కీర్తనలు దాసు శ్రీరాములు మూట లడిగితినా - ముల్లె లడిగితినా
యదుకుల కాంభోజి - త్రిపుట
పల్లవి:
మూట లడిగితినా - ముల్లె లడిగితినా
మూతి త్రిప్పెద వేమిరా - ముద్దిడరా
మోము త్రిప్పెదవేమిరా
॥మూట॥
అనుపల్లవి:
నోటి మాటకైన - నోచుకో నైతినా
కూటములా ముద్దు - కోమలి పాలైన
॥మూట॥
చరణ:
త్యాగశీలుడ వీవు - దాచిన సొమ్మంత
వేగ నాకిమ్మంటినా
బాగాలివ్వనైన - పనికి రానైతినా
బాగాయె నది యెంత - బంగారు బొమ్మైన
॥మూట॥
వడిగ నే నీ పాన్పు - వద్దకు జేరగ
వద్దు వద్దన నేలరా
అడుగులొత్తగ నైన - అనుకూల పడరాదా
పడతి బోధన లిహ - పర సాధనములైన
॥మూట॥
పాలించు శ్రీ తోట్ల - వల్లూరి వేణుగో
పాలా మ్రొక్కితి మ్రొక్కితి
శ్రీల మించిన దాసు - శ్రీరామ కవి కృతి
వాలాయముగ నిన్ను - వర్ణన జేసిన
॥మూట॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - muuTa laDigitinaa - mulle laDigitinaa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )