కావ్యములు ఋతుఘోష గుంటూరు శేషేంద్ర శర్మ
జీవన ఖేల
వలపు
రాగమయి
వియోగి
అశ్రువు
నిరీక్ష


జీవన ఖేల
ఓయి లతా ప్రవాసి! పద
వోయి జిలేబి గులాబి తోటలన్‌
బ్రేయసి బాహువల్లికల
బేశల కావ్య మరందగానముం
జేయుచు ఖేలగా జనుము
జీవితమే ఒక పూలబాటగా
హాయిగ తీయగా ఒక ఖ
యాముగ నీదు హయాము సాగుతన్‌.
ఓయి సఖా! సుఖింపు, మధు-
రోహలు డోలికలై చలింప చాం
పేయలతావితానములు వేణువులున్‌
విరబూయు కోనలో
తీయని నిర్ఝరీ పులినతీర
కుటీర పటీర శీతల
చ్ఛాయల కోయిలల్‌ సలుపు
శ్రావ్య రవమ్ముల నాలకించుచున్‌.
వలపు
మల్లెలు పూచె బాల సుకు
మార సమీరము వీచె నిండు జా
బిల్లి దిశాంతరాళముల
వెన్నెలకాచె మనోవనస్థలీ
పల్లవశయ్యలం బ్రణయ
భావశకుంతము నిద్రలేచె నో
హల్లకపాణి రావె భర
మాయె వియోగ రసార్ద్రవేదనల్‌.
అల్లిన రాగవల్లికల
కాశ్రయమై విలసిల్లు నీవు నా
పల్లవ కోమలంబయిన
భావము సుంత యెఱుంగలేక యీ
చల్లని పండు వెన్నెల ప
సందు వృథా ఒనరింతువేల నో
మల్లియ పూలరాణి బ్రతి
మాలెద వాలెద నీపదమ్ములన్‌.
ఏ యనురాగ మోహలహ
రీ మహిమాతిశయమ్మొకాని నీ
వాయువు సోకినన్‌ బ్రణయ
భావ కిసాల రసాలమూర్తినై
పోయి జగమ్మునే మరచి
పోవుదు నా చిగురాకు రెమ్మలో
కూయ వదేలనే వలపు
కోయిలవై భువనైకమోహినీ.
ఏ విరికొనలోన విక
సించిన మల్లికవొ లతాంగి! నీ
తావికి మోవికిన్‌ మురిసి
తావక పాదకిసాలయద్వయీ
సేవయొనర్తు రాగమయ
జీవనమో వనమో తదన్యమౌ
భావములేల మాకు క్షణ
భంగుర జీవిత పాంథశాలలన్‌.
రాగమయి
కలికీ! నీవిలకేగుదెంచిన శర
త్కాదంబినీ మాలికా
విలసన్మంజుల చంద్రరేఖవొ నిశా
విర్భూత శీత ప్రభా
సలిలస్నాత చకోర సుందరివొ వ
ర్షాకాశ కేశావళీ
గళిత ప్రోజ్జ్వల దింద్ర చాపమవొ
ఆకర్ణింతు వర్ణింపవే.
హేమంతంబున రెక్కవిప్పిన గులా
బీపువ్వులాగున్నదే
భామా! నీ తనూరేఖ; మామక మనః
పంకేజ పత్రమ్ములన్‌
ప్రేమార్ద్రమ్ముగ దాచుకొందునొ, లస
ద్విద్యుల్లతామూర్తినై
కామోద్వేగ వశమ్మునన్‌ జిదిమి యా
ఘ్రాణింతునో చెప్పవే.
హుంకారంబుగ నీవునిల్చిన త్రిలి
ఙ్గోక్తి ప్రపంచంబునం
దోంకారంబును బోలియుందువు సఖీ!
యోషాజిగీషా ముహు
ష్టంకారంబొనరించు వేళల నధి
జ్యంబైన శుంభ న్నిరా
టంక శ్రీ మకరాంక చాపము కని
ష్ఠంబౌను నీ ఠీవికిన్‌.
అలతి గులాబిమొగ్గమగు
వా! హృదయమ్ము తదంతరాళమున్‌
వలపను కీటకమ్మొకటి
వచ్చి యహర్నిశలుం గ్రసించె నా
చెలువు కృశించె సంచలిత
జీవనకాంతి నశించె నీ కృపా
కలిత కటాక్షమాలికలొ
గాక యరణ్యములో శరణ్యముల్‌.
నీ మోహాలస నేత్రముల్‌ విరిసి నా
నెమ్మోము గన్నంతనే
కామాగ్నింబడి కాలిపోవుదును నీ
కంఠంబు విన్నంతనే
శ్రీ మన్మంజుల పల్లవాభ్యుదయమై
జీవింతునో ప్రేయసీ
నీమందార మరంద భాషలు హిమా
నీబిందు సందోహముల్‌.
ఇంతీ! ఓ మధుర స్రవంతి! శశి తా
నెన్నాళ్ళు తారా పదా
క్రాంతుండై విలసిల్లు నన్నిదినముల్‌
కాంక్షింప వేరెదియున్‌
సంతోషించిన చాలు నీ మృదుపద
చ్ఛాయా సమీపంబులన్‌
కాంతా మంగళకామినై ప్రణయ శా
ఖా కోకిలస్వామినై.
వియోగి
ఏ విషలగ్నమందు జని
యించితినో హృదయేశ్వరీ! నిరా
శావహ కాలపాశ వల
యంబుల జిక్కి విశీర్ణమైన నా
జీవితమెల్లను నందనము
జేయగజాలిన నీయపూర్వ సం
భావిత మాధురీ ప్రణయ
వల్లరి అల్లరిపాలు చేసితిన్‌.
తెల్లని చీరగట్టి నలు
దిక్కులు నిండిన చంద్రకాంతిలో
వెల్లువలైన మోహ భర
వేగమునన్‌ నవఫుల్ల మల్లికా
వల్లికవోలె నా యెదుట
వాలితివో "అనురాగయోగి"! నే
డల్లిన గాధగా నవలగా కల
గా కనుపించు నంతయున్‌.
అశ్రువు
గొజ్జగిపూల సెజ్జపయి
కోమలదేహము వాల్చి ఊహలో
మజ్జనమాడు సుందరికి
మా కుసుమాంజలిజెప్పి వేగమే
కజ్జల భాష్పబిందువుల
కాన్కలుతెమ్ము గులాబితోటకుం
బజ్జనెసంగు చెంగలువ
బావికడన్‌ నివసింతు నెచ్చెలీ.
భావలతా నికుంజమున
పాటలు పాడిన కోకిలమ్మ యే
పూవులతోటకో ఎగిరి
పోయెను తీయని స్వప్నమైన నా
జీవన గేహళీ తిమిర
సీమలు కొమ్మలకాంతి రేఖకై
బావురుమంచు శోక రస
బంధురమై తపియించె నెచ్చలీ.
శారద రాత్రులంగలసి
జంటగ నొంటిగ సంచరించు గ
న్నేరుల కోవలం జిలుగు
నీడల జాడలు మాసిపోయె, పొం
గారెడు నాదు వెన్నెల జ
గమ్ము నగమ్మయి క్రుంగిపోయె, నే
తీరున జూచినం బ్రతుకు
తెన్నులు బాష్పకణ ప్రపూర్ణముల్‌
ఇలపై రాలిన పూలకై వగచి రే
యిన్‌ గారుమేఘాల దా
రులలో గ్రుంకినవంక జాబిలికి యా
క్రోశించి యాశించినన్‌
ఫలమేమున్నది, మావిగున్నలకడన్‌
వాసించి యాశాలతా
వళులం దూగిసలాడు నా ప్రియసఖిన్‌
వారింపుమో మిత్రమా.
పోయినదాని గూర్చి తల
పోయుచు చెక్కిట చేయిజేర్చి వా
పోయెడు బాలకు\న్‌ మరచి
పొమ్మని చెప్పుము గమ్యమెంతకుం
డాయగలేక జీవిత యె
డారుల గ్రుమ్మరు పాంథ జీవికై
హాయని బాష్పబిందు వొక
టైనను రాల్చకుమంచు తెల్పుమా.
నిరీక్ష
వలమాన జ్వలమాన జీవన వనీ
వాసంత వేశంతమౌ
యెలబ్రాయమ్ముననున్న నన్‌ గని కళా
హేలా మనోవీధులన్‌
గల కంఠమ్ములు కూయగా తనువులం గై
పెక్కగా భామినీ
కలభంబుల్‌ శలభంబులాయె విలసత్‌
కామానల జ్వాలకున్‌.
అధర మధూళిధారలకు
ఆసలు మోసులువారి నన్నురో
కుధర యుగాగ్రభాగముల
గ్రుమ్మినవారలెగాని, నా మనో
మధుర లతాలవాలముల
మంజుల భావ తుషారపూర వా
క్సుధలను గ్రుమ్మరించు సుమ
కోమల ప్రేమ లభింపదక్కటా.
కోవెలవంటి నా హృదయ
కుంజములో చెలువారు మవ్వపుం
జీవన మాధురీ రుచులు
చిందరవందర చేయువారె నా
త్రోవల దారసిల్లి రొక
తూలిక పోలిక భావరేఖకుం
దావలమైన ప్రేమమయి
తార లభింపకపోయె నక్కటా.
సురుచిర ప్రేమకై యెదురు
చూచి విశాల ప్రపంచవీధులం
దరిగిన జోళ్ళతో దిరిగి
అర్రులుజాచి వృథా నిరీక్షయై
చిరిగిన నావవోలె దరి
జేరక యూరక సాగరమ్మునం
దొరిగెదనో విలాస మధు
రోహల మేడగ కూలిపోదునో.
ప్రేమ సుధారసమ్మునకు
భిక్షువునై ఫలితమ్ములేక నన్‌
గామ పిపాస పైకొనగ
గైకొనినాడ మదాంధ సింధురో
ద్దామల భామలన్‌, హృదయ
ధామ కళల్‌ శిధిలమ్ములాయె, నా
కోమల భావ సంపదలు
కోల్పడియెన్‌, బశువైతి నక్కటా.
ఓ పరమేశ్వరా! ఒక మ
హోజ్జ్వల ప్రేమ రసైకరాశినిం
జూపవు ఈ భయంకర ప
శుత్వము నాపవు గాంగనిర్ఝరీ
దీపిత శీత శృంగముల
దేలెడు వాయు తరంగడోలలం
దూపవు నా నిరీక్ష కెపు
డోయి సమాప్తము లోకరక్షకా!


AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - Ritughosha - Gunturu Seshendra Sharma ( telugu kAvyamulu andhra kAvyamulu)