలించె జీర్ణకుటిలో
నెటులో నిదురించె జీవుడున్‌.
గ్రీష్మర్తువు
లోలంబంబు ధ్వనించె నాకసము
గండూషించె బీరెండలన్‌
వాలాయంబుగ బాలకోమలదళ
వ్యాలోల డోలావళీ
కేళీమంజుల లీలలందలసి
కున్కెం గ్రీష్మవాతూలముల్‌
చేలుం దోటలు దాటి యేగి వన
వంశీకుంజపుంజంబులన్‌.
ప్రత్యూషముల దిశాఫాలభాగమ్ముల
కెందమ్మి విరిచాయ గీలుకొల్పు
కుతపవేళల విశ్వకుహరాంతరములందు
గుమ్మడి పూవన్నె గుస్తరించు
మధ్యాహ్నముల నభోమండలాధ్వములందు
మల్లెదండల శోభ వెల్లిగొల్పు
అపరసంధ్యల రమ్యవిపిన నిర్ఝరులందు
సిందూరకాంతులు చిలుకరించు
కాలకంఠుని ఫాలాక్షి కాఱుచిచ్చు
దావ పావకదీప్తికి జీవగఱ్ఱ
పశ్చిమానిల వీచికి పట్టుగొమ్మ
అవతరించెను గ్రీష్మకాలాతపమ్ము.
దుర్నిరీక్ష్య ప్రభాధూర్ధరచ్ఛటలతో
క్షేత్రజీవనుల శిక్షించినాడు
పటురోషకాషాయ కుటిలాంశుకశలతో
గోగణంబులు చావగొట్టినాడు
ఖరమయూఖ క్రూర ఘనకాండపటలితో
విహగజాతులు క్షోభవెట్టినాడు
గ్రీష్మకాలప్రాంశు కింశుక ద్యుతులతో
తరువల్లికల కగ్గిదార్చినాడు
గగన ఘనఘోట ఖుర నిరాఘాటధాటి
నలఘు బ్రహ్మాండ భాండమ్ము నలగద్రొక్కి
చటుల దుర్జన రాజ్యశాసనమువోలె
సాగె మార్తాండు చండప్రచండ రథము.
ఎవడో చాకలి ఆకలిన్‌ మరచి
తానేవన్యమల్లీలతా
నివహక్రోడపుటీ తటాకముననో
నిత్యశ్రమాజీవన
వ్యవసాయంబొనరించుచున్న
ధ్వనియే వ్యాపించె ప్రాపంచిక
వ్యవహార ప్రవిహీన విశ్వహృదయ
వ్యాపారమేమోయనన్‌.
వివిధ నిమ్నోన్నతవీధులం బరుగెత్తి
వైశాఖలో మేనువాల్చెనొకడు
ద్రాఘిష్ఠ ఘంటాపథమ్ములం దిరుగాడి
బెజవాడ కన్నీరుబెట్టె నొకడు
మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి
గుంటూరులో కుప్పగూలెనొకడు
కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి
నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు
క్రూర దారిద్ర్య దుర్విధికారణమున
తన భుజాగ్రమునెక్కు భేతాళమూర్తి
సర్వ కాలానువర్తి రిక్షా ధరించి
లాగలేకను వేసవికాగలేక.
కొండల గండభాగముల
గూల్చి శిలాశకలమ్ములేర్చి పే
రెండలధాటికోర్చి శ్రమి
యించి పురీపరిణాహవీధులం
బండలు లాగుచుం బ్రతుకు
భారము మోయు నభాగ్యకోట్లు నా
గుండెలలోన నగ్నిదరి
కొల్పును తీవ్రనిదాఘవేళలన్‌.
గునగున సంచరించు పసి
కూనలు చానలు చెట్ల నీడలం
దినములు బుచ్చు కాలము
గతించును గాక సమస్త దీన జీ
వనములు పల్లవించి సుఖ
వంతములై విలసిల్లు గాక నా
మనము శమించు గాక మరు
మల్లెలలో చిగురాకు చందమై.
వర్షర్తువు
కనరాదు యామినీకబరీభరమ్ములో
బెడగారు కలికి జాబిల్లిరేక
సికతరీతిగ తమశ్చికుర నికరమ్ములో
నలతిచుక్కలమోసు లలముకొనియె
జిలుగువెన్నెలచీర చిరిగిపోయెనదేమొ
కాఱుమబ్బులు మేన గ్రమ్ముకొనియె
యెడదలో నేదేని సుడియుచుండెనొ యేమొ
కాకలీనినదముల్‌ క్రందుకొనియె
మేను విరిచెనేమొ మెల్లగా నిట్టూర్చి
విధురవాయువీచి విస్తరించె
నాత్మవేదన కొక యాకారమైతోచి
నేటి రేయి నన్ను కాటు వేసె.
ఘనఘనాఘన గజగ్రైవేయఘంటికా
టంకారములకు ఘంటాపథంబు
శక్రచాపోదగ్ర శార్దూలపాలనా
విభవోన్నతికి భూరి విపినసీమ
చటుల ఝంఝామరుచ్ఛత కోటి భేతాళ
లుంఠన క్రియలకు రుద్రభూమి
పటు తటిద్విలసన బ్రహ్మరాక్షస కఠో
రాట్టహాసమున కహార్యబిలము
గగన భాగమ్ము ప్రావృషద్విగుణరోష
ఘటిత నటనోగ్ర ధాటీ విఘటిత ప్రకట
కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల
వికట భ్రుకుటీ కుటీర ముద్విగ్నమాయె.
విరిసెను మేఘపరంపర
మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్‌
పరచెను ఝంఝానిలములు
కురిసెను వర్షము కుంభగుంభితరీతిన్‌.
దీపించెం జలరాశిఘోష కడు
నుద్రేకించి గీతంబు లా
లాపించెన్‌ నగసీమలందిగి
మహారణ్యమ్ములన్‌ నిర్ఝరుల్‌
వ్యాపించెన్‌ హరిదంతదంతురములై
యారావకల్లోలముల్‌
వాపీకూప తటాకభేకముఖ
జీవానీక లోకంబులన్‌.
వర్షా గర్జ దమోఘ మేఘపటలీ
వాఃపూర ధారా సము
త్కర్షామర్ష నిపీడ్యమాన జనతా
కంఠీరవంబై, నభః
శీర్షాంతఃపుర భోగ భాగ్య వనితా
శ్లేష ప్రభాహర్ష దు
ర్ధర్షాగార బిడాలమై నడచె నౌ
రా కాలముద్వేలమై.
ఒకనికి గండభేరుండ శుండాలంబు
లొకనికి మకరధ్వజోత్కరంబు
ఒకనికి నశనిపాతోగ్రబిభీషికల్‌
ఒకనికి మురజప్రమోదరవళి
ఒకనికి సమవర్తి హుంకార కింకరుల్‌
ఒకనికి ప్రియదూత నికరలీల
ఒకనికి శైత్యభల్లూక భీకర దంష్ట్ర
లొకనికి యువతీకవోష్ణసుఖము
యేమిధర్మంబు భాగ్యవిహీనదీన
జనులమీదనె దౌర్జన్యచర్యగాని
హేమధామ సముద్దామసీమలందు
అడుగువెట్టంగ పర్జన్యుడైన వెఱచు.
కనకమేఖలవోలె గగనమ్ము జఘనమ్ము
నింద్రచాపము కుండలీకరించె
జాజిదండలవోలె జలదమ్ముకబరిలో
సౌదామినీమాల సంచలించె
చిలిపినవ్వులవోలె చిన్కుముత్యాలలో
నీహారమధురిమ నివ్వటిల్లె
అందెలరవళిగా ఆశాపథమ్ము లం
దంబుదధ్వనులు మోహంబుగొల్పె
వలపు కైపెక్కి బిబ్బోకవతి యొకర్తు
వచ్చెనోయన వెచ్చని భావశయ్య
నిదురవోయెడు ధనికుల మృదుకవాట
వాటములు దట్టి పిల్చెను వర్ష ఋతువు.
ఘనతర వర్షపీడిత జగమ్మున
కమ్మని సౌధవీధులం
గనకమయ ప్రభావ పరి
కల్పిత భోగవిలాసవాసనా
జనిత మదప్రలాపములు
శల్యములై వినిపించుచుండగా
మనము సముజ్జ్వలజ్వలన
మాలికలంబడి మ్రగ్గకుండునే.
ఆమని మల్లికాకుసుమ
హారములిచ్చు నిదాఘమాసముల్‌
కోమలగంధచర్చ సమ
కూర్చు సముత్కట వర్షకాలమున్‌
గామకవోష్ణసౌఖ్య పరి
కల్పనసేయు విధేయురీతిగా
శ్రామికబాష్ప నిర్ఝర
తరంగ విహారమరాళజాతికిన్‌.
చలిగాలిం ౙడివానలంబడి ప్రపం
చంబెల్ల చల్లారగా
నలఘు క్రోధమునంజ్వలించె హృదయం
బాభీల కీలావళీ
కలితోదగ్ర మహాగ్నిహోత్రమున నీ
కర్కోటక క్రూరమౌ
చలిలో బీదలబాధలం దలచినన్‌
శాంతింపగా సాధ్యమే.
పసికందుల్‌ ౙడివానలో వడకగా
పాకల్‌ ధరంగూలి తా
మసహాయస్థితి తల్లిదండ్రులును
హాహాకారముల్‌ సేయగా
నిశిత క్రూర కఠోరజిహ్వికలతో
నిర్వేల హాలాహల
శ్వసనంబుల్‌ ప్రసవించె దీనజనతా
సంసారపూరంబులన్‌.
అకలంకామృతమిచ్చినావొకరికిన్‌
హాలాహల జ్వాలికా
నికరమ్మొక్కరికిచ్చినాడవు
జగన్నిర్ణేత! ఏతద్విధం
బొకకంటన్‌ దుహినాంశుమండలము
రెండోకంట నుష్ణాంశువుల్‌
ప్రకటింపంగల లోకరక్షణకళా
ప్రావీణ్యమేమో ప్రభూ!
శరత్తు
ముల్లోకములు ఏలు ముద్దుహరిణాంకుడు
విరజాజి తీవలకు విరహిణీ జీవులకు
తరిపి వెన్నెలపాలు త్రాగించుచున్నాడు.
ఏగాలికెగసెనో యీ చికిలితారకలు
అందాలతళుకుతో అప్సరసలకుమల్లె
ఆకాశరంగాని కవతరిస్తున్నాయి.
నిర్మలాకాశంపు నీలాటిరేవులో
పండువెన్నెలనీట పిండి ఆరేసిన
తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి.
చిగురు గుబురులుదూరి చిరుగాలి బాలికలు
రేరాణి పూలపై పారాణి రాచుకొని
చిక్కని నెత్తావి పుక్కిలిస్తున్నాయి.
తీయని భావాల తీగలల్లుకుపోయి
రాగమయ భావనారమ్య వనభూమిలో
విరితేనియలు వెల్లివిరిసిపోతున్నాయి.
తరుమూలమ్ముల పూలవానగురిసెన్‌
దారాడెకూలంకషా
తరుణీస్వచ్ఛదుకూల చేలములలో
తారళ్య సారళ్యముల్‌
ధరణిన్‌ నిండె శశాంకదీధితి
నిశాధమ్మిల్ల మల్లీవిక
స్వరకింజల్కములై యొకానొక
శరద్వాతూల హేలాగతిన్‌.
వలపించె కెలకులం గొలకులో మదకరి
పుక్కిటి నీహార పుష్కరములు
కురిపించె తేనెలం గోనలం దిరుగాడు
కొండవాగులగాన గుంభనములు
సవరించె మంజిమల్‌ నవతృణాంకురభూమి
విరిసినసారంగ విభ్రమములు
పచరించె హరివిండ్లు బాలవాతూలముల్‌
వెదజల్లు చల్లని విప్రుషములు
బిపిన సీమలు శారదవేళహృదయ
గుహలలోపలి చీకటి గూళ్ళలోని
కోరికలులేని ఆశాచకోరికలను
మేలుకొల్పెను రెక్కలం గీలుకొల్పె.
అది సాయంతన మర్కమండలము
సాంధ్యశ్రీలు గోల్పోయి యే
పొదలో గ్రుంకెనో అంధకారమొక
యంభోరాశియై లేచె; నా
మది నవ్యక్త విషాదభావరజనీ
మంజూషగా మారిచెన్‌
మృదు హిందోళ మరందరాగలహరీ
మిశ్రంబులై వాయువుల్‌.
సాంధ్యరాగశ్రీలు సాగిపోతున్నాయి
యెడదలో క్రీనీడలేపారుచున్నాయి
చీకటి దెయ్యాలు శీర్ణ కేశాలతో
దూరాన చెట్లలో తారాడుచున్నాయి
కాకరపాదులో కనరానివేవియో
మొకరి గొంతులు జగము ముంచివేస్తున్నాయి
గ్రుడ్డి ముసలమ్మ లాగున్న గదిలో దివ్వె
తన పూర్వ గాధలను తలపోసుకుంటూంది
ఈ శూన్య లోకపు యిసుక యెడారిలో
కళ్ళు మూస్తే పీడకలలు వస్తున్నాయి.
హితవుగ మేఘమాలిక
ద్రవించునుగాక, చిగిర్చి యంతటన్‌
లతలు సుమించుగాక
పృథులమ్మగుగాక వెలంది వెన్నెలల్‌
ఋతువులు మారుగాక
జ్వలియించు క్షుధా వ్యధితోగ్రజీవన
క్రతువులు మారెనే యుగయుగమ్ముల
భారమొకింత తీరెనే.
నిదురవోయెడు యామినీతనూవల్లికి
తులలేని జలతారు వలువగప్పి
చిక్కగా పూచిన చిగురాకు కోనలో
కన్నె కాలువలకు వన్నెగూర్చి
నరజాతికందని నక్షత్రవీధిలో
తెలిమబ్బు తేరెక్కి తేలియాడి
లలిత జీవన లతా లావణ్య ఖేలలో
సౌధసుధలకు వింతసౌరుగూర్చి
లోకమునకెల్ల నమృతాభిషేకమొసగి
పరుగులెత్తెడి యందాల పాలవెల్లి
పండువెన్నెల రాదేల పంతగించి
చితికిపోయిన దీనుల జీర్ణకుటికి.
అంతము లేని కాలపథమందొక
యొంటెల బారువోలె న
శ్రాంతము సాగిపోవు ఋతు
జాలము ౙాలముసేయ; దీతమో
దంతురమౌ విశాల జగ
దంతరమన్న యెడారిసీమ నే
కాంతముగా తపించు
విధురాత్మను గైకొని యేగదక్కటా!
హేమంతము
నెల వెలవెలబారె నీలంపు మిన్నుల
చుక్క సంద్రమ్మింకె చుక్కలేక
ప్రాలేయపుం జిల్గుపరికిణీధరియించి
చెంగావిలేయెండ చిందులాడె
అరవిరబారిన యంబుజమ్మకు బుట్టె
మునురేయిజిక్కిన మొకరితేటి
ముద్దుగా మృదువుగా మొలకతెమ్మెరకురుల్‌
కదలించి ప్రియురాలి కలముగించె
చిగురు బాలలు హిమపాళి సిగలదాల్చి
చిలిపినవ్వుల సింగార మొలకబోసె
జగతి మొగసాల నీ కొల్వు సాగనిమ్ము
పసిడి కాంతులబరణి! ఓ బాలతరణి!
ఇభకుంభస్థల మౌక్తికాభరణమో
హేమంత సీమంతినీ
కబరీ మంజులకింశుకప్రసవమో,
కళ్యాణ సిందూరమో
శుభసందోహ మహావతారమొ
యనన్‌ శోభించుచున్నావు మా
కభయంబిచ్చి నిశాపిశాచకుటిలా
హంకారముం గూల్పవే.
భ్రమరము మ్రుచ్చిలించి మక
రందము లెల్లను శూన్యమైన యా
కమల వనమ్ములో పసిడి
కాంతులు చిల్కిన చాలదోయి మా
తిమిరగృహాంతరాళముల
దీపము వెట్టుము కన్నుదోయి నీ
యమలమయూఖరేఖలకు
అర్రులు చాచెను లోకబాంధవా.
కొదమ వెలుంగులన్‌ చికిలి
కుంచెలతో హిమబిందు సుందరీ
మృదుల కపోల పాళికల
మీదలిఖింతువుగాని ధారుణిం
బ్రతుకుల నావరించిన
పురాతన యాతనలన్న చీకటుల్‌
ప్రిదులు తెరంగునన్‌ శర
ఝరింగురియింపవదేలనో ప్రభూ.
తిమిరములోన బాధపడు
దీనజనాళికి దారిజూపి నీ
యమల మయూఖమాల
చరితార్థము చేయక లాలితీలతా
సుమసముదాయ మూర్తివయి
శూన్యపథమ్ముల సంచరించుచున్‌
హిమ రమణీయసౌధముల
నెచ్చటనో వసియింతువా ప్రభూ.
ఒక మల్లె విరిసింది ఊహలో మురిసింది
ఏయాస నీమీద యెంచుకొనెనొ
ఒక గులాబీ బాలచికిలి నవ్వొలికింది
ఏ యెలమి తరంగ మెగిరిపడెనొ
ఒక జాజి వలపు నిట్టూర్పులు బరపింది
ఏ కోర్కె యెదనాక్రమించుకొనెనొ
ఒక తీగె సంపంగి ఉప్పొంగిపోయింది
ఏ తలపు వెదుళ్ళ యీల వినెనొ
శిధిల జీవులు నీ రాక కెదురు జూచె
వేయిచేతులు కదలించి విశ్వజగతి
జీవకాంతులు ప్రసరింపజేయుమోయి
తెరలు తొలగించిరావోయి అరుణమూర్తి.
శిశిరఘోష
జాజులమీద మోజుపడి
సంతల పుంతల సంచరించి యీ
బూజుబజారు మెట్టితివొ,
పూచి గులాబి జిలేబి గిన్నెలుం
దేజము లోడిగిల్లినవి
తేంట్లకు తేనెలు గోలుపోయి, యీ
రోజుకు వెళ్ళిపొమ్ము
శిశిరోదయమాయె నిలాతలమ్ములన్‌.
ఆకులు రాలి శాఖలకు
ఆకులపాటుఘటిల్లె, పాపమీ
లోకము వృద్ధమూర్తియయి
లొంగి స్మశాన కృశాను కీలికా
నీకము చెంతజేరె, ధరణిన్‌
హిమదంష్ట్రలు కాటు వేసె నా
జూకు కళాపిపాసలకు
చోటొక యింతయులేదునేడిటన్‌.
మించి రసాతలాన విశ
మిశ్రసమీరముదోచి మిన్నులన్‌
మించులు మ్రుచ్చిలించియిక
మేదినిపై నవతారమెత్తి యీ
మంచు ముసుంగు దాల్చుకొని
మాయసువుల్‌ గ్రసియించి మమ్ములన్‌
ముంచగవచ్చె నీ శిశిర
మూర్తి యనాధులపాలి మృత్యువై.
చలి పులివోలెదారుల
పచారులు చేయుచునుండ ఊరికా
వల పెనుమఱ్ఱిక్రింద నెల
వంకయె దీపముగాపరున్న పే
దల పసిపాపలెవ్వరికి
తప్పుదలంచిరి కాలమే హలా
హలమయిపోయి యా శిశువు
లాకలితో చలితో నశింపగన్‌.
ఓ పరమేశ్వరా! యెచట
నుంటివి నీవసలుంటివా ప్రజా
శాపములం భరించుటకు
సాధ్యముగాదని పాతపెత్తనం
బీపయిసాగబోదని
యెటేని పరారయినావ? బాధలం
బాపగలేవు నీవు శిలవా
కలవా సెలవీయుమో ప్రభూ!
కమలా కంకణ కింకిణీక్వణములన్‌
గందర్ప దర్పంబులన్‌
గమనీయంబగు సౌధవీధికలనా
నందించు దుర్మార్గ వ
ర్గములం బ్రోచెడు దేవుడేమెరుగు
నిర్భాగ్య ప్రజాకోటి దు
ర్దమ బాధామయ జీవితానుదిన
గాధాగర్భ సందర్భముల్‌.
ఏలాగో ఒకనాడు ఆ శిశువులే
యింధానమౌగాక యు
ద్వేల క్షోభనభోంతరాళమెగయన్‌
విశ్వ ప్రజాలోచనో
న్మీలంబై హృదయాగ్నిపర్వత
మహానిర్ఘోషరోషానల
జ్వాలా జాలకరాళ జిహ్వికలు
తుచ్ఛంబైన యీ లోకముం
గూలంజేయునుగాక; యీ వచనమే
ఘూర్ణిల్లుగా కంతటన్‌.
AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - Ritughosha - Gunturu Seshendra Sharma ( telugu kAvyamulu andhra kAvyamulu)