కావ్యములు ఋతుఘోష గుంటూరు శేషేంద్ర శర్మ

ఏం చెప్పను?
(ఆరుద్ర)

ఆదిలో కాళిదాసు ఋతుసంహారం వ్రాశాడు. విశ్వనాధ సత్యనారాయణగారూ వ్రాశారు తెలుగులో. సి. నారాయణరెడ్డి గారూ చిత్రించారు ఋతువుల్ని మాత్రా ఛందస్సులలో. ఇప్పుడు శేషేంద్ర శర్మ గారు వ్రాసేది కూడా ఋతుసంహారమే.

నిజం చెప్పొద్దూ ! ఆధునిక కవిత పాతపద్యాల చట్రాలలో మేకు బందీ అయిపోడం నాకిష్టం లేదు. చెయ్యి తిరగడానికి వెయ్యి విధాలుగా సంవిధాన వ్యాయామం చెయ్యవలసిందే. అశోకుడి కాలం నాటి నాణెములకీనాడు విలువ లేకపోలేదు. అయితే అవి వస్తుప్రదర్శనశాలలలో ఉండవలసినవే.

కరెన్సీలలో లేనీ మాటలతో సమాసాలు వాడే కవులపట్ల నాకెంత సానుభూతి ఉన్నా - ఏం లాభం ? కవిత్వ పరీక్షలో నేను నిర్మొహమాటస్థుణ్ణి. శర్మ గారు తమ శక్తిసామర్థ్యాలు వృథా చేస్తున్నారని చెప్పక తప్పదు.

పులి మీద స్వారి చెయ్యడం చాలా కష్టం. శార్దూలాలలో శ్రీనాథుడూ, ధూర్జటీ సర్కస్‌ చేయించారు. మన శర్మ గారికి శ్రీనాథుడు అభిమాన కవి. అందుకే పులికోరలలో చలిక్రాగుతూ సురక్షితంగానే ఉన్నారు.

శర్మ గారు నేటి తెలుగులో ఆలోచించిన భావాలను పాత తెలుగులోకి తర్జుమా చేసి పద్యాలలో బిగించారు, అలాంటిచోట్ల అందం చెడింది. ఆవేశంతో ఇవాళ ఆలపించవలసినట్లూ ఎలుగెత్తినచోట్ల ఎంతో బాగున్నాయి పద్యాలు.

ఉదా॥
"వివిధ నిమ్నోన్నత వీధులం బరుగెత్తి
వైజాగులో మేనువాల్చెనొకడు."

అలానే,

"ఓ పరమేశ్వరా! యెచటనుంటివి...
నీవు శిలవా కలవా సెలవీయుమో ప్రభూ!"

ఉత్పలమాల ఒక్కటి చాలు శర్మ గారి ఆవేశాన్ని అభ్యుదయ భావాలనీ పద్యం నడిపించే తీరునీ అర్ధం చేసుకొనడానికి.

త్రిపదలు కూడా యిందులో రాశారు. అక్కడ తెలుగుతనముంది. శర్మ గారు తెచ్చిపెట్టుకున్న సంస్కృతాన్ని విప్పేసి -- తెలుగు దిరుసులో ధరిస్తే చూడముచ్చటగా ఉంటుంది.

శుభం.
ఆరుద్ర.

AndhraBharati AMdhra bhArati - Ritughosha - Gunturu Seshendra Sharma -- EM cheppanu? (Arudra) ( telugu andhra )