కావ్యములు ఋతుఘోష గుంటూరు శేషేంద్ర శర్మ

కావ్య తత్త్వ ప్రకాశము
(కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు)

ఒక కావ్యము యొక్క వెల కట్టుట మిక్కిలి కష్టమైన విషయము. ఒక కవి యొక కావ్యమును వ్రాయును. ఒక వస్తువును స్వీకరించి దాని చుట్టును కబ్బమల్లును. వస్తువు, దాని తత్త్వము, దాని స్వభావము, దాని విలసనము, నీ మూడు దశలయందు వస్తువు ప్రపంచింపబడినచో వస్తువల్పమైనదైనను కావ్యము పరమోత్తమమైనదై కన్పించును. కావ్యగౌరవము వస్త్వధీనమైయుండును. అభిజ్ఞాన శాకుంతలము నందలి వస్తువునకు, మఱియొక కావ్యము నందలి వస్తువునకు గౌరవభేదమున్నది. రసప్రాధాన్యము గల వస్తువు వేఱు; భావ ప్రాధాన్యము గల వస్తువు వేఱు; వర్ణనా ప్రాధాన్యము గల వస్తువు వేఱు. వర్ణనా ప్రాధాన్యము గల వస్తువును స్వీకరించి వ్రాయబడిన యుత్తమ కావ్యమునకు రసప్రాధాన్యము గల కావ్యమునకున్న గౌరవము రాదు. కాని యుత్తముడైన కవి తాను స్వీకరించిన వస్తువును పురస్కరించుకొనియే దానికి తగినంత యుత్తమత్వమును తెచ్చును. ఆ యుత్తమత్వము పైని చెప్పిన త్రివిధమైన పరామర్శ చేత సిద్ధించును.

ఋతువులు కలవు. వీనిని పలుమంది మహాకవులు స్వీకరించి వర్ణించిరి. ఋతు వర్ణన చాలా విలక్షణమైన వస్తువు. కాలమున్నది. కాలము గడచుచున్నది. సంవత్సరములు, అయనములు, ఋతువులు, మాసములు, పక్షములు, దినములు, ఇది దృశ్యమానమైన కాలము యొక్క స్వరూపము. ఇందులో ననుభవమునకు వ్యంజకమైన బహులక్షణములు కలవి ఋతువులు. పక్షములు వెన్నెల కలిమి చేత లేమి చేత గోచరించును. దినములు సూర్య గమనము చేత భాసించును. సంవత్సరములును, అయనములును మానవ బుద్ధి యొక్క గణనము చేత నెక్కువ భాసించును. ఋతువులా రీతిని గాక మానవుని యనుభూతియందు వైలక్షణ్యమును విస్పష్టముగా భాసింపజేయునవియై ప్రకృతియందు మిక్కిలి స్పష్టముగా భాసించు లక్షణములు కలవై యనుమీయమానమగు కాలమందు స్పష్టమైన ప్రతీకలై భాసించును. ఈ ఋతువులు కాలము యొక్క లౌకికాలౌకిక లక్షణములను రెంటిని సమానముగా స్వీకరించి కాలము యొక్క ప్రధాన స్వరూపము వలె భాసించును. కాలమే భగవంతుడు. సృష్టియంతయు కాలము మీద నాధారపడియున్నది. దానినే ఋతువులు చెప్పును. ఋతువులింతటి ప్రాధాన్యముగల వస్తువు.

ఈ ఋతువుల యొక్క తత్త్వమేమి? తత్తత్త్వము చెప్పకుండ నొక కవి తద్వర్ణనము చేయును. ఆ వర్ణనమునందు దాని తత్త్వమనుమీయమానమగును. అది కవియొక్క ప్రతిభాధీనమై యుండును. ఒక కవికి తాను స్వీకరించి వర్ణించుచున్న వస్తువు యొక్క తత్త్వము తెలిసిననను తెలియకపోయినను వాని వర్ణనమునందలి నైశిత్యము చేత వానికి వస్తు తత్త్వము తెలిసినట్లే యుండును. వస్తు తత్త్వము తెలిసి చెప్పెడు కవి యుత్తముడనక తప్పదు.

ఈ కవి ఋతువుల తత్త్వము తెలిసి వ్రాసినవాడు.
ఇదిగో,

అంతము లేని కాలపథమందొక యొంటెల బారువోలె న
శ్రాంతము సాగిపోవు ఋతుజాలము జాలముసేయ, దీ తమో
దంతురమౌ విశాల జగదంతరమన్న యెడారిసీమ నే
కాంతముగా తపించు విధురాత్మను గైకొని యేగదక్కటా!

ఈ రీతిగా నీ కవి కాలముయొక్క తత్త్వము తెలిసి వ్రాసినవాడు. కావ్యమునకు నుత్తమత్వము సంపాదించు లక్షణములలో నిది ప్రథమమైనది.

రెండవది తత్త్వ భావమును తెలిసికొనుట.

స్వభావమనగానేమి? స్వభావమనగా నొక వస్తువుయొక్క లక్షణము. దాని ప్రసారించిన యితర వస్తువుల మీద భాసించుట. అట్లు భాసింపచేయు శక్తి దానియందిమిడియుండుట. వసంతర్తువును వర్ణించుచున్నాడు. ఈయనంతమైన కాలము సృష్టియొక్క సర్వ స్థలములయందు తన ముద్రను నిరూపించుచున్నది. దిగి, రాను రాను సహస్ర స్థలముల, సహస్ర లక్షణములు కలదైయున్నను, మూల భూతమైన యొక ప్రధాన లక్షణము సర్వదా భాసించి పరమోత్తమమైన వస్తువులందు కన్పించుచుండును. ఆ కాలముయొక్క ప్రధానలక్షణము నీలిమ. అదె యాకాశమునందు నిత్యముగా నభివ్యాప్తమై యున్నది. ఈ రహస్యమును తెలిసికొనుటకు గాఢమైన ఆలోచనాశక్తి కలిగియుండుట. ఈ పద్యము చూడుడు.

నీలిజలంబు, నీలిధరణీవలయంబు, వినీలశైలముల్‌
నీలితరు ప్రపంచములు నీలియనంతము, నెందుజూచినన్‌
నీలిమ, నీలిమా కలితనిర్భర కంఠము పిల్చినట్లు నా
నీలిమ దేహపంజర వినిర్గతమై పరుగెత్తెనెంతయున్‌.

ఇది యొక సృష్టి తత్త్వము. సత్త్వ రజస్తమోగుణముల వికారమైన యీ సృష్టి తమోగుణాధిక్యము చేత విజృంభించుచున్నది. దానికీ నీలిమ వ్యంజకము. దానిని చూచినవాడు, దానిని వర్ణించినవాడు రెండవ విధమైన కావ్యము యొక్క యుత్తమత్వమును గూడ సాధించినవాడు.

మూడవది విలసనము. విలసనమనగా దృశ్యమానమగుచున్న తద్వస్తువుయొక్క బహులక్షణములను వర్ణించుట. ఇచట కవి కవియగుచున్నాడు. పై రెండు వాడుత్తమజాతి కవిగా నిరూపించునవి. ఈ విలసనము వాడు కవియగుట మాత్రము చెప్పునది. ఈ విలసనమునందు గూడ రచనాశక్తి చేత నుత్తమత్వమును సంపాదించవచ్చును. కాని పైన చెప్పిన విషయములయందలి యుత్తమత్వమును సంపాదించుటకు నీవర్ణనమెప్పుడు చాలదు. ఋత్వాది వర్ణనములందు తదుత్తమత్వము వ్యంగ్యము కాకయుండును. రసప్రధాన వస్తువులందు నట్టి యుత్తమత్వము వ్యంగ్యముగా భాసింపవచ్చును.

ఈ ఋతు వర్ణనలో రెండు భాగములుండును. ఒకటి ప్రకృతియందలి ఋతువుల యొక్క విలసనము. వసంతములో వృక్షాదులు చిగురించును. హేమంతములో మంచు కురియును. శిశిరములో నాకులు రాలును. గ్రీష్మములో నెండలు కాయును. ఒక్కొక్క ఋతువులో నిట్టి లక్షణములెన్నియైన యుండును. ఇది ఋతువుల యొక్క బహిర్విలసనము. ఈ ఋతువులన్నియు మానవుని యొక్క అంతర్వృత్తి యందు మార్పులు తెచ్చును. వసంతము వచ్చినంతన మానవుడు ప్రియాసంయోగమును వాంఛించును. గ్రీష్మమునందు శరీరముయొక్క యసుఖముచేత శీతలోపచారములనే వాంఛించును. వర్షర్తువు నందు దుప్పటి కప్పుకొని పండుకొనుటకు వాంఛించును. ఇట్లు భిన్నర్తువులు మానవునియొక్క ప్రవృత్తిని భిన్నములుగా చేయును. ఇది ఋతువుల యొక్క అంతర్విలసనమని చెప్పుదము. ఈ విలసనము మానవుని ప్రకృతి మీద వానికిగల భోగసాధన సామగ్రి మీద నాధారపడియుండును. వసంతకాలము వచ్చినది. సర్వజనులకు కామవాంఛ కలిగినది. ధనవంతుడు పుష్పోద్యానములందు విహరించును. అగురు ౙవ్వాదులుపయోగించును. పూలసెజ్జలయందు పవ్వళించును. పేదవానికీ భోగసామగ్రి లేదు. కాని ఋతువులు జీవలక్షణములను పరిణమింపచేయును. ఆ ముద్రనెవ్వడును తీసివేయలేడు. ఋతువులు జీవస్వభావమును స్వలక్షణానుసారముగా మరలించును. పిల్లవానికి తద్భోగసాధనములు లేవు, ముద్రయున్నది; అది సాగదు. ఇంతటికంటె విషాద కధ యేమి ఉండును? పక్కన పెద్ద చెరువున్నది, పోయి స్నానము చేయుటకు కాళ్ళు లేవు. చలి వేయుచున్నది; కప్పుకొనుటకు దుప్పటి లేదు. హృదయమునందు నిగూఢమైన కామభావము కలిగినది. అనుభవించుటకు యోగ్యసాధనములు లేవు. ఇది మానవ చరిత్రయందలి సగముకంటె నెక్కువయైన విషాద గాధ.

ఈ కవి రెండు విధములైన మానవజీవిత గత లక్షణములను తీసికొని ప్రతి ఋతువునందు వర్ణించినాడు. సర్వమానవ జీవితము కాలముయొక్క విలసనము. అంతర్విలసనము తత్త్వభూతమైనది. దానియందు మానవసృష్టి భోగసాధన విరహితమై సగము పైన వంచింపబడుచున్నది. ఈ అంతర్విలసనమును కాలము ఋతు రూపమై ప్రబోధించుచున్నది. ఆ ప్రబోధమాధుర్యమునకు పేదవాడు దూరగుడగుచున్నాడు.

పూర్వము మహాకవులందరు ఋతువులయొక్క యీ ప్రబోధము భోగసాధనముగ వారియందలి నైగనిగ్యమును వర్ణించిన వారేగానీ పేదవారియందలి వంచనను వర్ణించిన వారు లేరు. ఈ కవియొక్క వైశిష్ట్యములో నీ వర్ణన కూడ నొకటి.

ఇట్లు ఋతుతత్త్వము, ఋతుమహాలక్షణము, వానిప్రబోధము, వాని ముద్ర, వాని ద్విధాభూతమైన యీ విలసనము తెలిసివ్రాసిన యీ కవియొక్క వ్రాత పరమోత్తమ జాతికి చెందియున్నది.

ఈ కావ్యము పేరు ఋతుఘోష. ఈ ఘోషయన్న శబ్దము దాని ద్విధాభూతమైన యీ విలసనములోనున్న ప్రబోధవైయర్థ్యమునకు వ్యంజకముగానున్నది.

ఇంక మిగిలినది పద్యరచన, పదముల కూర్పు, అలంకారముల సంయోజన మొదలైనవి. ఇవి కవియైన ప్రతివానికిని గావలసినవే. మనము ప్రతిదినము తిను నన్నమునకు బియ్యమువంటివి. అలంకారాదులు వ్యంజనములవంటివి. బియ్యమునంబరులు కావచ్చును, మొలకొలుకులు కావచ్చును, ఢిల్లీభోగాలు కావచ్చును, అక్కుళ్ళు కావచ్చును, రాజనాలు కావచ్చును, ప్రాసంగులు కావచ్చును.

ధాన్యముత్తమ జాతివే. పాతరవేయనివి వేసినవానివలె నుండవు. పురికట్టిన ధాన్యము, గాదెలలో పోసిన ధాన్యము, పాతర వేసిన ధాన్యము, దంపుడు బియ్యము, మరబియ్యము మొదలుగా నెన్నిభేదములుండును? పాతర వేసిన ధాన్యము దంచి బియ్యము చేసినచో, నా వడ్లు రాజనాలు మొదలైనవియైనచో నా భోజనము యొక్క శోభ శోభ. తదనుకూల వ్యంజన సామగ్రి కూడ నున్నచో నది భోగము.

పాతర వేయుటయనగా కావ్యశైలీవిశేషములో పూర్వకవుల మార్గమునందు పోవుట. ఇట్లే ఇతరములను సమన్వయించుకొనవలయును. ఈయన కవిత్వమునందు పూర్వ కవుల లక్షణములు మిక్కిలిగా కలవు; క్రొత్తదనమును కలదు. "ఘన ఘనాఘన గజగ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు" - ఇట్టి రచన పాతర వేసిన వడ్లు.

విరిసెను మేఘపరంపర
మెరసెను శాంపేయలతలు మిన్నులు మొఱసెన్‌
పరచెను ఝంఝా నిలములు
కురిసెను వర్షము కుంభ కుంభిత రీతిన్‌.

ఇట్టివి పురికట్టిన వడ్లు.

వలపుకైపెక్కి బిబ్బోకవతి యొకర్తు
వచ్చెనోయన, వెచ్చని భావశయ్య
నిదురవోయెడు ధనికుల మృదు కవాట
వాటముల దట్టి పిల్చెను వర్ష ఋతువు.

ఇది యొక మధురమైన వ్యంజనము వంటిది.

సర్వాలంకారములుపమామూలకములు. ఉత్ప్రేక్షాంతర్గతమైయున్న యుపమానోపమేయములకు లింగభేదము భాసించుచున్నదే కాని, ఇచట వచనమునకున్నంత పట్టింపు లింగమునకు లేదు. మరియునిది యాధునికుని భ్రాంతి.

కొదమవెలుగులు, హిమబిందు సుందరి మొదలైన గడుసు సమాసములు కలవు. ఇతనియందొక విలక్షణమైన భావన కలదు.

మేను విరిచెనేమొ మెల్లగా నిట్టూర్చి
విధుర వాయు వీచి విస్తరించె

వాయువు దీర్ఘముగా సాగినది. ఒక ధ్వనితో బయలుదేరినది. దీనిని కవి యుత్ప్రేక్షించుచున్నాడు. వాయువు నిట్టూర్చి నిట్టూర్పు వదలి యొడలు విరుచుకున్నట్లున్నదట. ఇట్లనుటకు గాఢమైన యోజనాశక్తి కావలయును.

ఇట్టి కవియొక్క రచనయందు కూర్పు యొక్క రమణీయత చూపించుట యనవసరము. అట్టి రమణీయతకితని గ్రంథము పండిన పంటచేను. ఇట్టిరచన చేయగలవారీనాడు పట్టుమని పదిమందియైనను లేరు. ఈయన చిరాయువై యొక మహాకావ్య నిర్మాతయగు గాక.

(సం.) విశ్వనాధ సత్యనారాయణ.
1-2-1962.

AndhraBharati AMdhra bhArati - Ritughosha - Gunturu Seshendra Sharma -- kavittvatattva prakAsamu - Kavisamrat Viswanatha Satyanarayana( telugu andhra )