కావ్యములు ఋతుఘోష గుంటూరు శేషేంద్ర శర్మ

పరిచయ వాక్యాలు
(సరస్వతీపుత్ర శ్రీమాన్‌ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు)

కాళిదాసు ఋతుసంహారకావ్యం ప్రసిద్ధమే; నేటి ఆంధ్ర మహాకవి తెలుఁగు ఋతువులను వర్ణించినాఁడు. మిత్రుఁడు సి. నారాయణరెడ్డి కూడా ఋతువులనుగూర్చి ఒక కావ్యము వ్రాసినట్లు జ్ఞాపకము. అసలు కాళిదాసును ఋతువులను వర్ణించుటకు ప్రేరేపించినవాడు వాల్మీకి. కాని ఎందరు వ్రాసినను ఈ నాటికిని ఋతువర్ణనకు వాల్మీకినే చదువుదామనిపించడం చిత్రం. "విశ్వనాథ" వారి తెలుగు ఋతువులు తెలుఁగు దేశంలో కనపడే ఋతువులన్నమాట. వారు వర్ణించిన ప్రకృతి శోభలు - తెలుగు దేశం లోనే యేమిటి, యితర రాష్ట్రాలలోనూ కనిపిస్తాయి. ఆంధ్రదేశ లక్షణాలను ముఖ్యంగా, తక్కినవానిని ఆనుషంగికంగా చెప్పినారని పేరును సమర్థింపవచ్చును. ప్రబంధాలలో ఋతువర్ణన లేని రచన లేదు. కొందరి కవిత్వాలు బాగనే ఉన్నా అనేకుల రచనలు విసుగునే కలిగిస్తాయి. ఇంతకూ యీనాడు ఋతువులు వాటి అందాలు పుస్తకాల్లోనే చదువుకోవలె. ఆంగ్లకవి టి. ఎస్‌. ఇలియట్‌ వారి ఏప్రిల్‌ నెలని అవహేళన చేస్తాడు. ఒకప్పుడు వారికి ఏప్రిల్‌ అందాల బరణి. నేటి ఋతువుల గురించి యే "ఆరుద్ర" వంటివాడో, "బాలగంగాధరతిలక్‌" వంటివాడో వ్రాస్తారేమో అంటే వ్రాయడం లేదు. మా మిత్రులు శేషేంద్రశర్మ గారు కూడా తలచుకుంటే వ్రాయగలరు. ఈ ఋతుఘోషలో ఆ వాసన కూడా కొంచెం కొట్టింది.

"ఋతుఘోష" అనే పేరు మొట్టమొదట నాకు చిత్రంగా తోచింది. కావ్యం చదివిన తర్వాత ఆ పేరు పెట్టడం సముచితమే అనుకున్నాను. మీరు చదవండి; అతడా పేరెందుకు పెట్టినాడో తెలుస్తుంది. కాళిదాసాదులు ఋతువుల అందాన్నే చూచినారు. విశ్వనాధాదులూ అలాగే చేసినారు. ఒక ఋతువులలో ఏమిటి, ప్రతి దానిలోనూ అందాన్ని భావించడమే కళకు పరమార్థమని వారి వూహ. కావ్య ప్రకాశములో చెప్పిన లక్షణం ఈ సిద్ధాంతాన్నే దృఢపరుస్తుంది. 'నియతికృత నియమరహితాం । హ్లాదైకమయీ మనన్య పరతంత్రాం । నవరస రుచిరాం నిర్మితి । మాదధతీ భారతీ కవేర్జయతి. ' - ఏదో ఊరికే అన్నాను గానీ - ఒక కావ్య ప్రకాశకారుడేమిటి, ప్రతి అలంకారికుడూ అందాని కోసం అర్రులు జాచినాడు. కాని నేడు ఈ మూల సిద్ధాంతాలకు ప్రతీప సిద్ధాంతాలు యితర దేశాలలో బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. "The contemplation of the horrid or sordid or disgusting by an Artist, is the necessary and negative aspect of the impulse toward the pursuit of beauty. But, not all succeed as did Dante in expressing the complete scale from negative to positive. The negative is the most importunate." (T. S. Eliot) వికృత స్వరూపాలను భయంకరంగా తీర్చి దిద్దుతూ ఉన్నారు. ఆ వర్ణనలు కూడా సౌందర్యంలోనే అంతర్భూతాలవుననుకుంటాను. ఏది ఎలాగున్నా కళ యొక్క మూల సూత్రాలనే నేటి రచయితలూ విమర్శకులూ కదలించి వేస్తున్నారు. ఆ తీరుతెన్నులు ఈ కావ్యంలోనూ కొన్ని ఉన్నాయి.

ప్రస్తుతము ప్రకటించిన "ఋతుఘోష" రెండు కావ్యాల సంకలనము. ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమ గాథ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఈ సంకలనమెందుకని కవిగారినే ప్రశ్నించినాను. "ఋతువర్ణనమొక్కటయితే చదవడానికి విసుగు కలిగిస్తుందేమోనని ఈ పని చేసినా"మన్నారు. చేర్చకుండా ఉంటే బాగుండేదని నా ఊహ. ఇందులోని ఋతువర్ణనలు విసుగు కలిగించడం లేదు. ప్రణయ గాధ పద్యాలు లేకుండా నా మిత్రులు కొందరికి కావ్యం చదివి వినిపించినాను. వారు సంతోషముతో సాంతముగా విన్నారు. "ఋతుఘోష" లోని వర్ణనా పద్ధతికి, ప్రణయ గాధలోని రచనకూ సరిగా సంవాదము కుదరడం లేదు. అవి వారేనాడో వ్రాసినవి. నాటి భావాలు వేరు; ఆనాడు వారు ప్రేమించిన కవులు వేరు. నేటి పరిణతి మరియొక తీరు. కానీ నేనిపుడీ రెండు రచనలనూ కలిపి విమర్శింపవలసి వచ్చుటచే వారి నేటి స్వరూపాన్నే ప్రత్యేకముగా చెప్పుటకు వీలు లేదంటున్నాను. ఈ విమర్శనా విషయము నేటి శర్మ గారు కొంత, ప్రాత శర్మ గారు కొంత.

శర్మ గారికి ప్రాచీన కవులందరిపైనను గొప్ప యభిమానం ఉన్నది. ప్రాచీన కవులనగా రసవాదులన్న మాట. తిక్కన, పింగళి సూరన మొదలగు వారిపై వీరికి ప్రీతి ఎంతో చెప్పలేను. చాల చోట్ల నన్నయభట్టులను పుణికి పుచ్చుకున్నారు. భట్టారకులే తరువాతి ప్రబంధ కవిత్వానికి ఒరవడి. ప్రాచీనులలో గూడా శ్రీనాధునిపై యీతనికి రెండింతలభిమానమున్నట్లున్నది. సమాస పరికల్పన శ్రీనాధుని వలెనే నిశంకటముగా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రింది పద్యం చూడండి. -

సీ॥
ఘన ఘనా ఘన గజ గ్రైవేయ ఘంటికా
టంకారములకు ఘంటాపథమ్ము
శక్ర చాపోదగ్ర శార్దూల పాలనా
విభవోన్నతికి భూరి విపినసీమ
చటుల ఝంఝామరుచ్ఛత కోటి భేతాళ
లుంఠన క్రియలకు రుద్రభూమి
పటు తటి ద్విలసన బ్రహ్మరాక్షస కఠో
రాట్టహాసమున కహార్యబిలము
గగన భాగమ్ము ప్రావృషద్విగుణరోష
ఘటిత నటనోగ్ర ధాటీ విఘటిత ప్రకట
కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల
వికట భ్రుకుటీ కుటీర ముద్విగ్నమాయె.

ఇందులో గీతపద్యంలో "ప్రకట" " భ్రుకుటి" అనే చోట ఛందస్సు కోసం ఛాందసులు కీచులాడవచ్చు. "భ్రుకుటి" లోని రకారాన్ని తేల బలకడమూ కద్దు. ఒత్తి పలకడమూ కద్దు. తిక్కన గారు "వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త నర్తన" అన్నారు. ఛందస్సు, వ్యాకరణము, సక్రమంగా తు. చ. తప్పక పాటించి వ్రాసిన వారిని మహాకవులని లోకం గుర్తించడంలేదు. భట్టి మహా వైయాకరణుడు. కానీ మహా కవి కాడు; కాళిదాసులోనే పాణినీయాన్ని ఉల్లంఘించిన ప్రయోగాలు చాలా ఉన్నాయి. మల్లినాధుడు "ఐంద్రాది" వ్యాకరణాల సహాయంతో వానిని సమర్థించినాడు. కొన్ని చోట్ల "ఇతి చింత్యం" అని ముందుకు పోయిన ఘట్టాలూ ఉన్నాయి. నియమం పనికిరాదని కాదు నేను చెప్పడం. ఎక్కడో ఒక్క పొరపాటు జరిగితే దానిని పెద్ద చేయరాదంటాను. కావలసింది రసానుభూతి కాని శాస్త్ర నిర్వాహము కాదు; దానికి క్షేత్రాలు వేఱు. రసదృష్టి లేనివారూ, అసూయాపరులూ యిట్టి చిన్న నెరసులను పట్టుకుని గల్లంతు చేస్తారు. దానితో రసోపాసికి కలిగే నష్టమేమీ లేదు. వారి మనోమాలిన్యం బైట పడుతుంది, అంతే.

సమాసాలలోనే గాక సాధారణంగా వ్రాసినప్పుడు గూడా అక్షరాలా శ్రీనాధుడ్ని సాక్షాత్కరింపచేసుకోవలెనని శర్మ గారి ఆశ. ఈ క్రింది పద్యం చూడండి.

"యోషాజిగీషా ముహు
ష్టంకారం బొనరించు వేళల నధిజ్యంబైన శుంభన్నిరా
టంక శ్రీ మకరాంక చాపము కనిష్ఠంబౌను నీ ఠీవికిన్‌" ---

ఈ పద్యాన్ని చూచి ఏమంటారు? చెప్పిన విషయమేమీ లేకపోయినా, "శైలి" అనే రసవాదంలో యేమో ఉన్నదనిపించడం శ్రీనాధుని వంతు.

"సలిలంబు త్రిషవణస్నాన క్షమంబౌనె
అంభోజ పత్ర దీర్ఘాయతాక్షి" ---

అంటాడు శ్రీనాధుడు. ఇందులో చెప్పిన విషయమేమీ లేదు. కానీ పదాలతో పాఠకులను మోహింపచేస్తున్నాడు. ఈ గుణం శేషేంద్ర శర్మ లో నిండుగా కనపడుతుంది.

చూడండి. "లోలంబంబు ధ్వనించె, నాకసము గండూషించె బీరెండలన్‌" -- ఇక్కడి "గండూష" శబ్దము ఒక పెద్ద సార్వభౌముని వలె ఉంది; ఆ పాదము లోని సౌందర్యాన్నంతా తానే పాలిస్తూ ఉన్నది. ఇట్టి రచనలు చూచినప్పుడు, "ఒక్క ప్రౌఢ శబ్దం యెంత పని చేస్తుంది!" అని ఆశ్చర్యం కలుగకపోదు.

నన్నయగారి తర్వాత శయ్యాలాలిత్యాన్ని పెద్దనగారివలె సాధించినవారు లేరని నా వూహ. విజయనగర సాహిత్యములో ఒక్కొక్కరొక్కొక్క గుణమునకు పట్టాభిషిక్తులు. "శిరీషపేశల సుధామయోక్తి" కి పెద్దనగారే సార్వభౌములు. వారిని చక్కగా ఉపాసించిన చోటులు గూడ అక్కడక్కడ "ఋతుఘోష" లో కన్పిస్తాయి. ఇదిగో

పద్యము --

"వలమాన జ్వలమాన జీవన వనీ వాసంత వేశంత మౌ
యెల బ్రాయమ్ముననున్న నన్గని కళా హేలా మనోవీధులన్‌
కలకంఠమ్ములు కూయగా తనువులం గైపెక్కగా భామినీ
కలభమ్ముల్‌ శలభమ్ములాయె విలసత్‌ కామానల జ్వాలకున్‌."

ఈ కావ్యంలో ఎక్కడబట్టినా "మనోహర ధీర గంభీర శైలి" కన్పిస్తుంది. రీతిని ఇంతగా సాధించిన వారు అరుదు. ఈ గుణములో ఇతడు హంపీ క్షేత్రాన్ని వ్రాసిన కవికి యే చుట్టమో అవుతాడు. అసలు రీతి కవిత్వమే ఆంధ్రుల ప్రత్యేకత. వ్రజ భాషలో "రీతికాల"మని బ్రహ్మాండంగా కొన్ని శతాబ్దాలను విభజిస్తారు. ఆ కవుల నిర్వహణ కొంత చక్కగానే ఉంటుంది. అదియైనా ఆంధ్రానికి తర్వాతనే. మళయాళంలోనూ కొద్దిగా ఉన్నది. తమిళంలో రీతి కవిత్వం లేదనే చెప్పవచ్చు. "మధుర కవి ఆళ్వారులు" కొంత ప్రయత్నం చేసిరి. కానీ ఆ భాషలో అది రక్తికి రాలేదు. హళగన్నడములో రీతి కవితలున్నవి. పంపడా గుణమును బ్రహ్మాండముగా సాధించెను. శక్తి కవి రన్నడు కూడా తీసిపోలేదు. హొసగన్నడములో రీతిని గొప్పగా సాధించిన వారు లేరు. కుమారవ్యాసునిలో గూడా కన్పించదు. దీనికి కారణం, తరువాత వచ్చిన షట్పదీ వృత్తాల ప్రాబల్యం. వ్రజ భాషలో 'దోహా'లు చాలా చిన్నవి. కొంత పెద్ద వృత్తములు వ్రాసిన రసఖాన్‌ మొదలైనవారు రీతిని చక్కగనే పోషించిరి. సంస్కృతముతో పొత్తుగలపనిది రీతి చక్కగా కుదరదేమో అని నా అనుమానం. తమిళములో అందుకే వృద్ధికి రాలేదనుకుంటాను. మళయాళ కన్నడములలో ఛందస్సు చిన్నదైపోయినది. ఏతావాతా - సంస్కృతం తర్వాత రీతిని చక్కగా నిర్వహించే భాగ్యం ఆంధ్ర భాషకే దక్కినదంటున్నాను.

శర్మ గారిలో విశ్వనాధ, జాషువా, రాయప్రోలు, కృష్ణ శాస్త్రి మొదలగు వారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా రాయప్రోలు, విశ్వనాధలు చాలాసార్లు ప్రత్యక్షమౌతారు. దీనికి కారణం శర్మ గారు భావకవితా యుగంలో రచన చేయడానికి ఉపక్రమించటమే. ఇక - విశ్వనాధ అంటే అతడు నేటి కవితా ప్రపంచం లో ఉదీర్ణుడు. ఆ పలుకుబడి నుంచి తప్పించుకున్నవారు చాలా తక్కువ. ఒకరి కవిత్వం లో మరియొకరి చాయలుండకూడదని యెవరో కొందరు పిల్లలు అంటూ ఉంటారు. అంతకు ముందు లేనిది ఏ కవీ కొత్తగా తెచ్చి పెట్టడు.

తాయే పద విన్యా సాస్తా యేవార్థవిభూతయః
తథాఽపి నూత్నం భవతి కావ్యం గ్రథన కౌశలాత్‌.

ఉన్నవి ఉన్నవానివంటివీ చెపుతాడు. గుణ ప్రాధాన్యాన్ని బట్టి యీ కవిలో యీ గుణమెక్కువ, ఆ కవిలో ఆ గుణమెక్కువ అంటూ ఉంటాము. వాల్మీకి, భాసుడు, అశ్వఘోషుడు, మొదలైన కొందరిని తీసివేస్తే కాళిదాసులో ఎంత మిగులుతుందో వారే చెప్పాలి. పెద్దన్న గారు పేశల సుధామయోక్తులకు పేరే గానీ, భావనూత్నతకు కాదు. భావనూత్నత కొంత వరకు రాయలలోను, రామకృష్ణునిలోను కనపడుతుంది. శర్మ గారికి తెనాలి రామకృష్ణుడన్నా పక్షపాతమే. ఈ పద్యం చూడండి --

వర్షా గర్జ దమోఘ మేఘపటలీ వాఃపూర ధారా సము
త్కర్షామర్ష నిపీడ్యమాన జనతా కంఠీరవంబై, నభ
శ్శీర్షాంతఃపుర భోగ భాగ్య వనితాశ్లేష ప్రభాహర్ష దు
ర్ధర్షాగార బిడాలమై నడచె నౌరా కాలముద్వేలమై.

పద్యం దురుసుగా కొట్టవచ్చినట్లుంది. ఇక్కద బిడాలాన్ని తీసుకుని రావడం రామకృష్ణుని వంటి చూపు. అట్లే - ఆకాశంలోని చుక్కలు "తమశ్చికుర నికరమ్ములో సికత రీతిగ" నున్నవనుటయు. -- ఈ క్రింద పద్యములో కవి నేరుగా ఉమర్‌ ఖయాం శిష్యుడై కన్పిస్తాడు.

ఇంతీ! ఓ మధుర స్రవంతి! శశి తానెన్నాళ్ళు తారా పదా
క్రాంతుండై విలసిల్లు నన్నిదినముల్‌ కాంక్షింప వేరేదియున్‌
సంతోషించిన చాలు నీ మృదు పదచ్ఛాయా సమీపంబులన్‌
కాంతా మంగళ కామినై ప్రణయ శాఖా కోకిల స్వామినై.

వర్షర్తువును వర్ణిస్తూ, "ఆత్మ వేదన కొక యాకారమై తోచి నేటి రేయి నన్ను కాటు వేసె" - అంటాడు. ఇట్టి పోకడలనే subjective poetry అంటారు మర్మవిదులు. "విధురవాయు వీచిని" చూచి ఆకాశం "మేను విరిచెనేమొ" అనడం కూడా సామాన్యమైన భావం కాదు. గ్రీష్మర్తు విజృంభణాన్ని "దుర్జన రాజ్య శాసనా"నికి పోలుస్తాడు. ఆ పద్యం శ్రీనాధుని ధాటిలో నడచిన చక్కని రచన. రిక్షావాడూ, చాకలి, బండలను లాగే కూలివాడు, గుడ్డి దీపపు వెలుగులో కూర్చున్న ముసలమ్మా, -- "అణగారిన బాధితు"లంతా యీ రచనలో చోటు చేసుకున్నారు. రిక్షావానిపైన యింత పెద్ద పద్యం మరెవ్వరూ చెప్పి ఉండరనుకుంటాను. (వర్షర్తు. 4. ప) ఈ పద్యమే నిజంగా వానికర్థమైతే యీ సానుభూతికి వాడెంత సంతోషిస్తాడో!

శర్మ గారు ఆస్తికులు. కాని అక్కడక్కడా సంశయవాదిగా మారుతారు. అది తాత్కాలికంగా కలిగిన పొరమాత్రమే. ఈ "బాధకులూ బాధితులూ", ఒకచోట దుర్భర దారిద్ర్యం మరొకచోట జీర్ణముగానట్టి సంపదా - ఇదంతా ఏమిటి? ఈ ప్రపంచం యిలా ఉండడం ఏమి న్యాయం? అని ఆశ్చర్యపోతాడు. ఈ సామాజిక పద్ధతి మనం తయారుచేసుకున్నదే అని కవికి తోచదనుకుంటాను. దానికి కర్మ సిద్ధాంతంపై ఉన్న ప్రగాఢ విశ్వాసం కారణం. సూర్యుడ్ని బీదలకు మేలు చేయమని అతడు వేడుకున్నపుడు మనకు జాలి వేస్తుంది. ఆ అమాయకతకు నవ్వు కూడా వస్తుంది.

ఈ కావ్యములో మూడు విధములైన భాష ఉన్నది. శరద్వర్ణన వ్యావహారిక భాషలో నడిచింది. సంధులు విశకలితం చేయడం కూడా జరిగింది. కొన్ని రచనలు స్వచ్ఛమైన గ్రాంధిక భాషలో సాగినాయి. మరియొక్క పద్ధతి యేమిటంటే వృత్తాలు వ్యావహారికంలో వ్రాయడం.

ఉదాహరణ :-

"ఒక మల్లె విరిసింది ఊహలో మురిసింది
యేయాస నీమీద యెంచుకొనెనో? "

ఇట్లే సాగుతుంది పద్యం.

"హిమబిందు సుందరి", "సుమ సముద్రము", "కీటకయోగి", "వల్లిక తపసి", "అలరు గందము" అని యేమేమో క్రొత్త క్రొత్తగా చెపుతాడు. వ్యావహారిక భాష కావ్యయోగ్యం కాదనే వాదంపై నాకు నమ్మకం లేదు. "గురజాడ" పుట్టిన తర్వాత కూడా అలా భావించే దురదృష్టవంతులెవరైనా ఉంటే, వారా పద్యాలు వదలివేసి తక్కినవి చదువుకోవచ్చు. "కాలపధమందొక యొంటెల బారు వోలె" ఋతువులు పోతున్నాయన్నప్పుడు నా భావంలో ఒక్కసారి శ్రీ శ్రీ మెఱసినాడు.

శర్మ గారికి ప్రాచీన సాహిత్యం పై గౌరవం ఉంది, నవకవులపై సానుభూతి ఉంది; ఆస్తికత ఉంది, సంశయమూ ఉంది. బీదలపై సానుభూతీ, వారు బాగుపడవలెననే ఆతురతా, ఇంకా బాగుపడలేదేమనే అక్కసూ, కర్మవాదం పై విశ్వాసమూ, -- ఇన్ని భావాల మధ్య నలిగిన, నలుగుతూ ఉన్న ఆత్మ పెట్టే ఘోష, "ఋతుఘోష".

ఇక చదవండి ---

పుట్టపర్తి నారాయణాచార్యులు,
18-2-1963.

AndhraBharati AMdhra bhArati - Ritughosha - Gunturu Seshendra Sharma -- parichaya vAkyAlu (sarasvatIputra shrImAn Puttaparti Narayanacharyulu gAru) ( telugu andhra )